
JD Lakshminarayana- KCR: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మనసు బీఆర్ఎస్ వైపు లాగుతున్నట్టుంది. అందుకే ఇటీవల ఆయన కేసీఆర్ నామస్మరణ చేస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ ను హైప్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ పార్టీనే కార్నర్ చేసుకొని వరుసగా ట్విట్లు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం గత రెండేళ్లుగా జరుగుతున్నా.. ఇప్పుడు క్రెడిట్ మొత్తం బీఆర్ఎస్ ఖాతాలో వేశారు. ఉద్యమంపై కేసీఆర్ స్పందించిన దాఖలాలు లేవు. కానీ జేడీ బీఆర్ఎస్ ను ఇన్వాల్వ్ చేసిన తరువాతే కేటీఆర్ స్పందిస్తూ కేంద్రానికి లేఖరాశారు. అటు తరువాత బిడ్లు వేయాలని జేడీ పురమాయించిన తరువాత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దానికి కూడా అభినందనలు తెలుపుతూ జేడీ లక్ష్మీనారాయణ వరుసగా ట్విట్లు చేయడం ప్రారంభించారు. దీంతో జేడీ మనసు బీఆర్ఎస్ వైపు లాగుతున్నట్టు తేలింది.
ఏదో పార్టీలో చేరిక అనివార్యం..
ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో లేరు. వచ్చే ఎన్నికల్లో ఏదో పార్టీలో చేరి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. వైసీపీ నుంచి ఆహ్వానాలున్నా.. అక్కడ ఏ స్థాయిలో పరిస్థితి ఉంటుందో ఆయనకు తెలుసు. టీడీపీ సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీలోకి పిలవడం లేదు. జగన్ కేసుల దర్యాప్తు అధికారి కావడం, కేసుల వెనుక టీడీపీ హస్తం ఉందని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణను దూరంగా ఉంచారు. జనసేనలో చేరుదామంటే…నాయకత్వాన్ని ప్రశ్నించి మరీ బయటకు వచ్చారు. పవన్ పిలవడం లేదు. తిరిగి నేను చేరుతానని జేడీ లక్ష్మనారాయణ ముందుకు రావడం లేదు. ఈ తరుణంలో మంచి పార్టీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో మాజీ ఐఏఎస్ అధికారులతో ఉన్న బీఆర్ఎస్ లో చేరడమే శ్రయేస్కరమని జేడీ లక్ష్మీనారాయణ భావిస్తున్నట్టు సమాచారం.

విశాఖ లోక్ సభ స్థానంపై ఫోకస్…
గత ఎన్నికల తరువాత జనసేన నుంచి బయటకు వచ్చి జేడీ లక్ష్మీనారాయణ స్వచ్ఛందంగా కొన్నిరకాల సేవలందిస్తున్నారు. ప్రజల్లో తిరుగుతున్నారు. మరోసారి విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కుదిరితే మంచి పార్టీ.. లేకుంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని చెబుతున్నారు. కానీ పార్టీ నుంచి మిశ్రమ స్పందన ఉంది. దీంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. గట్టి అంశాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. సరిగ్గా అటువంటి సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం దొరికింది. సమయం దొరికినప్పుడల్లా విశాఖ స్టీల్ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.
సరైన సమయంలో ఎంట్రీ..
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. కానీ కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొనే స్థాయిలో మాత్రం చేయడం లేదు. అందుకే బీజేపీతో అమితుమీకి సిద్ధపడుతున్న బీఆర్ఎస్ అయితే సమఉజ్జి అవుతుందని భావించి రంగంలోకి దిగింది. కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో స్టీల్ ప్లాంట్ ను తామే కాపాడేశామన్న రేంజ్ లో బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకు తగ్గట్టు ప్రచారం చేసుకుంటోంది. దీనికి జేడీ సైతం మద్దతు తెలిపి మరింత ప్రచారం కల్పిస్తున్నారు. అంటే దాదాపుఆయన బీఆర్ఎస్ ను చూజ్ చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. అటు బీఆర్ఎస్ సైతం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విజయోత్సవ సభ పేరిట ఏపీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. ఇదే వేదికపై జేడీ లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ లో చేరడం, విశాఖ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటన ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరీ.