Taraka Ratna’s career : ఎంతో గొప్ప నేపథ్యం ఉన్నప్పటికీ నందమూరి తారకరత్న జీవితం పూల పాన్పు కాలేదు. వడ్డించిన విస్తరి అస్సలు కాలేదు.. నటించిన సినిమాలు గొప్పవి కాకపోవచ్చు. వందల కోట్లు వసూలు చేసినవి కాకపోవచ్చు. అతగాడికి అభిమాన సంఘాలు లేకపోవచ్చు. కానీ ప్రేమించిన అమ్మాయి కోసం పెద్దలను ఎదిరించాడు. స్టార్ డం కోసం పాకులాడలేదు, లేనిపోని గొప్పలు చెప్పుకోలేదు. నిర్మాతలు ఎంత ఇస్తే అంతే తీసుకున్నాడు. అంతేతప్ప మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి అంటూ లేనిపోని డాంబికాలు పోలేదు. అలా ఉన్నాడు కాబట్టే తారకరత్న పెద్దగా ఫోకస్ కాలేదు. 1983లో జనవరి 8న నందమూరి మోహనకృష్ణ, సీత దంపతులకు మద్రాసులో తారకరత్న జన్మించారు. మోహన కృష్ణ ఎన్టీఆర్ నిర్మించిన కొన్ని సినిమాలకు కెమెరామెన్ గా పనిచేశారు. ఇక మోహన కృష్ణ, సీత దంపతులకు తారకరత్న, రూప సంతానం. చెన్నైలో ఏడో తరగతి వరకు తారకరత్న చదువుకున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ వచ్చేయడంతో మోహన కృష్ణ కుటుంబం కూడా ఇక్కడికి షిఫ్ట్ అయింది.. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ భారతీయ విద్యా భవన్ లో టెన్త్, గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్లడం బైక్ రైడింగ్ చేయడం తారకరత్నకు అలవాటు. ఇంటర్ తర్వాత హైదరాబాదులోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివారు తారకరత్న. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే 2002 సంవత్సరంలో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సినిమాకి కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.
2012లో దయ సినిమా షూటింగ్ సమయంలో నందమూరి తారకరత్నకు అలేఖ్యరెడ్డి పరిచయమైంది. నందీశ్వరుడు సినిమాకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.. ఆ పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది. కులాంతర వివాహం కావడం, అంతకుముందే అలేఖ్య రెడ్డికి వివాహమై విడాకులు కావడంతో తారకరత్న కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో అలేఖ్య రెడ్డి, తారకరత్న రహస్యంగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కొన్నాళ్లపాటు కుటుంబం దూరం పెట్టినప్పటికీ తారకరత్న మనో నిబ్బరం కోల్పోలేదు. తనను నమ్మి వచ్చిన అమ్మాయికి అన్యాయం చేయలేదు.. కష్టాల్లో ఉన్నప్పటికీ తన బ్యాక్ గ్రౌండ్ ఎక్కడా కూడా వాడుకోలేదు.
సినిమాల్లో తన తోటి సహనటు ల పై తారకరత్న విశేషమైన ప్రేమాభిమానాలు కనబరిచేవారు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా షూటింగ్ సమయంలో తనతోపాటు నటించిన చిత్రం శ్రీనుకు ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు తన ఇంటి నుంచి ప్రత్యేకంగా వంటకాలు తయారు చేయించి కొసరి కొసరి వడ్డించేవారు.. నిర్మాతలు ఎంత ఇచ్చినా తీసుకునేవారు. కొందరు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి న వారు కూడా ఉన్నారు. కానీ ఏనాడూ వారిని పల్లెత్తు మాట అనలేదు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: How did tarakaratnas career go
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com