Mahesh Babu- Krishna: దేవుడా… మహేష్ బాబు పరిస్థితి ఎవరికీ రాకూడదు. కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తేనే కోలుకోవడం కష్టం. అలాంటిది మహేష్ ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయాడు. నెలల వ్యవధిలో వరుస విషాదాలు కృంగదీశాయి. మహేష్ పరిస్థితి ఎవరికీ రాకూడని ప్రతి ఒక్కరి నోట వినిపిస్తుంది. అన్నయ్య, అమ్మ, నాన్న… ఒకరి తర్వాత ఒకరు మృత్యు ఒడిలోకి జారుకున్నారు. జనవరి 8న రమేష్ బాబు అనారోగ్యంతో మరణించారు. అన్నయ్య రమేష్ అంటే మహేష్ కి వల్లమాలిన అభిమానం, ప్రేమ. రమేష్ మరణాన్ని జీర్ణించుకోవడానికి మహేష్ కి చాలా సమయం పట్టింది.

కొన్నాళ్ల పాటు మహేష్ ఇంటికే పరిమితం అయ్యారు. రమేష్ మరణాన్ని మరకవక ముందే సెప్టెంబర్ 28న అమ్మ ఇందిరా దేవి మరణించారు. ఇందిరా దేవి కన్నుమూత మహేష్ ని అతిపెద్ద కుదుపుకు గురి చేసింది. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరా దేవి చికిత్స పొందుతూ చనిపోయారు. ఇందిరా దేవి అంటే మహేష్ కి అమితమైన ప్రేమ. ప్రతి సినిమా విడుదలకు ముందు ఆమె చేతి కాఫీ తాగుతాడు. అమ్మ చేతి కాఫీ నాకు ప్రసాదంతో సమానం. నేను దాన్ని ఆశీర్వాదంలా భావిస్తానని మహేష్ ఒక సందర్భంలో చెప్పారు.
అమ్మ దూరమై రెండు నెలలు గడవక ముందే నాన్న కృష్ణ దూరమయ్యారు. ఇంతకంటే విషాదం మరొకరి జీవితంలో ఉండదేమో. దెబ్బ మీద దెబ్బ మహేష్ ని మానసికంగా కృంగదీస్తున్నాయి. 79 ఏళ్ల కృష్ణ ఆదివారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే తీవ్ర విషమ స్థితిలో ఉన్న కృష్ణను కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నం చేశారు. వయసు రీత్యా కృష్ణ శరీరం చికిత్సకు స్పందించలేదు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో ఆయన కన్నుమూశారు.

ముగ్గురు కుటుంబ సభ్యుల మరణంతో మహేష్ ఒంటరి అయ్యారు. హీరోగా మహేష్ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. త్రివిక్రమ్ తో మూవీ సెట్స్ పై ఉండగా… వచ్చే ఏడాది రాజమౌళి మూవీ ప్రారంభం కానుంది. రాజమౌళి మూవీతో మహేష్ గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. వృత్తిపరంగా సక్సెస్ ఫుల్ గా మహేష్ ప్రయాణం సాగుతుంది. వ్యక్తిగత జీవితంలో విషాదాలు మహేష్ ని బెంబెలెత్తిస్తున్నాయి. అయితే మీకు మేమున్నామని అభిమానులు ధైర్యం చెబుతున్నారు. మీరు ఒంటరి కాదని మానసిక మద్దతు ఇస్తున్నారు.