Gadwal Vijayalakshmi: హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది.. ఫలితంగా శివారు ప్రాంతాల్లో భూములకు రెక్కలు వచ్చాయి. ఇదే స్థాయిలో వివాదాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. భూ వివాదాల నేపథ్యంలో హత్యలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం ధరణి వెబ్ సైట్ తీసుకొచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. సరిగ్గా ఇలాంటి భూ వివాదంలోనే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి చిక్కుకున్నారు. ఇందులో ఆమె సోదరుడు కే వెంకటేశ్వరరావు, సోదరి కవిత రావు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామం లో సర్వేనెంబర్; 20 లో తమ భూమికి కంచె వేయించే ప్రయత్నం చేస్తుండగా, కొందరు రైతులు అడ్డుకున్నారు. ఆ సర్వే నెంబర్ లో తమ భూములు కూడా ఉన్నాయని ఆ రైతుల ఆరోపణ. వాటిని సర్వే చేశాకే కంచె వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

2007లోనూ..
2007లో ఇదే భూమి వ్యవహారంలో గద్వాల విజయలక్ష్మి సోదరుడు వెంకటేశ్వరరావు ఇంట్లో ప్రశాంత్ రెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారి హత్య జరిగింది. వాస్తవానికి 2007లో వెంకటేశ్వరరావు సర్వేనెంబర్: 20 లో పది ఎకరాల భూమి కొనుగోలు చేశారు.. ఆ తర్వాత ఆ భూమిలో రెండు ఎకరాలు తన అక్క విజయలక్ష్మి, చెల్లెలు కవిత రావు పేరిట మూడెకరాలు పట్టా చేయించారు.. మిగతా భూమి వెంకటేశ్వరరావు పేర ఉంది.. అయితే ఇదే సర్వే నంబర్ లో మీర్జాపూర్ కు చెందిన కొనింటి మల్లేష్ కు 30 గుంటలు, నరసింహారెడ్డికి 13 గుంటలు, వడ్డే రవికి 10 గుంటల భూమి ఉంది.. బుధవారం విజయలక్ష్మి, వెంకటేశ్వరరావు, కవిత రావు ఆ భూమిలో కంచె పనులు చేయిస్తుండగా మల్లేష్, నరసింహారెడ్డి బంధువులు, అవి ఆ పనులను అడ్డుకున్నారు. తమ భూమి ఎక్కడ ఉందో చూపించాకే కంచె వేసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వెంకటేశ్వరరావు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది.. అప్పటికే వెంకటేశ్వరరావు పోలీసులను పిలిపించారు. ఈ గొడవ ముదరకుండా వారు చర్యలు తీసుకున్నారు. అంతేకాదు రైతుల భూమి నాలా అవతలికి ఉందని చెప్పే ప్రయత్నం చేశారు.
ఆ భూమి చరిత్ర ఇదీ
ఈ భూమి యజమానురాలు రాములమ్మ దొరసాని.. 1972లో సర్వేనెంబర్ 20 లోని రాములమ్మ కు చెందిన 30 ఎకరాల భూమిని ప్రభుత్వం భూ పరిమితి చట్టం కింద స్వాధీనం చేసుకుంది.. దీనికి పరిహారంగా 1975లో రాములమ్మ కుమారుడు నరసింహారెడ్డికి డబ్బులు చెల్లించింది.. 1978లో భూ పంపిణీలో భాగంగా కొంతమంది రైతుల వద్ద 1, 447 రూపాయలు తీసుకొని ఆ భూమిని ఇచ్చింది.. పాస్ పుస్తకాలు కూడా ఇచ్చింది.

ఆ భూమిని రికార్డుల్లోకి ఎక్కించడంలో మా పెద్దలు తాత్సారం చేశారని మల్లేష్, నరసింహ రెడ్డి, రవి చెబు తున్నారు. అయితే 2005లో కేకే కుమారుడు వెంకటేశ్వరరావు ఈ భూమిని కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు.. 2007 జనవరి 1న 10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.. అప్పటినుంచి మమ్మల్ని బెదిరిస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఈ భూమికి సంబంధించి ప్రశాంత్ రెడ్డి అనే రియల్టర్ హత్య కూడా జరిగిందని వారు వివరిస్తున్నారు.. అయితే ఈ భూమి గురించి అడిగితే తమను తుపాకితో బెదిరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.. అయితే ఈ ఆరోపణలను వెంకటేశ్వరరావు ఖండిస్తున్నారు.. ప్రస్తుతానికి అయితే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఈ భూ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.. అయితే బాధిత రైతులు నేరుగా సీఎం వో ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.