Don Amir Sarfaraz Shot Dead
Don Amir Sarfaraz: 1990లో అనుకోకుండా పాకిస్తాన్ సరిహద్దు దాటి.. ఆ దేశంలోకి వెళ్లిన సరబ్ జీత్ సింగ్ ఉదంతం తెలుసు కదా.. 1990లో పాకిస్తాన్ ప్రభుత్వం అతడిని అరెస్టు చేసింది. అతడి అరెస్టును నాటి భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విడుదల చేయించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఫలితంగా 23 సంవత్సరాల పాటు అతడు జైలు శిక్ష అనుభవించాడు. సరబ్ జీత్ 2013 మే నెలలో లాహోర్ జైల్లో హత్యకు గురయ్యాడు.. మన దేశంలోని పార్లమెంటుపై దాడికి పాల్పడిన అఫ్జల్ గురును ఉరి తీసిన కొద్ది రోజులకే డాన్ అమీర్ సర్ప రాజ్.. ఇంకా కొంతమంది.. లాహోర్ కోట్ లఖ్ పత్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సరబ్ జీత్ పై దారుణంగా దాడి చేశారు. ఇటుకలతో తీవ్రంగా కొట్టారు. వారు కొట్టిన దెబ్బలకు అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. మెదడు భాగంలో తీవ్రంగా గాయాలయి జిన్నా ఆసుపత్రిలో కన్నుమూశాడు. సరబ్ జీత్ ను పాకిస్తాన్ జైలు నుంచి ఇండియాకు తీసుకువచ్చేందుకు ఆమె అక్క దల్బీర్ సింగ్ తీవ్రంగా ప్రయత్నించింది. ఆమె పోరాటాలపై బాలీవుడ్లో ఒక సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్, రణ దీప్ హుడా నటించారు.
సరబ్ జీత్ ను అత్యంత కిరాతకంగా చంపిన అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ హతమయ్యాడు. పాకిస్తాన్లోని లాహోర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అత్యంత సమీపం నుంచి తుపాకీతో షూట్ చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. చాతిలో రెండు బుల్లెట్లు.. ఉదర భాగంలోనూ రెండు బుల్లెట్లు దిగాయి. తీవ్రంగా రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే పడిపోయాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. సరబ్ జీత్ ను చంపిన కేసులో అమీర్ కు వ్యతిరేకంగా సాక్ష్యం లేకపోవడంతో అక్కడి కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది.. అయితే ఇన్ని రోజులపాటు అతడు పాకిస్తాన్లోనే తలదాచుకున్నాడు. అక్కడ భారత వ్యతిరేక కార్యకలాపాలకు కార్యాచరణ చేస్తున్నాడు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేందుకు విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసేవాడు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు ఇలా గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులతో చనిపోవడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది నుంచి జరుగుతున్న ఈ మిషన్ లో ఇప్పటివరకు 14 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారు.
సరబ్ జీత్ ను హత్య చేసిన అమీర్ హత్యకు గురి కావడంతో.. అతని కూతురు స్వపన్ దీప్ కౌర్ స్పందించింది. “నా తండ్రిని మాకు కాకుండా చేశారు. అకారణంగా జైల్లో పెట్టారు. అప్పటినుంచి ఇప్పటిదాకా మేము ఏడవని రోజు అంటూ లేదు. మా అత్తయ్య మా తండ్రిని విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. అవి సఫలం కాలేదు.. మా నాన్నను చంపింది అమీర్ మాత్రమే కాదు. చాలామంది ఉన్నారు. వారందరినీ కాపాడేందుకు పాకిస్తాన్ అమీర్ ను చంపించింది. అతడు ఒక్కడు మాత్రమే కాదు ఆ ఘటనలో పాల్గొన్న వారంతా హతమవ్వాలి. వారిని కాపాడేందుకు పాకిస్తాన్ ఈ నాటకం ఆడుతోంది” అంటూ ఆమె ఆరోపించారు. అమీర్ చనిపోయిన నేపథ్యంలో పంజాబ్లో సరబ్ జీత్ చిత్రపటాలతో అక్కడి ప్రజలు ప్రదర్శన జరిపారు. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి సరబ్ జీత్ చిత్రపటాలకు నివాళులర్పించారు. పాకిస్తాన్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.