Flight Engine : గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణీకుల సంఖ్య పెరిగిపోతోంది. దీని ప్రభావంగా విమాన రాకపోకలు గణనీయంగా పెరిగాయి. అయితే, దీనితో పాటు కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన ప్రశ్న ప్రజల్లోకి వస్తోంది.. ఏదైనా కారణంగా విమానం ఇంజిన్ ఆగిపోతే, అది ఎంత సేపు గాల్లో ఎగురుతుందని? ఈ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.
విమాన ప్రయాణం – ఎత్తు, ఇంజన్లు, శక్తి
ఈ రోజుల్లో చాలామంది విమాన ప్రయాణాన్ని ఇష్టపడతారు.. ఎందుకంటే చాలా గంటల ప్రయాణాన్ని కొన్ని గంటల్లో పూర్తిచేయగలుగుతారు. సాధారణంగా ప్రయాణీకుల విమానాలు 9 నుంచి 12 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతాయి. అయితే, ఇది విమానం రకం, ప్రయాణ దూరం, వాతావరణ పరిస్థితులను బట్టి మారవచ్చు.
విమానాల్లో సాధారణంగా రెండు లేదా నాలుగు ఇంజిన్లు ఉంటాయి. చిన్న విమానాలకు రెండు ఇంజిన్లు ఉంటే, పెద్ద విమానాలకు నాలుగు ఇంజిన్లు ఉంటాయి. ఒక సాధారణ విమాన ఇంజిన్ 200-400 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.. అయితే జెట్ విమాన ఇంజిన్ 30,000 హార్స్‌పవర్ వరకు శక్తిని అందించగలదు. మరింత శక్తివంతమైన బోయింగ్ 747 విమాన ఇంజిన్లు అయితే 1 లక్ష హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి.
విమాన ఇంజిన్ ఆగిపోతే ఏం జరుగుతుంది?
ఈ ప్రశ్న చాలా మంది ప్రయాణికులను కలవరపెడుతుంది. సాధారణంగా, ఒక విమానం ఇంజిన్ ఆగిపోయినప్పుడు, ముందుకు వెళ్లేందుకు అవసరమైన థ్రస్ట్ తగ్గిపోతుంది. అయితే, ఈ స్థితిలో విమానం గాల్లో నిలిచిపోదు, కానీ క్రమంగా గ్లైడ్ అవ్వడం ప్రారంభమవుతుంది. వాస్తవానికి, గ్లైడింగ్ అనేది విమానం గాలి నిరోధకతకు వ్యతిరేకంగా మృదువుగా ముందుకు సాగే ప్రక్రియ. ఈ సమయంలో, పైలట్లు విమానాన్ని సమర్థవంతంగా కంట్రోల్ చేసి, అత్యవసర ల్యాండింగ్ కోసం అనుకూలమైన ప్రదేశాన్ని చూసే ప్రయత్నం చేస్తారు.
విమాన గ్లైడింగ్ దూరం ఎంత?
ఇది ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది:
* విమాన ఎత్తు – ఎంత ఎక్కువ ఎత్తులో ఉంటే, అంత ఎక్కువ దూరం ప్రయాణించగలదు.
* గాలి దిశ – గాలి సహకరిస్తే, మరింత దూరం జారుతూ ఉండగలదు.
* ఉదాహరణకు.. ఒక బోయింగ్ 747 వంటి పెద్ద విమానం సుమారు 10 కిలోమీటర్ల ఎత్తులో ఉంటే, ఇంజిన్ ఆగిపోయినా దాదాపు 160 కిలోమీటర్ల వరకు గ్లైడ్ అవ్వగలదు. ఇదే చిన్న విమానానికి వస్తే, దూరం తక్కువగా ఉంటుంది.
అత్యవసర సమయంలో విమానం ఎలా సేవ్ అవుతుంది?
ప్రస్తుతం ఉన్న ఆధునిక విమానాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా అనేక భద్రతా విధానాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా:
* మల్టీ-ఇంజిన్ వ్యవస్థ: చాలా విమానాలు కనీసం రెండు ఇంజన్లతో ఉంటాయి. ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే, మిగతా ఇంజిన్ సాయంతో విమానం కొనసాగించగలదు.
* తాజా సాంకేతిక పరిజ్ఞానం: అత్యాధునిక నావిగేషన్ సిస్టమ్స్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ మోడ్ వంటి ఫీచర్లు విమాన ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి.
* పైలట్ శిక్షణ: ఎలాంటి అవాంఛిత పరిస్థితులను ఎదుర్కొనగల సామర్థ్యం ఉండేలా పైలట్‌లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
ఇంజిన్ విఫలమైనా, విమానం వెంటనే కూలిపోదు. తగినంత ఎత్తు ఉంటే, పైలట్ ఆ విమానాన్ని భద్రంగా ల్యాండ్ చేయగల అవకాశాలు ఉన్నాయి. అందువల్ల, ఇలాంటి అప్రమత్తమైన భద్రతా చర్యల వల్ల విమానయానం ఇప్పటికీ అత్యంత సురక్షితమైన ప్రయాణ మార్గంగా మిగిలింది.