
Balagam Director Venu: అబ్బ సొత్తు కాదురా టాలెంటు.. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు.. ఇది కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం సినిమాలోని పాట. జీవిత సత్యాన్ని తెలిపే ఈ పాట ఎల్దండి వేణు అలియాస్ వేణు టిల్లుకు అచ్చంగా సరిపోతుంది. ఈ పేరు మొన్నటి వరకు చాలా మందికి తెలియదు. చాలా సినిమాల్లో నటించినా.. పెద్దగా గుర్తింపు లేదు.. జబర్దస్త్ ప్రోగ్రామంలో తనదైన కామెడీతో ప్రేక్షకుల్లో నవ్వుల వేణువులూదాడు. దీంతో తనలోని హాస్య నటుడికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే వేణు తానొక్కడినే ఎదగాలని భావించలేదు. టాలెంట్ ఉన్నవాడు వెలుగులోకి రావాలని భావించేవాడు. ఈ క్రమంలోనే జబర్దస్త్‌కు ఫేమస్ కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్‌ను పరిచయం చేశాడు. తర్వాత టీం లీడర్లుగా ఎదిగేలా ప్రోత్సహించారు. అయితే ఊహించని ఓ ఘటనతో క్రమంగా వేణు జబర్దస్త్‌కు దూరమయ్యాడు. ఇంకా ఏదో చేయాలన్న తపన ఆయనను దర్శకత్వంవైపు నడిపించింది. కథ చేతిలో పట్టుకుని రెండేళ్లు ఇండస్ట్రీలో హీరోలు, నిర్మాతల చుట్టూ తిరిగాడు. రెండేళ్ల శ్రమ ఎట్టకేలకు ఫలించింది. బలగం రూపంలో ప్రతీ హృదయాన్ని తట్టిలేపింది. దీంతో సినిమా తీస్తాఅని వెళితే ‘నాడు నీతో అయిదతా’ అన్నవాళ్లే ఇప్పుడు నీతోనే ఐతది అంటున్నారు.
ఇంట్లో నుంచి పారిపోయి..
తెలంగాణలోని సిరిసిల్లలో1980, జూన్ 2న జన్మించాడు. వేణు తల్లిదండ్రుల వెంకటయ్య–మాలవ్వ. చేనేత కుటుంబానికి చెందిన వేణు కుటుంబంతో 9వ సంతానం. చదుకునే సమయంలోనే మార్షనల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. తర్వాత చిన్న ఇనిస్టిట్యూట్ పెట్టి 60 మంది విద్యార్థులకు మార్షల్ ఆర్ట్ నేర్పించాడు. బ్లూ బెల్ట్ ఉన్న వేణుకు సినిమాల్లో నటించాలని చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. మెగాస్టార్ చిరంజీవిని ఇన్‌స్ప్రేషన్‌గా తీసుకుని తానూ తెరపై కనిపించాలన్న కసి పెంచుకున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆయనకు సహకరించలేదు. చివరకు సినిమాల్లో ఓ నటుడిగా అయినా కనిపించాలని ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్‌కు చేరాడు.
టచప్ బాయ్‌గా..
సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌కు చేరిన వేణుకు ఇండస్ట్రీలో తెలిసినవారు ఎవరూ లేదు. దీంతో అవకాశాల కోసం స్టుడియోల గేటు వద్ద నిరీక్షించేవాడు. అన్నపూర్ణ స్టూడియో లోపలికి వెళ్లేందుకే నెలల తరబడి వేచిచూశాడు. లోపలికి వెళ్లేవారిని తననూ తీసుకెళ్లాని బతిమిలాడాడు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీలో నటన ఒక్కటే కాదని, ఇతర రంగాల్లో అవకాశం ఉంటుందని తెలుసుకుని తనకు వచ్చిన మార్షల్ ఆర్ట్ సాయంతో సినిమాల్లో అడుగు పెట్టేందుక ప్రయత్నించాడు. ఫైట్ మాస్టర్ రాజును కలిశాడు. రోజంతా గేటు వద్ద వేచిచూశాడు. చివరకు రాజు పిలిచి విషయం తెలుసుకున్నాడు. వేణు సినిమాల్లో నటిస్తానని ఒక్క చాన్స్ ఇప్పించాలని కోరాడు. అయితే చిన్నగా నవ్విన రాజు ఇలా అడిగతే ఎవరూ అవకాశాలు ఇవ్వరని ముందుగా పరిచయాలు పెంచుకో అని పంపించాడు. తర్వాత డైరెక్టర్ కావాలనుకుని ఓ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు. ఆ సమయంలో అన్నం పెట్టి రూ.70 కూలి ఇచ్చేవాడు. ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ క్రమంలో చిత్రం శీను పరిచయం కావడంతో ఆయనకు టచప్ బాయ్‌గా పనిచేసేందుకు వెళ్లాడు. దీంతో సినిమాలో చాలా మందికి దగ్గరయ్యాడు. షూటింగ్స్ చూస్తూ నటనపై పట్టు పెంచుకున్నాడు.
