Saif Ali Khan
Saif Ali Khan : ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన దేశవ్యాప్తంగా ఎలాంటి దుమారం రేపిందో మనమంతా చూసాము. ఐదుగురు దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి, పని మనిషిపై దాడి చేసి, ఇంట్లోని విలువైన వస్తువులను దోచేయాలని చూసారు. సైఫ్ అలీ ఖాన్ వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆయన పై ఆరు కత్తి పోట్లు జరిగాయి. వెన్నుముక లో అయితే ఒక కట్టి సగభాగం వరకు ఇరుక్కుపోయింది. దానిని డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు. ఇప్పుడు ఆయన ప్రాణాపాయం స్థితి నుండి బయటపడ్డాడు. త్వరలోనే డిశ్చార్జ్ కూడా అవ్వబోతున్నాడు. ఆయనపై దాడి చేసిన వారిలో ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇతను బంగ్లాదేశ్ దేశానికీ చెందిన వాడిగా గుర్తించారు పోలీసులు. ఇది ఇలా ఉండగా సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ ఖర్చులకు అయిన బిల్లు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి.
లీలావతి హాస్పిటల్ లో ఆయనకీ చికిత్స జరిగింది. దేశంలోనే బెస్ట్ డాక్టర్లు సైఫ్ అలీ ఖాన్ సర్జరీ కోసం పని చేసారు. డాక్టర్ల ఫీజు ఖర్చులు, మందు బిల్లులతో కలిపి మొత్తం 36 లక్షల రూపాయిలు అయ్యిందట. ఇందులో పాతిక లక్షలు భీమా కంపెనీ అందించినట్టు తెలుస్తుంది. 36 లక్షల రూపాయిల ఖర్చు అంటే సాధారణమైన విషయం కాదు. ఆ డబ్బులతో పది కుటుంబాలు బ్రతకొచ్చు. సామాన్యులకు ఇలాంటి సమస్య ఎదురైతే ట్రీట్మెంట్ ఇదే స్థాయిలో జరుగుతుందా అంటే అనుమానమే. అయితే సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్త ఎంత వరకు నిజం అనేది ఇంకా తెలియదు. వాస్తవానికి ఇలాంటివి బయటకు రానివ్వరు. కానీ మీడియా అత్యుత్సాహం కారణంగా ఈమధ్య కాలం లో ఇలాంటివి చాలా తేలికగా సోషల్ మీడియా లో లీక్ అవుతున్నాయి. ఇలాంటి సంఘటనలపై సోషల్ మీడియా లో సెలెబ్రిటీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే సైఫ్ అలీ ఖాన్ ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఆడియన్స్ ని అలరించాడు. అయితే ఈమధ్య ఆయన హీరో రోల్స్ కంటే ఎక్కువగా, క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ ఎక్కువగా చేస్తున్నాడు. గత ఏడాది ఆయన ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో ఆయన పోషించిన విలన్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ తో సరిసమానమైన పాత్రలో ఆయన నువ్వా నేనా అనే రేంజ్ లో తలపడ్డాడు. ఈ చిత్రానికి ముందు ఆయన ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం లో రావణుడిగా నటించాడు. త్వరలోనే ఆయన ‘దేవర 2 ‘ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. వాస్తవానికి కొరటాల శివ ఈ నెలలోనే సైఫ్ అలీ ఖాన్ మీద కొన్ని కీలక సన్నివేశాలను తీయాలని అనుకున్నాడు. కానీ ఇంతలోపే ఈ దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది.