
Vizianagaram: కట్టుకున్న భార్య కళ్ళముందే కన్నుమూసింది. ఆమె శవాన్ని ఇంటికి తీసుకెళ్దాం అంటే ఆటో డ్రైవర్ దాష్టికాన్ని ప్రదర్శించాడు. జేబులో ఉన్న 2000 ను లాక్కొన్నాడు.. అట్టు చూస్తే విగత జీవిగా భార్య… కన్నీరు ఉబికి వస్తోంది. గుండె తడిని కోల్పోతుంది.. గొంతు పిడచ కట్టుకుపోతోంది. ఏం చేస్తాడు… ఖర్మ ఇంతే అనుకొని భార్య శవాన్ని భుజాన వేసుకొని 130 కిలోమీటర్లు నడిచేద్దామని నిర్ణయించుకున్నాడు.
ఒడిశాకు చెందిన సాములు, గురు భార్యాభర్తలు. గురు ఇటీవల అనారోగ్యం బారిన పడింది. భార్యను బతికించుకోవాలని సాములు ఆమెను విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. డాక్టర్లు తమ చేతిలో ఏమీ లేదని చెప్పారు.. దీంతో చివరి చూపైనా అయిన వాళ్లకు దక్కుతుందని భావించి ఆటోలో కోరాపూట్ జిల్లాలోని సరోడ గ్రామానికి బయలుదేరాడు.. అతని ఖర్మ బాగలేనట్టుంది.. ఈ స్వతంత్ర భారతదేశంలో పేదవాడికి చావు కూడా కష్టంగానే వస్తుంది. ఆటో విజయనగరం రాగానే గురు ఆటోలోనే కన్ను మూసింది. శవాన్ని నేను అంత దూరం చేయలేను అంటూ సాములు జేబులో ఉన్న 2000 లాక్కుని ఆటో డ్రైవర్ అక్కడే దించేశాడు. సాములుకు తెలుగు రాదు. చేతిలో చిల్లిగవ్వలేదు. జీవితాంతం తోడుంటానని భార్యకు ఇచ్చిన మాట సాములుకు అప్పుడు గుర్తుకు వచ్చింది. ఇంక ఏం ఆలోచించలేదు. 130 కిలోమీటర్లు నడిచేద్దామని నిర్ణయించుకున్నాడు.. శవాన్ని భుజాన వేసుకున్నాడు.. భార్య శవం భుజాన వేలాడుతున్నా సాములు అలా నడుస్తూనే ఉన్నాడు.
ఈ విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే సిఐ తిరుపతిరావు, ఎస్ఐ కిరణ్ కుమార్ హుటాహుటిన సాములును ఊరడించారు.. కాసిన్ని నీళ్లు తాగించారు.. అంత్యక్రియల కోసం చేతిలో పదివేలు పెట్టారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి వారిని స్వగ్రామానికి పంపారు.. పోలీసుల సహాయానికి సాములు కన్నీళ్ళతో కృతజ్ఞతలు తెలిపాడు. గురు శవాన్ని తీసుకొని అంబులెన్స్ ఒడిశా వైపు పరుగులు తీసింది. ఈ హృదయ విధారకమైన ఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఆ మధ్య ఖమ్మం జిల్లాలోనూ తమ కూతురు శవాన్ని తీసుకొని తల్లిదండ్రులు బైక్ పై 100 కిలోమీటర్లు పైగా ప్రయాణం చేశారు. వారిది కూడా సేమ్ ఇదే పరిస్థితి.. ఆదివాసీలు, అక్షరం ముక్క రాదు, ఆటవిక జీవనం సాగిస్తారు.. పోడు చేసుకుని బతుకుతారు.. ఓట్ల మీద ఉండే ఇంట్రెస్ట్ వారి మీద లేకపోవడంతో ఎప్పటికీ పోడు భూములకు పట్టాలు అనే హామీ ఎన్నికల నినాదం గానే మారుతుంది.. దీంతోపాటే ఆదివాసుల అభ్యున్నతి కూడా ఎన్నికల నినాదం గానే మిగిలిపోతుంది.. మొన్న ఖమ్మం జిల్లా ఏన్కూరు, నిన్న ఒడిశా, రేపు?? నిరుపేదలు దేశంలో చచ్చిన తర్వాత కూడా కాటికి చేరడం కూడా కష్టమే అనే మరో జీవన సత్యాన్ని ప్రతీ ఘటన ఆవిష్కరిస్తూనే ఉంది.. ఘటన జరిగిన రోజు ఒక బ్రేకింగ్ న్యూస్.. తర్వాత అంతా కామనే..