Hamsa Nandini: హీరోయిన్స్ లైఫ్ స్టైల్ అనేక రుగ్మతలకు కారణం కావచ్చు. అర్ధరాత్రి శక్తివంతమైన లైట్స్ మధ్య పని చేయాల్సి ఉంటుంది. ఒక సమయం అంటూ లేని జాబ్ వాళ్ళది. వేళాపాళా లేని తిండి, నిద్ర వారి జీవితాల్లో భాగం. ఇవి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తాయి. చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనకు తెలిసిన నటులే పదుల సంఖ్యలో ఉన్నారు. ఎక్కువగా హీరోయిన్స్ క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు.

సోనాలీ బింద్రే, మనీషా కొయిరాలా, మమతా మోహన్ దాస్ కాన్సర్ కి గురయ్యారు. చికిత్స అనంతరం కోలుకున్నారు. సిల్వర్ స్క్రీన్ హాట్ బ్యూటీగా ఫేమ్ తెచ్చుకున్న హంసా నందిని కూడా క్యాన్సర్ బాధితురాలే. గత ఏడాది డిసెంబర్ లో ఈ భయంకర నిజాన్ని హంసా నందిని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆమె సుదీర్ఘ సందేశం ద్వారా తన వేదన తెలియజేశారు.
నా బ్రెస్ట్ లో చిన్న గడ్డను నేను గుర్తించాను. వైద్య పరీక్షలు చేయించడంతో బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. 18 ఏళ్ల క్రితం ఈ మహమ్మారి మా అమ్మను బలితీసుకుంది. నేను కీమోథెరపి చికిత్స తీసుకున్నాను. అలాగే ఆపరేషన్ చేసి ట్యూమర్ తొలగించారు. అదృష్టవశాత్తు నేను త్వరితగతిన గుర్తించాను. దీంతో క్యాన్సర్ వ్యాప్తి చెందలేదని డాక్టర్స్ వెల్లడించారు. వారసత్వంగా సంక్రమించిన ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి ఇంకొన్నాళ్లు చికిత్స తీసుకోవాల్సి ఉంది… అని హంసా నందిని తన పరిస్థితిని వివరించారు.

ఏడాది తర్వాత క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకున్నట్లు హంసా నందిని సోషల్ మీడియా పోస్ట్ చేశారు. తాను తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో స్పందించారు. ఫైనల్ గా క్యాన్సర్ ని జయించిన హంసా నందినికి అభిమానులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లో హంసా నందిని హీరోయిన్ గా చేశారు. తర్వాత ఐటెం భామగా మారారు. జై లవకుశ మూవీలో ఎన్టీఆర్ కొలీగ్ గా వాంప్ రోల్ చేశారు. మిర్చి, అత్తారింటికి దారేది, లెజెండ్ తో పాటు పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు.