Homeట్రెండింగ్ న్యూస్Gadchiroli Village: ఒకే కుటుంబంలో వరుస హత్యలు.. 20 రోజుల్లో ఐదుగురిని చంపేశారు.. గగుర్పొడిచే క్రైం...

Gadchiroli Village: ఒకే కుటుంబంలో వరుస హత్యలు.. 20 రోజుల్లో ఐదుగురిని చంపేశారు.. గగుర్పొడిచే క్రైం స్టోరీ

Gadchiroli Village: పగలు, ప్రతీకారాలతో కుటుంబాలకు కుటుంబాలో అంతమైపోతున్నాయి. అయినా పరువు, ప్రతిష్ట, ఇతర కారణాలతో కొంత మంది ప్రతీకారంతో రగిలిపోతుంటారు. అదును చూసుకుని ప్రత్యర్థులను అంతం చేస్తున్నారు. ప్రతిగా అవతలి పక్షం కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తుంది. ఒకప్పుడు రాయలసీమలో ఇలాంటివి ఎక్కువగా జరిగేవి. అయితే తాజాగా మహారాష్ట్రలో ఇదే తహరా హత్యలు జరిగాయి. ఓ కుటుంబంపై పగబట్టిన ఇద్దరు మహిళలు 20 రోజుల వ్యవధిలో ఎవరికీ అనుమానం రాకుండా ఐదుగురిని అంతం చేశారు.

గడ్చిరోడిలో..
మహారాష్ట్రలోని గడ్చిరోడిలో ఈ వరుస హత్యలు జరిగాయి. అక్కడి ఇద్దరు మహిళలు ఒక కుటుంబంపై పగబట్టారు. అయితే ఒకే కుటుంబంలో వరుస మరణాలు జరుగుతుండడంతో అనుమానాలు రేకెత్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో హంతకుల గుట్టురట్టయింది. ఈ ఇద్దరు మహిళల్లో.. ఓ మహిళకు బాధిత కుటుంబాలతో ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉన్నాయి.

వేధిస్తున్నారని..
పగబట్టిన ఇద్దరు మహిళలను ఆ కుటుంబం వేధింపులకు గురిచేస్తోంది. బాధితులైన మహిళలు వేధింపుల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కుటుంబాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఇద్దరు మహిళలు కలిసి పథకం రూపొందించారు. పక్కా ప్రణాళిక దానిని అమలు చేసి 20 రోజుల్లో ఐదుగురి ప్రాణాలను గుట్టుచప్పుడు కాకుండా తీసేశారు.

అత్త, మామ, భర్త తీరు నచ్చలేదని..
మృతుల కుటుంబానికి చెందిన సంఘమిత్ర అనే మహిళకు తన అత్తమామలు, భర్త తీరు నచ్చలేదు. అదే సమయంలో తమ కుటుంబంతో రోసా అనే మరో మహిళకు ఆస్తి తగాదాలు ఉండడం గమనించింది. దీంతో తామిద్దరూ బాధితులమే కాబట్టి చేతులు కలిపారు. కుటుంబాన్ని ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశారు. దీనికోసం.. ఎలాంటి రంగు, రుచి, వాసన లేని ఓ నాటు మందును సేకరించారు. ఆ తర్వాత తమ పథకాన్ని అమలు చేశారు.

సెప్టెంబర్‌ 20 తొలి ప్రయోగం..
మొదట సెప్టెంబర్‌ 20వ తేదీన సదరు కుటుంబ పెద్ద అయిన శంకర్‌ కుంభారే, ఆయన భార్య విజయ తినే ఆహారంలో తాము సేకరించిన నాటు మందును కలిపారు. అది తిన్న తర్వాత భార్యాభర్తలిద్దరికీ తీవ్రమైన ఒంటి నొప్పులు వచ్చాయి. ఆ తర్వాత గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు వారిని నాగ్‌పూర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ సెప్టెంబర్‌ 26వ తేదీన శంకర్‌ మరణించాడు. ఆ మరుసటి రోజు(సెప్టెంబర్‌ 27న) ఆయన భార్య విజయ మరణించింది.

