
Janhvi Kapoor- NTR: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, యుగ పురుషుడు ఎన్టీ రామారావు, అతిలోక సుందరి శ్రీదేవి. ఈ పేర్లు వినగానే నాటితరానికి గుర్తొచ్చేవి ‘వేటగాడు’, ‘బొబ్బిలిపులి’, ‘జస్టిస్ చౌదరి’ వంటి ఆనాటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలు. వీరిద్దరి కాంబోలో చిత్రమంటే అది సినీ ప్రియులకు పండుగనే చెప్పాలి. అలా, ఎన్నో ఏళ్లపాటు సినీ ప్రేక్షకులను అలరించిన వారు ప్రస్తుతం మన మధ్య లేరు. అయితే, ఈ హిట్ కాంబోని రిపీట్ చేస్తూ వీరి కుటుంబాల నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ ఇప్పుడు ఓ సినిమా కోసం జట్టు కడుతున్నారు.
మొదట మనవరాలిగా..
బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు శ్రీదేవి. ‘కందాన్ కరుణై’ అనే తమిళ సినిమా కోసం ఆమె నాలుగేళ్ల వయసులోనే మేకప్ వేసుకున్నారు. ఈ క్రమంలోనే నాటి పెద్ద హీరో సీనియర్ నందమూరి తారకరామారావు ప్రధాన పాత్రలో నటించిన ‘బడిపంతులు’లో ఆయనకు మనవరాలిగా శ్రీదేవి నటించారు. అలా మొదటిసారి వీరిద్దరూ స్క్రీన్‌పై సందడి చేశారు. తాతామనవరాళ్లుగా తమ నటనతో ఆకట్టుకున్నారు.
హారోయిన్‌ను చేసిన రాఘవేంద్రుడు..
1979లో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘వేటగాడు’ కోసం ఎన్టీఆర్ – శ్రీదేవి మొదటిసారి హీరోహీరోయిన్స్‌గా నటించారు. మనవరాలిగా చేసిన ఆమెతో డ్యూయెట్స్ పాడితే ప్రేక్షకులు అంగీకరించరని భావించిన ఎన్టీఆర్.. ఆ సినిమాలో హీరోయిన్‌గా శ్రీదేవిని వద్దన్నారు. రాఘవేంద్రరావు మాట మేరకు చివరకు ముభావంగానే అంగీకారం తెలిపారు. కట్ చేస్తే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌డూపర్ హిట్. ఎన్టీఆర్– శ్రీదేవి పెయిర్‌కు విశేష ఆదరణ లభించింది. ‘ఆకు చాటు పిండె తడిసే’ పాట అప్పట్లో సెన్సేషన్ అనే చెప్పాలి. అలా ‘వేటగాడు’తో మొదలైన వీరిద్దరి ప్రయాణం సుమారు నాలుగేళ్లపాటు కొనసాగింది. ‘గజదొంగ’, ‘సర్దార్ పాపారాయుడు’, ‘కొండవీటి సింహం’సహా వీరి కాంబోలో 12 సినిమాలు తెరకెక్కాయి. 1982లో విడుదలైన ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ తర్వాత వీరు కలిసి పనిచేయలేదు.
బాలకృష్ణతో సినిమా లేదు..!
ఎన్టీఆర్ – ఏఎన్నార్ తర్వాత వచ్చిన ఆనాటి యువ నటులు చిరంజీవి, వెంకటేశ్, నాగార్జునలతో శ్రీదేవి నటించారు. అదే సమయంలో ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణతో ఆమె సినిమా చేస్తే చూడాలని పలువురు కోరుకున్నా అది నెరవేరలేదు. తన తండ్రికి హీరోయిన్‌గా చేసిన శ్రీదేవిని తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవడానికి, పనిచేయడానికి బాలకృష్ణ ఇష్టపడలేదని సమాచారం.

ఇటు ఎన్టీఆర్ మనవడు.. అటు శ్రీదేవి కూతురు!
బాలకృష్ణ– శ్రీదేవి కాంబినేషన్‌లో సినిమా మిస్ అయినా ఎన్టీఆర్– జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతుండడంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటించే అవకాశం ఉందంటూ కొంతకాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వాటిపై ఎప్పుడూ స్పందించని చిత్ర బృందం సోమవారం అధికారిక ప్రకటనతో సినీ ప్రియుల్ని సర్‌ప్రైజ్ చేసింది. ‘ఎన్టీఆర్ తన అభిమాన నటుడని, తనతో పనిచేయాలనుంది’ అని జాన్వీ పలు సందర్భాల్లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిదే. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల– ఎన్టీఆర్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభంకానుంది. 2024, ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.