
CM KCR: తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి అయిన తర్వాత పరిస్థితులు ఏమీ బాగోలేవు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు తర్వాత భారత రాష్ట్ర సమితి బిజెపి వేస్తున్న ఎత్తులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీనికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ తోడు కావడంతో భారత రాష్ట్ర సమితి బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యం కుంభకోణంలో కొంత వెసలుబాటు కనిపించినప్పటికీ.. పేపర్ లీకేజీ విషయంలో ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఉక్క పోత మొదలైంది.
ఈ నేపథ్యంలోనే ప్రజలు డైవర్షన్ కాకుండా ఉండేందుకు కేసిఆర్ ఆత్మీయ సమ్మేళనాలను తెరపైకి తీసుకొచ్చారు.. దీనివల్ల ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లాలి అనేది కేసీఆర్ ప్లాన్.. ఇక్కడే అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులు బయటికి వెళ్ళడవుతున్నాయి.. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనానికి కడియం శ్రీహరిని పిలవకపోవడంతో ఆయన ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే రాజయ్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఒంటెత్తు పోకడలు పోతున్న నేపథ్యంలో, ఆయన్ను నిలువరించాలని కూచాడి శ్రీహరి రావు అధిష్టానికి విజ్ఞప్తి చేస్తున్నారు.. ఇలాంటి అసంతృప్తులు గతంలో భారత రాష్ట్ర సమితిలో ఉండేవి కాదు. ఇప్పుడు బయటికి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ పని ఈజీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. అయితే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నుంచి దర్గయ్య వరకు అందరిపైనా ఒక్కో ఆరోపణ వినిపిస్తోంది. అయితే దీనిపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక్క రాజయ్య విషయంలో మాత్రమే సర్పంచ్ శ్రావణితో సయోధ్య కుదుర్చుకోవాలని సలహా ఇచ్చింది. అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే ప్రజల్లో విశ్వాసం పోగొట్టుకున్నారో.. వారందరికీ టికెట్లు ఇచ్చే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అధికార భారత రాష్ట్ర సమితిలో నాయకత్వ బరువు ఎక్కువైందని.. దీనిని తగ్గించుకునేందుకే ఆత్మీయ సమ్మేళనాలు తెరపైకి తీసుకొచ్చారని వారు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు తారకరామారావు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలలో ఏం మాట్లాడుతున్నారు, కార్యకర్తల నుంచి ఎటువంటి స్పందన లభిస్తోంది, ప్రభుత్వపరంగా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, పథకాలు ఎక్కడెక్కడ సక్రమంగా అమలు కావడం లేదు ఇటువంటి విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో కెసిఆర్ గమనిస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల వెనుక చాలామందికి టికెట్లు ఇవ్వడం కుదరదని చెప్పడమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఎవరైనా ఎమ్మెల్యే తప్పు చేస్తే అధిష్టానం తీవ్రంగా పరిగణించేది. ఇప్పుడు పట్టించుకోవడం లేదంటే దాని అర్థం అదేనని వారు అంటున్నారు. మొత్తానికి ఆత్మీయ సమ్మేళనాల పేరుతో భారత రాష్ట్ర సమితిలో ఉన్న లుకలుకలు మొత్తం బయటపడుతున్నాయి. “వీటి ఆధారంగానే ఎవరైతే పనికి వస్తారో వారికి టికెట్లు ఇవ్వడం, మిగతా వారిని పొమ్మన లేక పొగ పెట్టడం” చేస్తామని భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ముఖ్య నాయకులు చెబుతున్నారు. అంటే ఎన్నికలకు అన్ని పార్టీలకంటే కెసిఆర్ ముందుగానే సిద్ధం అయిపోయారని దీని ద్వారా తెలుస్తోంది.