
వాహనదారులకు లైసెన్స్ ఎంత ముఖ్యమనే సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ట్రాఫిక్ పోలీసులకు తప్పనిసరిగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని తప్పులు చేస్తే మన లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తెలీక చేసే పొరపాట్ల వల్ల లైసెన్స్ క్యాన్సిల్ కావడంతో ఇబ్బందులు పడేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవడం ద్వారా మన లైసెన్స్ క్యాన్సిల్ కాకుండా మనం జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి.
కేంద్రం ఎప్పటికప్పుడు మోటార్ వెహికల్స్ రూల్స్ లో మార్పులు చేస్తూ వాహనదారులకు ప్రయోజనం చేకూరేలా చేయడంతో పాటు వాహనదారులు నిబంధనలు పాటించేలా చేస్తోంది. తాజాగా అమలులోకి వచ్చిన నిబంధనల వల్ల వాహనదారులు డ్రైవింగ్ లైసెస్స్, ఆర్.సీ లాంటి డ్యాక్యుమెంట్లు ఫిజికల్ గా అందుబాటులో లేకపోతే డిజిటల్ రూపంలోనైనా చూపించవచ్చు. అయితే కేంద్రం లైసెస్స్ కు సంబంధించిన నిబంధనల్లో సైతం స్వల్పంగా మార్పులు చేసింది.
ఆ మార్పులను తెలుసుకోకపోతే లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోడ్రన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్లు వాహనాన్ని నడిపే విధానాన్ని, డ్రైవర్ల ప్రవర్తనను గమనిస్తున్నారు. టాఫిక్ పోలీసులతో ఇష్టానుసారం మాట్లాడినా, టాఫిక్ పోలీస్ మాటలను పట్టించుకోకుండా వాహనాన్ని ఇష్టానుసారం నడిపినా ఫలితం అనుభవించాల్సి వస్తుంది.
స్మోక్, డ్రింక్ చేసి డ్రైవ్ చేసినా వాహనంపై అనుమతించిన బరువు కంటే ఎక్కువ బరువు పెట్టినా లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉంటుంది. క్యాబ్ డ్రైవర్లు వినియోగదారుల అనుమతి లేకుండా రైడ్ ను క్యాన్సిల్ చేసినా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటారు. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు ఎలాంటి తప్పు చేసినా ఆన్ లైన్ లో నమోదు చేసి జరిమనా విధించడం లేదా లైసెన్స్ రద్దు చేయడం చేస్తారు.