
Telangana Financial Crisis: మనది బంగారు తెలంగాణ. అన్నింటిలో నెంబర్ వన్. దేశానికి ఆదర్శం. భారతదేశానికే మనం అన్నం పెడుతున్నాం. మన తర్వాతే ఎవరైనా..ఇలా ఉంటాయి కెసిఆర్ అండ్ కో చెప్పే మాటలు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉండదు.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే సకాలంలో వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు సప్లమెంటరీ బిల్లుల చెల్లింపులోనూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది.. వీటిలో కొన్ని ఏడాదికి పైగా పెండింగ్లో ఉండగా, మరికొన్ని ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. ఇళ్ళ నిర్మాణం, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం తీసుకునే అడ్వాన్సులు, రుణాల సప్లమెంటరీ బిల్లులు ఎప్పటికప్పుడు క్లియర్ కాకపోవడంతో ఉద్యోగులు నానా కష్టాలు పడుతున్నారు. తమ బిల్లుల మంజూరు కోసం కొందరు ఉద్యోగులు, హెచ్వోడీ ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమంది సచివాలయానికి వచ్చి తమ శాఖల ముఖ్య కార్యదర్శుల తో పాటు, ఆర్థిక శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కూడా కలుస్తున్నారు.. అయినప్పటికీ బిల్లులకు మోక్షం లభించడం లేదు.
ఎలాంటి సప్లమెంటరీ బిల్లు అయినా పెండింగ్లోనే ఉంటున్నది. పీఆర్సీ సవరించిన పెన్షన్ బకాయిలతో పాటు సవరించిన గ్రాట్యు టీ మొత్తం, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ ( ఉప సంహరణ), బీమా సొమ్ము నుంచి రుణాలు, మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్స్ సంబంధిత బిల్లులు మొత్తం పెండింగ్ లో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా వట్టిపోవడమే.. వివిధ వనరుల ద్వారా సమకూరుతున్న ఆదాయం ఏ నెలలో వచ్చింది ఆ నెలలో కరిగిపోతున్నది..సీఎంవో నుంచి వచ్చే ఆదేశాలతో కొన్ని రకాల బిల్లులను క్లియర్ చేస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బిల్లులు దాదాపు పదివేలకు పైగా పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించి 200 కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా. ఇది తక్కువ మొత్తం అయినప్పటికీ ప్రభుత్వం చెల్లించే సాహసం చేయడం లేదు.. ఇక ప్రభుత్వ నిర్వాకం వల్లే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి మద్దతు ఇచ్చిన వ్యక్తి కి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఓట్లు వేశారు. దీనినిబట్టి ప్రభుత్వంపై వారికి ఏ విధంగా అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక సాధారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల బిల్లులను డ్రాయింగ్ అండ్ డిస్బర్స్ మెంట్ అధికారులు తయారు చేస్తారు. వాటిని జిల్లా పే అండ్ అకౌంట్ ఆఫీసులకు పంపిస్తారు. ఆ వెంటనే బిల్లులకు సంబంధించి టోకెన్ జనరేట్ అవుతుంది. అనంతరం కొన్ని రోజుల్లోనే ఆ సొమ్ము ఉద్యోగి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఏదైనా బిల్లును క్లియర్ చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ_ కుబేర్ పోర్టల్ కు బిల్లును అప్లోడ్ చేసి, ఆర్థిక శాఖ అధికారులు మీట నొక్కాలి. అలాంటి బిల్లులే క్లియర్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. రాష్ట్ర ఖజానాలో డబుల్ లేకపోవడంతో అధికారులు బిల్లులకు అనుమతించడం లేదు. ఫలితంగా అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి బిల్లులు పదివేలకు పైగా బిల్లులు పెండింగ్లో పడ్డాయి.

ఇక బిల్లులకు ఎప్పటికప్పుడు మోక్షం లభించకపోవడంతో అవి లాప్స్ అయ్యే ప్రమాదం నెలకొంది. ఏదైనా బిల్లును చేసి పంపిస్తే అదే ఆర్థిక సంవత్సరంలో దాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని బిల్లులు గత ఏప్రిల్ నుంచి పెండింగ్లో ఉన్నాయి. కొన్ని బిల్లులు ఏప్రిల్ నుంచి పెండింగ్లో ఉంటున్నాయి. ఇలాంటి బిల్లులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 లోపు లాప్స్ అవుతాయి. మళ్లీ వీటిని రీవైస్ చేసి పంపాల్సి ఉంటుంది. డిడిఓ లకు భారంగా పరిణమించనుంది. ముఖ్యంగా పిఆర్సి, డిఏ బకాయిలు వంటి బిల్లులను తిరిగి తయారు చేసి ఉంటుంది. వీటికి ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిధులకు కేటాయింపు ఉండటం వల్ల ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. జిపిఎఫ్, జి ఎల్ ఐ వంటి బిల్లులను ఆర్థిక శాఖనే రీవాల్యుయేట్ చేసుకోవచ్చు. వీడిని తిరిగి తయారుచేసిన అవసరం ఉండదు. దీంతో ఇలాంటి బిల్లులను మరింతకాలం పెండింగ్లో పెట్టే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగులు ఆందోళన చేనుతున్నారు.