
Avanthi Srinivas Rao: విశాఖ కు చెందిన తాజా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యవహార శైలి వైసీపీలో చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం ఆయన అధికార పార్టీకి అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారు. ప్రజారాజ్యం బ్యాచ్ కు చెందిన ఈయన అనూహ్య నిర్ణయాలతో యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నారు. మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. చిరంజీవి పీఆర్పీతో రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా మారారు. 2014 ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీలో చేరి అనకాపల్లి ఎంపీ టిక్కెట్ దక్కించుకొని విజయం సాధించారు. ఐదేళ్ల పాటు ఎంపీ పదవి దక్కించుకున్నారు. గత ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు. ముందు మాట్లాడుకున్నట్టుగా భీమిలి టిక్కెట్ తో పాటు మంత్రి పదవి సైతం పొందారు. మొన్నటి పునర్విభజనతో మంత్రి పదవి పోగొట్టుకున్నారు. అటు తరువాత విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి వచ్చినట్టే వచ్చి దూరమైంది. దీంతో ఆయన పునరాలోచనలో పడినట్టు వార్తలు వస్తున్నాయి.
పదవులు దూరం కావడంతో మనస్తాపం..
మంత్రి పదవి పోయినా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి పోవడాన్ని అవంతి జీర్ణించుకోలేకపోతున్నారు. అటు భీమిలి అసెంబ్లీ స్థానం టిక్కెట్ డౌటే అన్న ప్రచారం సాగుతోంది. అక్కడ అవంతి వ్యతిరేక వర్గం పట్టుబిగుస్తోంది. అటు భీమిలిలో జనసేన సైతం గ్రాఫ్ పెంచుకుంటూ వస్తోంది. చివరకు అవంతి అనుచరులు సైతం జనసేనలో చేరుతున్నారు. ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో ఎంట్రీ అవంతికి నచ్చడం లేదు. ఇలా వచ్చిన పంచకర్ల కు పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. అది కూడా తన వద్ద తీసుకొని మరీ కట్టబెట్టారు. అప్పటికే మంత్రి పదవి పోయిన బాధతో ఉన్న అవంతి దీనిని ఒక అవమానంగా భావించారు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చినట్టు టాక్ నడుస్తోంది. తరచూ పార్టీ కార్యక్రమాలకు గైర్హజరవుతుండడం అనుమానాలను పెంచుతోంది.
పీఆర్పీతో ఎంట్రీ..
పీఆర్పీ తరుపన 2009లో అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అవంతి భీమిలి నుంచి.. పంచకర్ల పెందుర్తి నుంచి పోటీచేశారు. అదే సమయంలో గంటా శ్రీనివాసరావు సైతం పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పీఆర్పీని కాంగ్రెస్ లోకి విలీనం చేసే సమయంలో గంటాకు మంత్రి పదవి దక్కింది. 2014 ఎన్నికలకు ముందు ఈ ముగ్గురూ టీడీపీలో చేరారు. కానీ అప్పటివరకూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిని గంటా కోసం అవంతి వదులుకున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేశారు. భీమిలి నుంచి గెలిచిన గంటా మంత్రి అయ్యారు. మంత్రి కావాలన్న తన కలను గంటా అడ్డంకిగా మారారని చెప్పి ముందస్తు అవగాహన మేరకు అవంతి వైసీపీలో చేరి..ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అందుకే తాను మంత్రిగా ఉన్నన్నాళ్లూ గంటాను వైసీపీలోకి రాకుండా అడ్డుకోగలిగారు.

పక్కలో బల్లెంలా పంచకర్ల..
అయితే గంటా విషయంలో సక్సెస్ అయిన అవంతి పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరకుండా అడ్డుకోలేకపోయారు. పైగా వైసీపీ హైకమాండ్ రమేష్ బాబును పిలవడమే కాకుండా జిల్లా అధ్యక్ష స్థానాన్ని కట్టబెట్టింది. మంత్రి పదవి పోవడంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు కొనసాగిస్తారని అవంతి భావించారు. కానీ తన నుంచి పదవి తీసుకొని రమేష్ బాబుకు అప్పగించారు.పైగా వచ్చే ఎన్నికల్లోఅతడికి టిక్కెట్ ఇచ్చి మంత్రిని చేస్తారన్న టాక్ నడుస్తోంది. అదే సమయంలో అవంతికి భీమిలి టిక్కెట్ డౌటేనన్న ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో తన రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకుంటుండడంతో అవంతి పునరాలోచనలో పడ్డారు. పార్టీ మారడంపై కసరత్తు చేస్తున్నారు. ఒకటి రెండు నెలల్లో ఏ పార్టీలో చేరుతారనే దానిపై క్లారిటీ రానుంది.