తేజ సినిమాలో తొలి చాన్స్..
ఈ క్రమంలో తేజ కొత్త నటీనటుల కోసం వెతుకుతున్నాడని తెలుసుకున్నాడు. ఈమేరకు ఆడిషన్స్‌కు వెళ్లాడు. ఆడిషన్స్‌లో సత్తా చాటాడు. దీంతో నటుడు కావాలన్న నెరవేరింది. జై సినిమా ద్వారా నటుడిగా పరిచయం అయ్యాడు. ఆసినిమాలో వేణు టాలెంట్ చూసిన దర్శక నిర్మాతలు మరో 20 సినిమాల్లో అవకాశం ఇచ్చారు. తర్వాత మళ్లీ దర్శకుడు తేజ ఔనన్న కాదన్న సినిమాలో మరో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. తర్వాత మున్నా సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా అవకాశం వచ్చింది. దీంతో వేణు లైఫ్ మారిపోయింది. ఈ సినిమాలో టిల్లు వేణుగా గుర్తింపు పొందాడు. అతర్వాత చాలా సినిమాల్లో నటించాడు. కొంతకాలం తర్వాత అవకాశాలు తగ్గాయి.
జబర్దస్త్‌తో కమెడియన్‌గా..
ఇక అప్పుడే మల్లెమాల ఈటీవీలో ప్రారంభించిన జబర్దస్త్‌తో కమెడియన్‌గా రాణించాడు. వేణు వండర్స్ టీం ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆర్థికంగానూ ఇబ్బందులు తొలగిపోయాయి. జబర్దస్త్‌తో సినిమాల్లోనూ మళ్లీ అవకాశాలు పెరిగాయి. ఈ క్రమంలో వేణు జవర్దస్త్‌లో ఓ కులాన్ని కించపర్చారని దాడిచేశారు. ఈ వివాదంతో క్రమంగా వేణు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాడు. తర్వాత మళ్లీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. అయితే ఎవరినీ క్యారెక్టర్ ఇవ్వాలని అడిగేవాడు కాదు. టాలెంట్ చూసి పిలవాలని భావించేవాడు. ఆ అహంతో అవకాశాలు రావలేదు. అయితే జబర్దస్త్‌లో వేణు లైఫ్ ఇచ్చిన సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ టాప్‌లోకి వెళ్లారు. లక్షలు సంపాదించారు. సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. వేణును మించిపోయారు. కానీ వేణు మాత్రం నెలవారీ ఖర్చులకు ఇబ్బంది పడ్డాడు. 20 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నా ఆర్థికంగా సెట్ కాలేదు. వందల సినిమాల్లో నటించినా జీవితంలో స్థిరపడలేదు. రచయితగా కూడా పనిచేశాడు. జై లవకుశ, రాణిరుద్రమ సినిమాల్లో కొన్ని డైలాగ్‌లు రచించాడు. అవిరాసింది తానే అని చెపిపనా ఎవరూ నమ్మలేదు. కమెడియన్‌కు అంతసీన్ ఎక్కడిది అని విమర్శించేవారు.
దర్శకత్వంపై దృష్టి..
