
Balagam: ‘బలగం’ సినిమా చూసి మెచ్చుకోని వారుండరు. కర్కశుడి చేత కన్నీళ్లు పెట్టించిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎంత పెద్ద విజయం సాధించిన సినిమా అయినా అందులో ఏదో ఒక లోపం కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ‘బలగం’లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని కొందరు సోషల్ మీడియా వేదికగా అంటున్నారు. తెలంగాణ సాంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఇందులో ఒకటి ఈ ప్రాంతంలో లేనిది కల్పితంగా పెట్టారంటున్నారు. అయితే దానిని హైలెట్ చేయకుండా వేరే రకంగా చూపిస్తే బాగుండునని అంటున్నారు. ఇంతకీ ఆ లోపం ఎక్కడుంది?
కమెడియన్ వేణు డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘బలగం’ సినిమాలో స్టార్ నటులు ఎవరూ లేరు. కానీ కథా బలంతో పాత్రలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేశారు. నిజంగా అలాంటి మనుషులు ఉంటారా? అనేంతగా పాత్రలో జీవించారు. ఇందులో ముఖ్యంగా అల్లుడి పాత్రలో మురళీధర్ గౌడ్ ప్రత్యేకంగా నిలిచారని చెప్పవచ్చు. తాను అత్తగారింటికి వెళ్లినప్పుడు తనకు వడ్డించే ఆహారంలో నల్లిబొక్క వేయలేదన్న చిన్న కారణంతో బంధం తెంపుకుంటారు. ఈ సీన్ సినిమాలో ప్రత్యేకంగా నిలుస్తుంది.
అయితే తెలంగాణలో అటువంటి సాంప్రదాయం లేదంటున్నారు కొందరు మేధావులు. తెలంగాణలో ప్రతి ఇంటికి వెళ్తే తమతో పాటు పది మందికి ఆహారం పెట్టి సాగనంపుతారని అంటున్నారు. తమకు తిండికి దొరకకపోయిన ఉన్నంతలో పదిమందికి దానం చేసు గుణం తెలంగాణ ప్రజల్లో ఉందంటున్నారు. తెలంగాణ ఆచార, వ్యవహారాల నేపథ్యంలో వచ్చిన ‘బలగం’ సినిమాలో మిగతావన్నీ అద్భుతంగా చూపించారు. కానీ కేవలం నల్లిబొక్క వేయనందుకు బంధాలు తెంపుకునే అల్లుళ్లు ఉన్నారని చెప్పడం కరెక్ట్ కాదని అంటున్నారు.

ఇలాంటి పరిస్థితులు ఉన్నా.. చాలా తక్కువేనని అంటున్నారు. ఈ సీన్ ను చిన్నగా చూపిస్తే సరిపోయేదని, దీనిని హైలెట్ గా చేసి సినిమాలో చూపించడం బాగాలేదని అంటున్నారు. తెలంగాణ ఇళ్లల్లో అల్లుళ్లకు మర్యాదలు ఎక్కువే ఉంటాయి. అదే సమయంలో అల్లుళ్ల సైతం తమ అత్తగారిని అంతే గౌరవిస్తారు. ఒకరికొకరు మర్యాదపూర్వకంగా మెదులుతారు. మిగతా విషయాల్లో గొడవలు వస్తే రావొచ్చు.. గానీ.. తిండి విషయంలో ఎవరూ గొడవపడరని కొందరు అంటున్నారు. మరి దీనిపై డైరెక్టర్ వేణు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.