
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. మృతి చెందిన వ్యక్తికి జరిగే అంత్యక్రియల విషయంలో సైతం పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో మానవత్వానికి మచ్చ తెచ్చే హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి శవాన్ని తరలించటానికి స్థానికులు సహాయం చేయకపోవడంతో మృతుడి కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడింది.
చివరకు చేసేదేం లేక మృతుడి కుటుంబ సభ్యులు సైకిల్ పైనే శవాన్ని శ్మశానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. బెలగావి జిల్లా కిత్తూరు తాలూకా ఎమ్‌కే హుబ్బలికి చెందిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందాడు. వ్యక్తి మృతికి కారణాలు తెలియకపోవడంతో స్థానికులు ఆ వ్యక్తి కరోనా వల్లే మృతి చెందాడని భావించారు. అందువల్ల అతని అంత్యక్రియలకు ఎటువంటి సహాయం చేయకుండా దూరంగా ఉండిపోయారు.
దీంతో మృతుని కుటుంబం అన్ని ప్రయత్నాలు చేసి చివరకు సైకిల్ పైనే మృతదేహాన్ని శ్మశానానికి చేర్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ నిన్న సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. శివకుమార్ ట్విట్టర్ లో షేర్ చేయడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటక సర్కార్ ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది.
ಬೆಳಗಾವಿಯ ಕಿತ್ತೂರಿನ 70 ವರ್ಷದ ವೃದ್ಧನ ಶವವನ್ನು ಕುಟುಂಬ ಸದಸ್ಯರು ಮಳೆಯಲ್ಲಿ ನೆನೆಯುತ್ತಾ ಸೈಕಲ್ ನಲ್ಲಿ ಸಾಗಿಸಿದ್ದಾರೆ
ಸಿಎಂ @BSYBJP ಅವರೇ ಎಲ್ಲಿದೆ ನಿಮ್ಮ ಸರ್ಕಾರ? ಅವರಿಗೆ ಏಕೆ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಒದಗಿಸಲಿಲ್ಲ?
ಈ ಅಸಮರ್ಥ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮಾನವೀಯತೆ ಇಲ್ಲವಾಗಿದ್ದು, ಪಿಡುಗು ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ನಿಭಾಯಿಸಲು ಸಂಪೂರ್ಣವಾಗಿ ವಿಫಲವಾಗಿದೆ pic.twitter.com/dZxCj9sO9P
— DK Shivakumar (@DKShivakumar) August 17, 2020