Titan Submersible: అనుకున్నదే జరిగింది. ఇలాంటి దుర్వార్త వినకూడదు అని ప్రపంచం అనుకుందో.. అలాంటి చేదు వార్తే వినాల్సి వచ్చింది. టైటానిక్ షిప్ శకలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్ మెర్సి బుల్ కథ విషాదాంతమైంది. సముద్ర జలాల్లో ఏర్పడిన తీవ్ర ఒత్తిడి వల్ల టైటాన్ పేలిపోయింది. అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు దుర్మరణం చెందారు. ఈ మేరకు వివరాలను అమెరికన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. టైటాన్ ను వెతికెందుకు సముద్ర గర్భంలోకి పంపించిన రిమోట్ ఆపరేటర్ వెహికల్ సహాయంతో మునిగిన టైటానిక్ నౌక సమీపంలోని కొన్ని శకలాలు గుర్తించారు. టైటానిక్ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో టైటాన్ శకలాలు ఉన్నట్టు అమెరికన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది.

టైటాన్ మినీ సబ్ మెరైన్ లో ప్రయాణిస్తున్న ఓషన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి స్టా క్ట న్ రష్, ఆయనతో పాటు వెళ్లిన షెహాజ్దా దావూద్, సులేమాన్ దావూద్, హామీష్ హర్డింగ్, పాల్ హెన్రీ ఉన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ శకలాలను చూసేందుకు టూరిస్టు సంస్థ ఓషియన్ గేట్ సంస్థ పంపిన టైటానిక్ సబ్మెర్సిబుల్ (మినీ జలాంతర్గామి) ఆదివారం రాత్రి గల్లంతయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇంతకీ ఎవరు బతికి బయటకు వస్తారా? అందులో ఉన్న ఆక్సిజన్ నిలువలు సరిపోతాయా? అనే ఆందోళనలు సర్వత్రా వ్యాపించాయి. ఈ క్రమంలో అమెరికా, కెనడా దేశాలకు చెందిన రక్షణ బృందాలు అప్రమత్తమయ్యాయి. టైటాన్ ఆచూకీ కనుగొనెందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 13 అడుగుల లోతు ఉన్న చోట ఆ మినీ జలాంతర్గమి శబ్దాల వినేందుకు సోనార్లు జారవిడిచారు. పీ_8 నిఘా, సీ_130 రవాణా విమానాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ చర్యలతో గల్లంతైన వారు బతికి బట్ట కడతారని అందరూ అనుకున్నారు. కానీ వారు అనుకున్నది ఒక్కటి, సముద్రం అడుగు భాగంలో జరిగింది మరొకటి.
గల్లంతైన సబ్ మెర్సి బుల్ తీవ్రమైన ఒత్తిడి వల్ల పేలిపోయింది. అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు చనిపోయారు. కాగా ఈ సాహస యాత్రలో పాల్గొనేందుకు ఒక్కొక్క వ్యక్తి దాదాపు ఇండియన్ కరెన్సీ ప్రకారం రెండు కోట్లు చెల్లించారు. ప్రమాదమని తెలిసినప్పటికీ ఈ యాత్రకు వెళ్ళడం పట్ల కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “రక్షణ చర్యలు తీసుకోలేదు. ఆక్సిజన్ నిలువలు సరిపడా ఉంచుకోలేదు. పైగా నీటిలో ఒత్తిడి పెరిగిపోయి ప్రమాదం జరిగింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇది ముమ్మాటికీ తీవ్ర నిర్లక్ష్యమే” అని అమెరికాకు చెందిన సముద్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ ఐదుగురు గనుక బతికి వస్తే కథ వేరే విధంగా ఉండేది. టైటానిక్ శకలాలకు సంబంధించి జరిగే ప్రయోగాల్లో ముందడుగు పడేది.