జబర్దస్త్‌లో తన టీంకు స్కిట్ రాసుకుని దర్శకత్వం వహించేవాడు. ఈ క్రమంలో నటనను పక్కన పెట్టి దర్శకత్వంపై దృష్టిపెట్టాడు. అయితే దర్శకుడు కావడం అంత ఈజీ కాదని తెలుసుకున్నాడు. బలమైన కథ, అంకన్నా సెంటిమెంట్ ఉన్న కథనం కావాలనుకున్నాడు. ఈ క్రమంలోనే బలగం కథ రాసుకున్నాడు. తెలంగాణలో చావు తర్వాత జరిగే 11 రోజుల కార్యక్రమాన్ని తెరకెక్కించాలని కథ రాసుకున్నాడు. ఆ కథను పట్టుకుని రెండేళ్లు నిర్మాతల చుట్టూ తిరిగాడు. కానీ ఎవరూ సినిమా తీయడానికి ముందుకు రాలేదు. ఈ క్రమంలో ఇండస్ట్రీలోని తన మిత్రుడు ప్రదీప్ చిలుకూరి కనిపించాడు. రాజా చెయ్యివేస్తే అనే సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించాడు. అంతకుముందు చాలా సినిమాలకు కథ రచయితగా పనిచేశాడు. వేణు కథ విన్న ప్రదీప్.. నిర్మాత దొరకడం లేదా అని ఆశ్చర్యపోయాడు. నిర్మాతను పరిచయం చేయిస్తానని డిస్ట్రిబ్యూటర్ శివరామ్ వద్దకు తీసుకెళ్లాడు. ఆయనకు కథ నచ్చడంతో తాను ఈ సినిమా తీస్తే దానిస్థాయి తగ్గుతుందని పెద్ద నిర్మాత అయితే న్యాయం జరుగుతుందని శివరామ్ చెప్పాడు. నిర్మాత దిల్‌రాజుకు ఫోన్‌చేసి వేణును తీసుకెళ్లి పరిచయం చేశాడు.

తన కూతుళ్లతో ప్రొడ్యూసింగ్..
నటుడిగా, కమెడియన్‌గా వేణు గురించి దిల్‌రాజుకు తెలుసు. కానీ దర్శకుడు ఉన్నాడా అని అనుమానించాడు. కానీ బలగం స్టోరీ విన్నాక ఆశ్చర్యపోయాడు. తర్వాత తన కూతుళ్లు హర్షిత, అశ్వితను కూడా కథ వినమని చెప్పాడు. వారికి కూడా కథ నచ్చడంతో సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు. ఈమేరకు అగ్రిమెంట్ చేసుకున్నారు. కావాల్సిన నటులను ఎంపిక చేసుకునే చాన్స్ కూడా వేణుకే ఇచ్చారు. ఖర్చు గురించి భయపడొద్దని దిల్‌రాజు అభయమిచ్చాడు. కానీ వేణు కొత్తవారకే కావాలని పట్టుపట్టి సురభి కళాకారులను ఆరు నెలలు ఆడిషన్స్ నిర్వహించి నటులను ఎంపిక చేశాడు వేణు. దిల్ రాజు సూచనలతో మూడు గంటల సినిమాను రెండున్నర గంటలకు కుదించాడు. మొత్తంగా రెండేళ్ల కష్టం తెరకెక్కింది. ఈ సినిమాను మొదట చూసిన దిల్‌రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎమోషన్ ఎక్కువైందేమో అని హన్షిత కూడా భయపడింది. కానీ అందరూ బాగుందంటున్నారు. తర్వాత నిజామాబాద్‌లో కొంతమంది స్నేహితులకు దిల్‌రాజు ఫ్రీగా చూపించి ఒపీనియన్ తీసుకున్నాడు. వాళ్లు సూపర్ అని చెప్పడంతో సినిమా విడుదల చేశాడు. మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తెలంగాణ భావోద్వేగాలు, భాష అర్థం కాలేదన్న టాక్ వచ్చింది. కానీ మూడో రోజు నుంచి సినిమా ఎక్కడికో వెళ్లింది. ఇదికదా తెలంగాణ సినిమా అంటే అన్న టాక్ వచ్చింది. వేణును అందరూ ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా బలగం గురించే చర్చ. అంతర్జాతీయ అవార్డులు కూడా రూపాయి ఖర్చులేకుండా వస్తున్నాయి. దీంతో దిల్‌రాజు పెద్ద సినిమా కథ సిద్ధం చేయాలని వేణుకు సూచించాడు. దీంతో త్వరలో పెద్ద సినిమా రాబోతోంది.
ఇలా టాలెంట్ అనేది ఎవడబ్బ సొత్తు కాదని నిరూపించాడు వేణు టిల్లు. చాన్స్‌ల కోసం ఇండస్ట్రీ చుట్టూ తిరిగిన వేణు చుట్టూ ఇప్పుడు నటీనటులు, హీరోలు, నిర్మాతలు తిరిగేస్థాయికి ఎదిగాడు. 20 ఏళ్ల కష్టం, సొంత టాలెంట్‌తో ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా నిలబడ్డాడు వేణు.