
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రెండ్రోజుల క్రితం తన ఇంట్లో జిమ్ చేస్తుండగా కాలు బెణికిందని సీఎంవో తెలిపింది. దీంతో ఒంటిమిట్ట పర్యటనను సడెన్‌గా రద్దు చేసుకున్నట్లు ఒక ప్రటకన విడుదల చేసింది. డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో సీఎం టూర్ రద్దు అయ్యిందని అధికారులు తెలిపారు. సీన్ కట్ చేస్తే.. గురువారం చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. జగన్ యవ్వారం ఇంత సిల్లీగా ఉందేంటి..? అని గుసగుసలాడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే మీమ్స్, వీడియోలు ఓ రేంజ్‌లో దర్శనమిస్తున్నాయ్. ఇంతకీ జగన్ కాలు బెణికినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు..? రెండ్రోజుల గ్యాప్‌లోనే ఎందుకిలా జరిగింది..? దీనిపైన ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీజేపీ ఏమంటోంది..? జగన్ నిజంగానే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బ్రహ్మోత్సవాలకు రమ్మంటే కాలు బెణికిందని..
కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఏప్రిల్ 5న వైఎస్.జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే ముందు రోజు (ఏప్రిల్ 4) ఉదయం తన ఇంట్లో జిమ్ చేస్తుండగా జగన్ కాలు బెణికింది. దీంతో హుటాహుటిన సీఎం నివాసానికి డాక్టర్లు చేరుకుని చికిత్స చేశారు. కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సడన్‌గా ఒంటిమిట్ట పర్యటనను అప్పటికప్పుడు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. వైసీపీ క్యాడర్ కూడా ఆందోళన చెందింది.
చిరునవ్వుతో చిలకలూరిపేటకు..
గాయం కారణంగా జగన్ దాదాపు వారం పది రోజులు బయటకు రాడని అంతా భావించారు. సీన్ కట్ చేస్తే.. రెండ్రోజుల వ్యవధిలోనే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ‘ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం’ ప్రారంభోత్సవ సభలో చిరునవ్వులు చిందిస్తూ ప్రత్యక్షమయ్యారు. సొంత జిల్లాలో పర్యటనకు, అది కూడా దేవుడి కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాత్రం ఏవేవో కారణాలు చెబుతారని.. గవర్నర్‌మెంట్ కార్యక్రమానికి మాత్రం ఎంచక్కా వెళ్తారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రెండు రోజుల క్రితం కాలు బెణికిందని, ఇపుపడు పరుగులు పెట్టడంపై సామాన్యుడి నుంచి సొంత పార్టీ కార్యకర్తల వరకూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.
హిందూ దేవుళ్లపై ఎందుకంత కోపం..
హిందూ దేవుళ్ల విషయంలో జగన ప్రతిసారీ ఇలాగే వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఒంటిమిట్టకు వెళ్లడానికి ఉండే కాలినొప్పి.. చిలకలూరిపేటకు వెళ్లడానికి ఉండదేం..? పోనీ డాక్టర్లు ఏమైనా చిలకలూరిపేటకు ఎలా వెళ్లమని చెప్పారా..? అని జగన్‌ను బీజేపీ నిలదీస్తోంది. జగన్ చర్యతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాములోరి కల్యాణం కంటే జగన్‌కు ఏం ముఖ్యమైన పనులున్నాయని ఏపీ కమలనాథులు నిలదీస్తున్నారు. జగన్ తన హిందూ వ్యతిరేక వైఖరి బయటపెట్టారని విమర్శిస్తున్నారు. అప్పట్లో.. దేశవ్యాప్తంగా హిందువులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే వినాయక చవితి విషయంలోనూ జగన్ ఇలాగే వ్యవహరించారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడేమో ఒంటిమిట్ట పర్యటన విషయంలో ఇలా చేయడంతో సామాన్యులు, హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

ఫొటోలు, వీడియోలు వైరల్..
మొత్తానికి చూస్తే.. జగన్ కాలు బెణకడం పెద్ద చర్చకే దారితీసింది. పైగా చిలకలూరిపేట పర్యటనలో జగన్ ఏ మాత్రం కాలు నొప్పి అనేది తెలియకుండానే సాధారణంగానే ఫ్లైట్ దిగడంతో ఈ వ్యవహారం మరింత రచ్చ అయ్యింది. జగన్ ఫ్లైట్ దిగుతున్న ఒకే ఒక్క ఫొటో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. రెండ్రోజులకే కాలి నొప్పి ఎలా తగ్గిపోయిందబ్బా అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ అసలు రియాక్ట్ అవుతుందా లేక మిన్నకుండిపోతుందా అనేది చూడాలి.