
Ponguleti Srinivas Reddy: “రావణాసురుడి కబంధహస్తాల నుంచి బయటికి వచ్చా. శ్రీరాముడి పాదాల చెంతకు చేరా. ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నా. కెసిఆర్ అంతమే నా పంతం” అంటున్నారు ఖమ్మం పార్లమెంటు మాజీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి. ఇటీవల ఆయనను భారత రాష్ట్ర సమితి సస్పెండ్ చేసింది. దీంతో ఆయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలోనే ఆయన అధికార భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పార్టీ లోపాలను, పాలనలో వైఫల్యాలను ఎండగడుతున్నారు. అంతేకాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్క భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోనని శపథం చేస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ రాజకీయ అంతమే నా పంతం అని స్పష్టం చేస్తున్నారు.. ఈక్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో ఇంటర్వ్యూ చేశారు.. ఈ సందర్భంగా పలు విషయాలపై శ్రీనివాసరెడ్డిని రాధాకృష్ణ ప్రశ్నలు అడిగారు. వీటికి ఎటువంటి మొహమాటం లేకుండా శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు. వచ్చే ఆదివారం ఈ ప్రోగ్రాం ఏబీఎన్ ఛానల్ లో ప్రసారమవుతుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ప్రోమోలో పలు ఆసక్తికర విషయాలను పొంగులేటి రాధాకృష్ణతో పంచుకున్నారు.
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం ఎంపీ స్థానం విషయంలోనే విభేదాలు ఏర్పడ్డాయి. నామ నాగేశ్వరరావుకు ఎంపీ టికెట్ ఇచ్చిన కేసీఆర్.. పొంగులేటికి రిక్త హస్తం చూపించారు. అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సిఫారసు చేసినప్పటికీ కెసిఆర్ పొంగులేటి టికెట్ ఇవ్వలేదు. ఎంపీ టికెట్ కాకుండా ఎమ్మెల్సీ ఇస్తానని అప్పట్లో కెసిఆర్ ఆఫర్ ఇచ్చారు. దాన్ని కూడా నిలబెట్టుకోలేదు. ఆ మధ్యలో రాజ్యసభ సభ్యుడి పదవి ఇస్తానని ప్రకటించారు. తర్వాత దానిని హెటిరో పార్థసారధి రెడ్డికి ఇచ్చారు.. దీంతో పొంగులేటి పార్టీకి దూరం జరగడం ప్రారంభించారు. జనవరి 1న నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. వరుస ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ తన అభ్యర్థులను ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే వైరా నియోజకవర్గానికి విజయా బాయి, అశ్వరావుపేట నియోజకవర్గానికి జారె ఆది నారాయణ ను ప్రకటించారు.

తన రాజకీయ జీవితాన్ని కెసిఆర్ నాశనం చేసాడని పొంగులేటి ఆరోపిస్తున్నారు. భజన పరులకే అవకాశాలు ఇస్తున్నారని మండి పడ్డారు. అజ్ఞానం వల్లే కెసిఆర్ ను నమ్మానని, ఇక పై ఆయన రాజకీయ అంతాన్ని చూస్తానని ప్రకటించారు. కేటీఆర్ తో ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పానని, అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని పొంగులేటి వాపోయారు.
తన దగ్గర డబ్బు ఉందని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారని, అధికారంలో ఉన్నవారు, ప్రజా ప్రతినిధులుగా చలామణి అవుతున్న వారి దగ్గర ఇంకెంత డబ్బుండాలని పొంగులేటి ప్రశ్నించారు. కెసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాబట్టి నన్ను ఏదయినా చేయొచ్చు. అన్నింటికీ సిద్ధపడే ఉన్నా అని పొంగులేటి ఆర్కే సంధించిన పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.
ఆర్కే కు కూడా కెసిఆర్ అంటే కోపం కాబట్టి.. దానిని దృష్టిలో పెట్టుకొని పొంగులేటిని మరిన్ని ప్రశ్నలు అడిగారు. ” ఆ పూట ఎవరితో అవసరం ఉంటే వారి వద్దకు వెళ్తాడు. పొంగులేటితో పని ఉంటే పొంగులేటి వద్దకు, ఆర్కే తో పని ఉంటే ఆర్కే వద్దకు వెళ్తాడు” అని రాధాకృష్ణ పొంగులేటి హిత బోధ చేశాడు. అంటే ఆ మధ్య తన ఆఫీస్ కాలిపోయినప్పుడు… కెసిఆర్ వచ్చింది పరామర్శకు కాదని, తనతో అవసరం ఉండే వచ్చాడని ఆర్కే ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యానించాడు. సో మొత్తానికి పొంగులేటితో ఆర్కే ఇంటర్వ్యూ హాట్ హాట్ గా జరిగిందని ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. పూర్తి ఇంటర్వ్యూ లో ఇంకెన్ని విషయాలు బయట పడతాయో వేచి చూడాల్సి ఉంది.
