
Balakrishna On IPL 2023: ఓ ఏడాదిగా బాలయ్య చాలా మారిపోయారు. గతంలో అది చేయను ఇది చేయను అంటూ మడిగట్టుకు కూర్చునేవారు. ఇప్పుడు ఏదైనా సై అంటున్నారు. బాలయ్య ఓ టాక్ షోకి హోస్టింగ్ చేస్తారని ఎవరైనా ఊహించారా?. అన్ స్టాపబుల్ షోకి హోస్టింగ్ చేయడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. బాలయ్య సారథ్యంలో అన్ స్టాపబుల్ రెండు సీజన్స్ దుమ్మురేపాయి. మహేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ ఈ షోలో పాల్గొని అనేక విషయాలు వెల్లడించారు.
అలాగే బాలయ్య గతంలో యాడ్స్ చేయకూడదని నియమం పెట్టుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వ్యాపార ప్రకటనల్లో నటించారు. బాలయ్య మాత్రం వాటి జోలికి పోలేదు. ఇటీవల రెండు సంస్థలకు బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్, జ్యూవెలరీ సంస్థల ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నారు. అలాగే ఆయన మరో కొత్త బాధ్యత చేపడుతున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. బాలయ్య ఏకంగా క్రికెట్ కామెంటేటర్ గా మారనున్నారట.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) న్యూ సీజన్ మార్చి 31న ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ లకు తెలుగు కామెంటేటర్ గా బాలయ్య వ్యవహరిస్తారట. కొన్నాళ్లుగా క్రికెట్ కి తెలుగు కామెంట్రీ అందుబాటులోకి వచ్చింది. స్టార్ మాలో అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు ఐపీఎల్ కి తెలుగులో కామెంట్రీ చెబుతున్నారు. బాలయ్య ఏ బాధ్యత నెరవేర్చనున్నారట. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. బాలయ్యకు క్రికెట్ అంటే ఇష్టం, కొంత ప్రావీణ్యం, అవగాహన ఉంది. బాలయ్య స్పిన్ బౌలర్ అండ్ బ్యాట్స్ మెన్.

నిజంగా బాలయ్య ఐపీఎల్ మ్యాచెస్ కి కామెంట్రీ చెబితే ఫుల్ కిక్ ఇస్తుంది. కాగా ప్రస్తుతం బాలయ్య తన 108వ చిత్ర షూట్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల కీలక రోల్ చేస్తున్నారు. వీరిద్దరు కూడా హైదరాబాద్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. ఉగాది కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. అఖండ, వీరసింహారెడ్డి చిత్ర విజయాలతో జోరు మీదున్న బాలయ్య హ్యాట్రిక్ మీద కన్నేశారు. మరోవైపు అఖండ 2 పై త్వరలో ప్రకటన అంటూ వార్తలు వస్తున్నాయి.