JD Lakshminarayana- jagan
JD Lakshminarayana- YCP: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలుగునాట అందరికీ సుపరిచితులే. ఏపీ సీఎం జగన్ అవినీతి కేసుల దర్యాప్తు అధికారిగా ఆయన ఎనలేని గుర్తింపు దక్కింది. ఇప్పటికీ ఆ కేసు విచారణ కొనసాగుతున్నా నాడు దర్యాప్తు అధికారిగా లక్ష్మీనారాయణకు లభించిన ప్రచారం అంతా ఇంతా కాదు. అటువంటి అధికారి అనూహ్యంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల వైపు వచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూశారు. అయినా రాజకీయాలు అంటే ఇష్టం వదులుకోలేదు. స్వచ్ఛంద సేవల రూపంలో ప్రజల మధ్యే ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే గత ఎన్నికల్లో జనసేన తరుపున బరిలో దిగినా.. ఈసారి మాత్రం ఏ పార్టీ అన్నది తేలలేదు. అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నా.. తన సిద్ధాంతాలను అమలుచేసే పార్టీలోకి వెళతానని ఆయన స్సష్టంగా చెబుతున్నారు. అయితే అనూహ్యంగా ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకోని జగన్ వేల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టుకున్నారన్నది అభియోగం. దీనిపై యూపీఏ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ అధికారిగా లక్ష్మీనారాయణను నియమించింది. అప్పట్లో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. జగన్ 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. అటు తరువాత జగన్ పార్టీ పెట్టి తొలి ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి పరిమితయ్యారు. రెండోసారి అధికారంలోకి రాగలిగారు. అయితే సరిగ్గా గత ఎన్నికల ముందు జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. జనసేన తరుపున విశాఖ పార్లమెంట్ స్థానానికి పోటీచేశారు. రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు. అయితే ఎన్నికలకు 15 రోజుల ముందే ఆయన బరిలో దిగినా చెప్పుకోదగ్గ ఓట్లే సాధించగలిగారు. కానీ ఎన్నికల అనంతరం జనసేనను వీడారు. కానీ సాగుకు సంబంధించి రైతులకు స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు.
2024 ఎన్నికల్లో మరోసారి పోటీ చేయడానికి లక్ష్మీనారాయణ ఆసక్తి చూపుతున్నారు. తనకు బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్..తాను ఒకే కేడర్ అని గుర్తు చేసారు. ఇద్దరు కలిసి మహారాష్ట్రలో పని చేసామన్నారు. తాము ఇద్దరం కూడా జనసేనలో ఉన్నామని చెప్పారు. ఇప్పుడు ఆయనకు ఏపీలో బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించటంతో తనను కూడా రావాలని అడిగారాని..తాను ఆలోచన చేస్తున్నానని వెల్లడించారు. తనను వైసీపీ నేతలు కూడా అప్పుడప్పుడు కలుస్తుంటారని చెప్పుకొచ్చారు. పార్టీలోకి రండి అంటు అడుగుతూ ఉంటారని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలోనూ తననున వైసీపీలోకి రమ్మన్నారని లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అయితే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై చర్చకు హామీ ఇచ్చి తాను పార్టీల్లో చేరటానికి సిద్దమని స్పష్టం చేసారు. మొత్తానికైతే ఆయన బీఆర్ఎస్ లో కానీ.. వైసీపీలో కానీ చేరే అవకాశమున్నట్టు ప్రచారం సాగుతోంది.
JD Lakshminarayana
గత ఎన్నికల్లో జనసేన తరుపున పోటీచేసిన లక్ష్మీనారాయణ తరువాత ఆ పార్టీని వీడారు. పవన్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలు అంటూ రెండు పడవలపై అడుగుపెట్టడం వల్లే తాను పార్టీకి దూరమవుతున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి జనసేన భావజాలానికి జేడీ లక్ష్మీనారాయణ నమ్మిన సిద్ధాంతానికి దగ్గర సంబంధాలున్నాయి. మరి అక్కడే ఎక్కువ రోజులు ఆయన పనిచేయలేకపోయారు. అటువంటిది తాను ఎవరి అవినీతి అక్రమాలపై దర్యాప్తు చేశారో.. అదే నాయకుడి వద్ద పనిచేయడం సాధ్యమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని చెప్పారు. కానీ ఆ పార్టీకి ఏపీలో ఉన్న బలం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో జనసేన తరుపున పోటీచేసి గణనీయమైన ఓట్లు పొందగలిగారు. కానీ తన వైపు చూసే ప్రజలు ఓటు వేశారన్న భ్రమలో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై గట్టిగానే పోరాటం చేశానని.. ఎంపీగా గెలిచి ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేసి ఉండేవాడినని చెప్పుకొస్తున్నారు. తన సిద్ధాంతాలపై చర్చించే పార్టీలో చేరతానిని.. లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని చెబుతున్నారు. మరి ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.