Dog Journey: మనకు ఒక గంట సేపు నీరు తాగకపోతే ఏమవుతుంది? ఒక రోజు అన్నం లేకపోతే ఎలా ఉంటుంది? ఏముంది నీరసపడిపోతాం. సత్తువ కోల్పోయి కూలబడిపోతాం అలాంటిది ఒక శునకం 27 రోజులపాటు ఆహారము ముట్టలేదు. 64 కిలోమీటర్లు ఏకధాటిగా ప్రయాణించింది. దారి తెలియకున్నా పట్టు బిగియకుండా ప్రయాణం సాగించింది. ఆ దారిలో ఎన్నో తిప్పలు పడింది. ఎన్నో ప్రయాసలకు ఓర్చింది. చివరికి కష్టేఫలి అన్నట్టు తన కథ సుఖాంతమైంది. అంతేకాదు తమ జాతిని విశ్వసానికి మారుపేరు అని ఎందుకు అంటారో మరోసారి యావత్ ప్రపంచానికి నిరూపించింది. కాదు పట్టెడు అన్నం పెట్టినందుకు యజమానిపై ఈ విధంగా స్వామి భక్తి చూపింది. ఇంతకీ ఏమిటి ఆ శునకం? ఎక్కడ జరిగింది ఇంత పెద్ద స్టోరీ? అదేంటో మీరు కూడా చదివేయండి.
కొన్ని కథలే కన్నీళ్లు తెప్పిస్తాయి
ఈ సృష్టిలో ప్రేమ, స్నేహం అనేవి గాఢమైన బంధాలు. ప్రేమ అనేది అనంతం. దానికి ఎల్లలు లేవు. స్నేహం అనేది శాశ్వతం.. దానికి ఎటువంటి ఉపమానాలు అక్కరలేదు. కానీ ఇలాంటి ప్రేమకు స్వచ్ఛతను కొన్ని కొన్ని కథలు మాత్రమే మరింత పరిపూర్ణతను తీసుకొస్తాయి. అయితే అలాంటి పరిపూర్ణతను ఈ శునకం తీసుకొచ్చింది. కొంచెం స్నేహంగా మెలిగితే చాలు శనకాలు అచంచలమైన విశ్వాసాన్ని కనబరుస్తాయి. ఇక అవి మనుషుల పట్ల చూపించే ప్రేమను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఒక శునకం తన యజమాని కోసం ఏకంగా సాహసమే చేసింది. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోతోంది. ఆ కథ తెలుసుకున్న వారికి కంటనీరు ఉబికి వస్తోంది.
దత్తత వెళ్ళింది
కూపర్ జాతికి చెందిన ఒక శునకం ఒక నెల కిందట యూరప్ లోని ఐర్లాండ్ దేశంలో టైరోన్ కౌంటీ లోని ఓ ఇంటికి దత్తత వెళ్ళింది. దానిని కొనుగోలు చేసిన వ్యక్తి కారు నుంచి దిగి దిగగానే పరుగులు అందుకుంది. వారు దానిని వెంబడించినా పరుగు మాత్రం ఆపలేదు.. ఇక చేసేది లేక వారు కూడా దానిని వదిలిపెట్టారు. ఇక ఆ మొదలైన దాని ప్రయాణం 40 కిలోమీటర్ల పాటు సాగింది. అది ఐర్లాండ్ లో ఉన్న లండన్- డెర్రీ లోని టోబర్ మోర్ లో ఉన్న తన పాత యజమాని చెంతకు చేరింది.. అయితే వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని కనిపించకుండా పోయిన మూగజీవాల గురించి ఆరా తీసే ” లాస్ట్ పాస్ ఎన్ఐ” అనే చారిటీ సంస్థ.. కూపర్ శునకం అందమైన కథను సోషల్ మీడియాలో పంచుకుంది.
నెలపాటు ప్రయాణం
కూపర్ దాదాపు నెలపాటు ప్రయాణం సాగించింది. ఎక్కడ కూడా అడుగు ఆగలేదు.. ఇంకెవరి సహాయం తీసుకోకుండా ముందుకు సాగింది. తనకు దారి తెలియక పోయినప్పటికీ తన పాత యజమానిని కలుసుకుంది. ఇక అది తిరిగి రావడం చూసి తన పాత యజమాని ఉద్వేగానికి గురయ్యాడు. ఇకపై కూపర్ ను ఎక్కడికి పంపించబోనని, తనతోనే ఉంచుకుంటానని అతడు కన్నీళ్ళతో చెబుతున్నాడు. అన్నట్టు ఈ కూపర్ తన పాత యజమానితోనే ఉండేది. అయితే అతడు కుక్కలకు కేర్ టేకర్ గా వ్యవహరిస్తాడు. మిగతా కుక్కల మాదిరిగానే దీనిని కూడా చూసేవాడు. వాటిని ఇతరులకు అమ్మేవాడు. అయితే అవి వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు అరుదు. కానీ ఈ కూపర్ మాత్రం తిరిగి వచ్చేసింది. తన యజమానిని కలుసుకునేందుకు నిద్రాహారాలు మాని వచ్చేసింది.. ప్రస్తుతం ఈ స్టోరీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ కథ మొత్తం చదివిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. “విశ్వాసానికి మారుపేరైన కుక్క మనుషులకు చాలా పాఠాలు నేర్పిందని”వ్యాఖ్యానిస్తున్నారు.