Ponguleti Srinivas Reddy: భారత రాష్ట్ర సమితి అధిష్టానానికి వ్యతిరేకంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యతిరేక స్వరం వినిపించడం రాజకీయ వర్గాలను షాక్ కు గురిచేసింది. వాస్తవానికి సౌమ్యుడిగా పేరుపొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు కూడా అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు.. ఎంపీ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కించిత్ మాట కూడా తూలలేదు.. పైగా ఎప్పటికప్పుడు తన అనుచరులను సముదాయించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక్కసారిగా తన స్వరాన్ని పెంచారు.

ఆరు నెలల క్రితమే
వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, భారత రాష్ట్ర సమితికి అగాథం మొదలైంది ఇప్పుడు కాదు. ఆరు నెలల క్రితమే భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అక్కడ ఎమ్మెల్యే రేగా కాంతారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య విభేదాలు పొడ జూపాయి.. వాస్తవానికి ఆ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థానికంగా ఉన్న దళిత యువకులు ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి రావాలని పలుమార్లు ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిశారు.. ఆయన దీనిని దాటవేస్తూ వచ్చారు. ఈ క్రమంలో అక్కడి యువకులు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు.. విగ్రహ ప్రారంభోత్సవానికి రావాలని కోరగా దానికి ఆయన సమ్మతం తెలిపారు.. ఈ క్రమంలో విగ్రహ ప్రారంభోత్సవానికి వస్తున్న క్రమంలో రేగా కాంతారావు అనుచరులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాకను అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్ ని నిలువరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చెలరేగింది. రేగా కాంతారావు సహనం కోల్పోయి శ్రీనివాస్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. అయితే పొంగులేటి వర్గంలోని పిడమర్తి రవి పోలీసుల కళ్ళు కప్పి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు.. దీనిని మనసులో పెట్టుకున్న రేగా కాంతారావు మరింత రెచ్చిపోయారు.
ఫలితం లేకుండా పోయింది
అయితే ఈ వివాదాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేరుగా సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. కానీ రేగా కాంతారావు పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.. పైగా భద్రాద్రి జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిని చేశారు.. దీంతో పార్టీలో తన మాటకు విలువ లేకుండా పోతుందని అప్పటి నుంచే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నారాజ్ గా ఉన్నారు. పైగా పార్టీకి సంబంధించిన కీలక సమావేశాలకు పొంగులేటిని ఆహ్వానించకపోవడంతో ఇది మరింత గ్యాప్ న కు దారి తీసింది. ఈ క్రమంలోనే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన మనసులో ఉన్న మాటలు చెప్పారు.

బిజెపిలో చేరడం ఖాయమే
ఇక తనకు అధిష్టానానికి పొసగకపోవడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.. అమిత్ షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంక్రాంతి తర్వాత పొంగులేటి కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అనుచరులకే టికెట్లు ఇవ్వాలని పొంగులేటి అధిష్టానాన్ని అడిగినట్టు తెలుస్తోంది.. అయితే దీనిపై అధిష్టానం ఎటువంటి హామీ ఇవ్వలేదు.. దీనిపై సంక్రాంతి లోపు ఒక స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే పొంగులేటి బిజెపిలో చేరుతారని ఆయన అనుచరులు అంటున్నారు. మొత్తానికి అశ్వాపురం మండలంలో జరిగిన ఘటన నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలలో కీలక మార్పునకు నాంది పలికిందంటే మామూలు విషయం కాదు.