Radhika- Kamal Haasan: విశ్వనటుడు కమల్ హాసన్ కెరీర్లో సాగరసంగమం, స్వాతిముత్యం ఆల్ టైం క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఆ సినిమాల్లో కమల్ చేసిన పాత్రలు మరో నటుడు చేయలేడు అనడం అతిశయోక్తి కాదు. ఛాలెంజింగ్ రోల్స్ లో కమల్ జీవించారు. ఆ చిత్రాల్లో ఆయన నటన వర్ధమాన నటులకు ఒక లైబ్రరీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా స్వాతిముత్యం సినిమాలో మందబుద్ధి యువకుడి పాత్రలో కమల్ ఒదిగిపోయి నటించారు. అప్పటికే కమర్షియల్ హీరోగా ఎదిగి, స్టార్డం తెచ్చుకున్న కమల్ ఆ తరహా పాత్రలో అభిమానులను మెప్పించడం సాహసం. స్వాతిముత్యం సినిమాలో కథనే హీరో. ఏ కోశానా హీరోయిజం కి అవకాశం లేని పాత్ర అది.

కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ నుండి జాలువారిన ఈ కళాఖండం అప్పట్లో ఓ సంచలనం. భారత్ తరపున స్వాతిముత్యం సినిమాను ఆస్కార్ నామినేషన్స్ కి పంపారు. అలాగే పలు అవార్డ్స్ స్వాతిముత్యం అందుకుంది. విశ్వనాథ్-కమల్ హాసన్ ల ఈ ప్రయోగాత్మక చిత్రం కమర్షియల్ గా కూడా పెద్ద హిట్. ఇళయరాజా మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. కమల్ తో పోటీపడి నటించిన ఘనత రాధికకు దక్కింది.
భర్తను కోల్పోయి, కుటుంబ నిరాదరణకు గురైన యువతి కొడుకుతో పాటు రోడ్డున పడుతుంది. ఆమె బాధలు తీర్చాలనే తపనలో మూడు ముళ్ల బంధానికి అర్థం తెలియని అమాయకుడు ఆమె మెడలో తాళి కడతాడు. ఆ వివాహాన్ని అంగీకరించాలా వద్దా అనే సందేహం ఒకవైపు, భర్త పేరుతో దగ్గరైన వయసొచ్చిన పసివాడితో ఎలా జీవించాలనే సందిగ్ధత మరోవైపు. లోతైన భావాలు పలికించాల్సిన పాత్రలో రాధిక పరిపక్వతతో కూడిన నటన చూపించారు.

కాగా స్వాతిముత్యం మూవీలో కమల్-రాధిక మధ్య ‘మనసు పలికే మౌన గీతం’ అనే రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లో ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని చూపించాలి. కమల్-రాధిక ఆ సీన్స్ సరిగా చేయడం లేదు, ఇన్వాల్వ్ కావడం లేదని దర్శకుడు విశ్వనాథ్ భావించారట. రెండు సార్లు చేసినా సంతృప్తి చెందని విశ్వనాథ్… రాధికను పిలిచి ఆమె మీద పెర్ఫ్యూమ్ స్ప్రే చేశారట. అయితే కమల్ కి మూడ్ రావడం కోసం ఆ స్ప్రే తానే వేసుకున్నానని కమల్ అపార్థం చేసుకున్నారని రాధిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.