
Proverb: మనకు మన పూర్వీకులు ఎన్నో విషయాలు చెప్పారు. అనుభవ పూర్వకంగా అనుభవించి ఎన్నో తీరుగా కథలు, సామెతలు చెప్పారు. అయితే పుస్తక రూపకం కంటే సామెతలు నానుడి రూపకంగానే ఎక్కువగా వస్తాయి. వాటికి అక్షర రూపం లేదు. తెలుగులో సామెతలు కోకొల్లలు. ప్రతి మాటకో సామెత దొరుకుతుంది. ఇతర భాషల్లో ఇన్ని రకాల సామెతలు కనిపించవు. మన తెలుగు పదాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మన మాటలు కూడా ఎక్కువగానే ఉండటంలో అతిశయోక్తి లేదు.
సామెతల నేపథ్యం
సామెతంటే ప్రజల నాలుకలో నానిపోయిన పదబంధంగా చెబుతుంటారు. పదాల పోలికతోనే సామెతలు పుట్టాయి. ఈ నేపథ్యంలో ప్రతి విషయానికి ఓ సామెత ఉంటుంది. ప్రజల జీవన విధానం, అలవాట్లు, సంస్కృతి ఆధారంగా సామెతలు పుట్టుకొచ్చాయి. ఎన్నో పుటలుగా చెప్పే విషయాలను సూటిగా, స్పష్టంగా చెప్పేవాటినే సామెతలుగా అభివర్ణిస్తుంటారు. సామెతలు కోకొల్లలుగా ఉన్నాయి. సమయం, సందర్భం వచ్చినప్పుడు అవి స్ఫురణకు వస్తుంటాయి. వంద ప్రశ్నలకైనా ఒక్క సామెతతో సమాధానం చెప్పవచ్చు.
సామెతల్లో చమత్కారం
సామెతలు చమత్కారంగా ఉంటాయి. హాస్యంగా కూడా అనిపిస్తాయి. వినసొంపుగా జీవితానికి సరిపోయే విధంగా ఉదాహరణలకు తార్కాణంగా సామెతలు పనికొస్తాయి. వాటికి అనుగుణంగా జీవితాలను మార్చుకోవచ్చు. ఇతిహాసాలకు, పురాణాల్లో కూడా సామెతలు గుర్తుకు వస్తాయి. మోసం, కుట్ర, కోపం, ఆగ్రహం, తరాల అంతరాలలోనూ సామెతలు వచ్చినట్లు కవులు చెబుతున్నారు. ఊళ్లల్లో పెద్ద మనుషులు మాటకో సామెత వేస్తారు. ఇంట్లో కూడా అమ్మా, తాతలు సామెతలు వరుసగా చెబుతుంటారు.
సామెతల్లో పరమార్థం
సామెతలను వాక్యాలుగా కూడా మార్చుకోవచ్చు. సామెతలను వాడుకలోని మాటలనే ఉపయోగిస్తారు. పల్లెల్లో జరిగే పంచాయితీల్లో సామెతలు ఎక్కువగా గుర్తుకు వస్తాయి. పెద్ద మనుషులు మాటకో సామెత వేస్తుంటారు. అందరికి సులభంగా అర్థమవుతాయనే రీతిలో వీటిని వాడుతుంటారు. అడిగే వాడికి చెప్పేవాడు లోకువ అన్న సామెతలో ఉచిత సలహాలు, సూచనలు ఇవ్వడం, అడగడం విషయంలో ఇద్దరి మానసిక పరిస్థితి తెలుస్తుంది. ముసలి వారైతే ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది అని అంటారు. వృద్ధాప్యం గురించి వారి పరిస్థితిపై వివరిస్తుంటారు.

మౌనం దేనికి సంకేతం
మౌనం అర్థాంగీకారం అంటుంటారు. ఏదైనా చెప్పేటప్పుడు ఎదురు మాట్లాడకుండా ఉంటే మౌనం అర్థాంగీకారం అంటారు. అంటే మనం చెప్పేది ఒప్పుకున్నారనేదానికి సంకేతంగా చెబుతారు. తప్పు చేసినట్లు సగం ఒప్పుకున్నట్లే. అందుకే ఈ సామెతను వాడుతుంటారు. ఇలా సామెతలు మన జీవితంతో పెనవేసుకుపోయాయి. మనం చెప్పదలుచుకున్న అంశం మూడు ముక్కల్లో కట్టె కొట్టె తెచ్చె అన్నట్లుగా వాడటం సహజం. అందుకే సామెతలు మనకు ఎన్నో రకాలుగా కనిపిస్తాయి.