
Extra Marital Affairs: ఆ మధ్య ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని బాణాపురం, వల్లభి గ్రామాల మధ్య జమాల్ సాహెబ్ అనే వ్యక్తిని మోహన్ రావు అనే వ్యక్తి మత్తు ఇంజక్షన్ ను కాలు తొడ భాగానికి గుచ్చి చంపేశాడు. దీనికి కారణం ఏంటా అని పోలీసులు ఆరా తీస్తే జమాల్ సాహెబ్ భార్యకు మోహన్ రావు తో కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది.. ఈ విషయం తెలిసిన జమాల్ సాహెబ్ భార్యను మందలించాడు. అయినప్పటికీ ఆమె తీరు మార్చుకోలేదు. తమ బంధానికి భర్త ఉండకూడదని భావించి జమాల్ సాహెబ్ ను ఆయన భార్య, మోహన్ రావు అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. తమ ప్లాన్ లో భాగంగా జమాల్ సాహెబ్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపేశారు… మొదట్లో ఈ కేసును మర్డర్ మిస్టరీగా నమోదు చేసిన పోలీసులకు. తర్వాత దీన్ని చేధించే క్రమంలో క్రమంలో కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు తెలిసాయి.. ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయి.. దేశవ్యాప్తంగా సుమారు 44, 400 మరణాలు చోటు చేసుకున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది..స్మార్ట్ ఫోన్ లు, సోషల్ మీడియా, దాంపత్యంలో విభేదాలు, చీటికీ మాటికి గొడవలు పడటం, పంతాలకు పోవడంతో దాంపత్యానికి బీటలు వాడుతున్నాయి. అంతిమంగా ఇవి భార్యాభర్తల మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే వివాహేతర బంధాలు ఏర్పడుతున్నాయి. అయితే ఇది బయటపడుతున్న నేపథ్యంలో అనుకోని ఘటనలు జరుగుతున్నాయి. ఇవి అంతిమంగా హత్యలకు దారితీస్తున్నాయి. భార్యా భర్తల్లో ఏ ఒక్కరూ తగ్గకపోవడం ఇలాంటి ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఏర్పడుతున్నదని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు..నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం గత ఏడాది 67 వేల పగ తాలూకు మరణాలు నమోదయ్యాయి. 51,554 ఆస్తి వివాదాల కేసులు నమోదయ్యాయి. ఇక ప్రేమ, వివాహేతర సంబంధాలకు సంబంధించి 44,400 మరణాలు చోటుచేసుకున్నాయి. గతంతో పోలిస్తే ఈ కేసులు 28 శాతం పెరగడం విశేషం..
అయితే ఈ తరహా ఘటనలు జరిగేందుకు అనేక కారణాలున్నప్పటికీ.. వీటిల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది సోషల్ మీడియా. అపరిచిత వ్యక్తులతో మాట్లాడటం, వారు చెప్పే మాటలకు పొంగిపోవడం, దానిని ప్రేమ అని భ్రమించడం ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. చివరకు పెళ్ళయి పిల్లలన్నప్పటికీ, సమాజం ముందు తలదించుకునేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతిమంగా ఇవి ఆయా కుటుంబాల్లో తీవ్ర అశాంతిని నెలకొల్పుతున్నాయి. ఇటీవల నెల్లూరు జిల్లాలో తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని నాలుగేళ్ల పాపను ఓ తల్లి అత్యంత కిరాతకంగా చంపేసి మురికి కాలువలో పడేసింది. గతంలో వివాహేతర సంబంధాలు ఏర్పరచుకోవడంలో పురుషుల ముందుండేవారు.. కానీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం ఇప్పుడు ఆ స్థానాన్ని మహిళలు ఆక్రమిస్తున్నారు.

వివాహేతర సంబంధాల మత్తులో చాలామందికి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆ అందం ఎల్లకాలం నిలబడదని తెలిసినప్పటికీ దానికోసం ఉన్మాదానికి వెనుకాడటం లేదు. తీరా కేసు నమోదయి, నిజానిజాలు తెలిసి, పోలీస్ కేసులు నమోదై, జైల్లోకి వెళ్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆయా కుటుంబాలు తీరని శోకాన్ని అనుభవిస్తున్నాయి. ఆ మధ్య మహబూబ్ నగర్ జిల్లాలో ఓ వివాహిత ప్రియుడుతో ఉండేందుకు భర్తను ఎవడు సినిమా ను స్ఫూర్తిగా తీసుకొని చంపేసింది. తీరా విషయం తెలిసిన తర్వాత పోలీసులు ఆమెను జైల్లోకి పంపించారు. బెయిల్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తే కుటుంబ సభ్యులు కాదు పొమ్మన్నారు. దీంతో ఆమె హైదరాబాదులోని శిశు గృహలో తల దాచుకుంటున్నది.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదంతాలు. అందుకే చాటుమాటు సంబంధాలు ఎల్లకాలం నిలబడవు.