IT Employees Health: కూర్చుని చేసే ఉద్యోగం… ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం

ఐటి రంగంలో ఉద్యోగుల ఆరోగ్యం ఆందోళనకు గురిచేస్తోందని జాతీయ పోషకార సంస్థ దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెల్లడించింది.

Written By: Bhaskar, Updated On : August 19, 2023 11:55 am

IT Employees Health

Follow us on

IT Employees Health: ఐటీ ఉద్యోగం అంటే.. ఐదు అంకెల జీతం, వారంలో రెండు రోజులు సెలవు, కోరినంత జీతం ఇచ్చే కంపెనీలు, వద్దన్నా లోన్లు ఇస్తామని వెంటపడే బ్యాంకులు.. కోవిడ్ ముగిసిన తర్వాత ఐటి ఉద్యోగం అసలు రంగు బయటపడుతోంది. కంపెనీల అసలు ముఖచిత్రం కళ్ళకు కడుతోంది. ఇది సరిపోదన్నట్టు ఆర్థిక మాంద్యం ఉద్యోగులను భయపెడుతోంది. కంపెనీలు ఖర్చు కోతలో భాగంగా లక్షలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఇక ఇది సరిపోదన్నట్టు తాజాగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) విస్మయకర వాస్తవాలను కళ్ళకు కట్టింది.

ఐటి రంగంలో ఉద్యోగుల ఆరోగ్యం ఆందోళనకు గురిచేస్తోందని జాతీయ పోషకార సంస్థ దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెల్లడించింది. ఒత్తిడితో కూడిన పని విధానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, గంటల కొద్దీ కూర్చొని పని చేయడం ద్వారా పలు రోగాలను కొని తెచ్చుకుంటున్నారని హెచ్చరించింది. హైదరాబాద్ నగర కేంద్రంగా ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్న 183 మంది ఐటీ ఉద్యోగులపై ఆ సంస్థ అధ్యయనం చేసింది.. ఆ వివరాలను అంతర్జాతీయ ” పీర్ రివ్యూడ్ జర్నల్ న్యూట్రియంట్స్”_ ఆగస్టు 2023 సంచికలో ప్రచురించింది. రీసెర్చ్ స్కాలర్ పరమిత బెనర్జీ పరిశోధన పత్రం ఆధారంగా ఎన్ఐఎన్ శాస్త్రవేత్తల బృందం డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ గంగవరపు భాను ప్రకాష్ రెడ్డి మరింత లోతుగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ప్రకారం 46 శాతం మంది జీవనశైలి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని తేలింది. 78% మంది వ్యాయామానికి దూరంగా ఉంటున్నారని వెలుగులోకి వచ్చింది. ప్రతి పదిమందిలో ముగ్గురు రక్తపోటు, ఊబ కాయం, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆ సంస్థ పేర్కొంది. నడుము చుట్టుకొలత పెరుగుతున్న వారు కూడా ఈ జాబితాలో ఉన్నారని ఆ సంస్థ వివరించింది.

సంస్థ చేసిన అధ్యయనంలో 66 శాతం మంది చెడు కొవ్వుతో బాధపడుతున్నారు. 44 శాతం మంది అధిక బరువు ఉన్నారు. 17 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. నాలుగు శాతం మంది మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఐటీ ఉద్యోగుల్లో చాలామందికి మంచి ఆహారపు అలవాట్లు లేవు. ఉద్యోగులకు సంస్థలు పాస్ట్ ఫుడ్ అందుబాటులోకి ఉంచడమే దీనికి ప్రధాన కారణమని జాతీయ పోషకార సంస్థ అభిప్రాయపడింది. సగటున ఎనిమిది గంటలకు మించి కూర్చోని పని చేయడం ద్వారా ఉద్యోగుల్లో లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యోగులు చాలామంది వ్యాయామానికి దూరంగా ఉండటం కూడా ఈ రోగాలు పెరగడానికి కారణమవుతుందని సమస్త పేర్కొంది.. ముఖ్యంగా 26 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న దాన్ని ఆ సంస్థ ప్రధానంగా గుర్తించింది. వీటి నివారణ కోసం కంపెనీలు కచ్చితంగా వ్యాయామశాలలు ఏర్పాటు చేయాలని సూచించింది. అదే సమయంలో తాజా పండ్లు, కూరగాయలు కూడా ఉద్యోగులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.