తేరుకునేలోపే మరో ముగ్గురు..
ఈ హఠాత్‌ మరణాలతో దిగ్భ్రాంతికి గురైన కుటుంబం తేరుకునే లోపలే.. శంకర్‌ దంపతుల కుమార్తెలు కోమల్, ఆనంద.. కొడుకు రోషన్‌ కూడా అనారోగ్యం పాలయ్యారు. ఇది గమనించిన బంధువులు వీరి ముగ్గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారికి అక్కడ వైద్యులు, చికిత్స అందిస్తున్న క్రమంలోనే అక్టోబర్‌ 8వ తేదీన కోమల్‌ చనిపోయింది. అక్టోబర్‌ 14వ తేదీన ఆనంద, అక్టోబర్‌ 15న రోషన్‌ మృతి చెందారు.

అందరిలో ఒకేరకమైన లక్షణాలు..
వీరందరికీ ఒకే రకమైన అనారోగ్య లక్షణాలు కనిపించాయి. తీవ్రమైన వెన్నునొప్పి, అవయవాల్లో జలదరింపు, పెదవులు నల్లగా మారడం, తలనొప్పి, నాలుక మొద్దు బారడం లాంటి లక్షణాలు ఈ ఐదుగురిలోను ఒకే రకంగా ఉండడం గుర్తించిన వైద్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఐదుగురివి అనుమానాస్పద మరణాలుగా ఉన్నాయని, వీరంతా విష ప్రభావానికి గురై ఉంటారని పోలీసులకు తెలిపారు.

మిగిలిన మహిళపై అనుమానం..
ఆ కుటుంబంలో మిగిలిన ఒకే ఒక్క వ్యక్తి సంఘమిత్ర. ఆమె చనిపోయిన రోషన్‌ భార్య. దీంతో పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా సంఘమిత్ర మీద నిఘా పెట్టారు. మరో నిందితురాలు రోసా చనిపోయిన విజయకు మరదలు అవుతుంది. వీరి ఇంటి దగ్గర్లోని ఆమె కూడా నివాసం ఉంటోంది. రోసాకు, ఈ కుటుంబంతో ఆస్తి తగాదాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. రోసా భర్త పూర్వీకుల ఆస్తిని విజయ ఆమె సోదరీమణులతో పంచుకోవడం మీద ఈ విభేదాలు తలెత్తాయి. దీంతో రోసా మీద కూడా పోలీసులు నిఘా పెట్టారు.

విచారణలో విస్తుపోయే నిజాలు..
వారి నిఘాలో ఈ అనుమానాస్పద మరణాలకేసులో నిందితులు సంఘమిత్ర, రోసాలే అని తేలింది. వివాదాల నేపథ్యంలో సంఘమిత్రతో రోసా చేతులు కలిపి హత్యలకు తెరలేపారని నిర్ధారించారు. వీరిద్దరూ కలిసి ఆన్‌లైన్‌లో విషం ఏదైనా దొరుకుతుందేమోనని వెతికారు. ఈ వెతుకులాటలో భాగంగానే రోసా ఓ ప్రదేశానికి వెళ్లి.. ఓ విచిత్రమైన విషాన్ని సేకరించింది. మరో విషయం పోలీసులను కూడా షాక్‌ కు గురి చేసింది. విష ప్రభావానికి గురై అస్వస్థత పాలైన శంకర్, విజయ దంపతులను ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కూడా రోసా వారికి విషం కలిపిన నీటిని తాగించింది. ఆ నీటిలో ఆయుర్వేద గుణాలు ఉన్నాయని చెప్పింది. దీంతో కారు డ్రైవర్‌ కూడా ఆ నీటిని కొంత తాగాడు. ఈ విషయాలు వెలుగు చూడడంతో పోలీసులు సంఘమిత్ర, రోసాను బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version