CM Chandrababu : గత వారం రోజుల నుండి మీడియా లో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ని ప్రకటించాలి అంటూ టీడీపీ ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశం పై సోషల్ మీడియా లో టీడీపీ, జనసేన పార్టీల అభిమానుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఊరికే రాలేదని, ఎన్నో త్యాగాలు చేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకే ఆయనకీ వచ్చిందని, కేంద్ర మంత్రి పదవి ఆఫర్ వచ్చినప్పటికీ కూడా రిజెక్ట్ చేసి కేవలం ఆంధ్ర ప్రదేశ్ ఉన్నతి కోసం పని చేస్తున్నాడని, నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రి చేయడం లో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ పవన్ కళ్యాణ్ ని ముఖ్య మంత్రిగా చూడాలని మేము కూడా పదేళ్ల నుండి కోరుకుంటున్నామని, ఆయనని ముఖ్యమంత్రిగా ప్రకటించాలంటూ పవన్ అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసారు.
ఈ గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి కొట్లాడుకునే స్థాయికి చేరుకుంది. ఇరు పార్టీలకు చెందిన అభిమానులు సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు లను దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టారు. వాటిని వైసీపీ అభిమానులు తమ సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. కూటమి చీలిపోతుందని, రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడివిడిగా పోటీ చేస్తారని, అప్పుడు వాళ్లిద్దరూ ఓడిపోయి జగన్ ముఖ్యమంత్రి అవుతాడని కామెంట్స్ చేసారు. అయితే సోషల్ మీడియా లో జరుగుతున్న ఈ రచ్చ మొత్తాన్ని గమనించిన టీడీపీ అధిష్టానం, లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే అనవసరపు వాదనకు తెర దించాలని, నాయకులూ దీనిపై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కూటమి ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని. ఇది క్షమించరాని తప్పిదమని, ఇక నుండి ఈ ప్రచారాలపై స్పందించడం ఆపకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
దీంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులూ ఈ అంశం పై మాట్లాడడం మానేశారు. కూటమి లో ఏ నిర్ణయమైనా నాయకులందరూ చర్చించుకున్నాకే తీసుకుంటామని, ఈలోపు అత్యుత్సాహం మంచిది కాదంటూ స్పష్టం చేసారు. ప్రస్తుతం చంద్రబాబు, నారా లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో జరుగుతున్న ఈ రచ్చ చంద్రబాబు వరకు చేరడం తో ఆయన టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పై ఫైర్ అవుతూ ఇంత గొడవ జరుగుతుంటే ఏమి చేస్తున్నారని ఫోన్ కాల్ సంభాషణ ద్వారా నిలదీశారట. మీ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు, అతి చేస్తే తోకలు కత్తిరిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చాడట. దీంతో అలెర్ట్ అయిన అధిష్టానం వెంటనే స్పందించి ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి పదంలో ఆంధ్ర ప్రదేశ్ అడుగులు వేస్తున్న ఈ తరుణంలో, 7 నెలలు గడవక ముందే పదవుల కోసం కొట్లాడుకోవడం దురదృష్టకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.