Titanic Tour Cost: టైటానిక్.. ఈ పేరు వినగానే అందరికీ భారీ షిప్.. ప్రేమకథ గుర్తుకు వస్తుంది. కళ్లకు కట్టేలా టైటానిక్ ప్రమాద దృశ్యాలను ప్రపంచమంతా తెరపై చూసింది. అయితే దానిని దగ్గర నుంచి చూడాలనేది చాలామంది కల.. 112 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన ఆ షిప్‌ను నేరుగా చూసే అవకాశం కల్పిస్తామంటోంది ఓ సంస్థ. ఇందు కోసం టికెట్ ధరను కూడా నిర్ణయించింది.

అంతరిక్ష పర్యటనలా..
కెనడా న్యూఫౌండ్‌ల్యాండ్‌కు 400 మైళ్ల దూరంలోని ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఒక భారీ నౌక వేగంగా ముందుకు వెళ్తోంది. దీనిలో ప్రయాణిస్తున్న స్టాక్టన్ రష్‌కు మనసులో చాలా ప్రణాళికలు ఉన్నాయి. ‘‘భవిష్యత్‌లో అంతరిక్ష పర్యటనలు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. సముద్ర గర్భ పర్యటనలూ ఇలానే ప్రజలకు చేరవయ్యే రోజు వస్తుంది’’ అని ఆయన అన్నారు. ఆయన కంపెనీ ‘‘ఓషన్ గేట్’’ సముద్ర గర్భంలోని విశేషాలను ప్రజలకు చూపించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈలాన్ మస్క్, రిచర్డ్ బ్రాస్నన్, జెఫ్ బెజోస్ లాంటి వారు అంతరిక్ష వాణిజ్య పర్యటనలకు వ్యూహాలు రచిస్తున్నట్లే సముద్ర గర్భంలో పర్యటనలకు ఈ సంస్థ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. డబ్బులు ఉంటే చాలు, పెద్దగా నైపుణ్యాలు లేకపోయినా ఈ పర్యటనలకు వెళ్లొచ్చు.
3,800 మీటర్ల అడుగున…
ఉత్తర అట్లాంటిక్‌లో రష్ ఇప్పుడున్నచోట చాలా కీలకమైనది. ఎందుకంటే ఇక్కడే చరిత్రలో అత్యంత ఘోరమైన టైటానిక్ ప్రమాదం చోటుచేసుకుంది. 1912, ఏప్రిల్‌లో ఇక్కడే టైటానిక్ మునిగిపోయింది. ప్రస్తుతం దాని శిథిలాలు ఉపరితలానికి 3,800 మీటర్ల అడుగున ఉన్నాయి.
సముద్ర గర్భంలోకి వాణిజ్య పర్యటనలు..
సముద్ర గర్భంలో వాణిజ్య పర్యటనల కోసం ప్రణాళికలు రచిస్తున్న రష్.. ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనదిగా చెబుతున్నారు. ‘‘ఇంగ్లిష్‌లో మూడు పదాలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో అందరికీ తెలుసని ఒక ఆర్టికల్‌లో చదివాను. అవి ఏమిటంటే.. కోకాకోలా, గాడ్, టైటానిక్’’అని ఆయన వ్యాఖ్యానించారు.

వాహనంలో సముద్ర గర్భంలోకి..
అయితే, రష్ కంపెనీ టైటానిక్ కల నిజం కావాలంటే మొదట తేలికపాటి పదార్థాలతో ఒక సబ్‌మెర్సిబుల్ అంటే ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాన్ని తయారుచేయాల్సి ఉంటుంది. టైటానిక్ ఉన్న లోతుకు కనీసం ఒకసారికి ఐదుగురినైనా ఇది తీసుకెళ్లగలిగేలా ఉండాలి. కానీ, ఇలాంటి వాహనాలను తయారుచేయడం చాలా కష్టమని అంతా భావించేవారు. అయితే, అలా తయారుచేసిన వాహనంలో గత ఏడాది రష్ విజయవంతంగా సముద్ర గర్భంలోకి వెళ్లి వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన అదే ప్రాంతంలో ఉన్నారు.
టికెట్ ధర రూ..2.07 కోట్లు..
ఇప్పుడు నౌకలో ఆయన, ఓషన్ గేట్ సిబ్బంది, శాస్త్రవేత్తలతోపాటు సముద్ర గర్భ ప్రయాణంపై ఆసక్తి కనబరిచే కొంతమంది ఔత్సాహికులు ‘‘మిషన్ స్పెషలిస్ట్స్’’ కూడా ఉన్నారు. ఈ ఔత్సాహికులు ఒక్కొక్కరు టైటానిక్ శిథిలాలను చూసేందుకు 250,000 డాలర్లు (సుమారు రూ.2.07 కోట్లు) చెల్లించారు. సముద్ర గర్భంలోని జీవజాతులపై సమాచారం అందించడంతోపాటు అక్కడి ప్రకృతి చిత్రాలు తీయడం, శాస్త్రవేత్తలకు తోడ్పడటం లాంటి అంశాల్లోనూ ఈ పర్యటనలు ఉపయోగపడే అవకాశముంది.