
Hyderabad: హైదరాబాద్ అంటే చార్మినార్.. చార్మినార్ అంటే హైదరాబాద్.. నిన్నా మొన్నటి వరకు కూడా పరిస్థితి ఇలానే ఉండేది. చార్మినార్ మాత్రమే హైదరాబాద్ కు ఐకానిక్ సింబల్ గా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. వాస్త వానికి 183 అడుగులు ఉన్న చార్మినార్ ను మాత్రమే ఎత్తయిన నిర్మాణంగా పేర్కొనేవారు. ఆ తర్వాతి ఖ్యాతి హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న గౌతమ బుద్ధుడికి ఉండేది. ఈ బుద్ధ విగ్రహం ఎత్తు 58 అడుగులు. ఇప్పుడు హైదరాబాద్ సిగలో అనేక ఎత్తైన నిర్మాణాలు వచ్చి చేరాయి. అవి కూడా ఈ తొమ్మిది సంవత్సరాలలోనే.
తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక ఎత్తైన కట్టడాలను ప్రభుత్వం నిర్మించింది. వీటిల్లో అత్యంత ఎత్తైన కట్టడం పోలీస్ కమాండ్ కంట్రోల్. దీని ఎత్తు 272 అడుగులు. ఈ సెంటర్ పైనుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. దీని ద్వారా తెలంగాణ లో ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఎందుకంటే దీని కమాండ్ కంట్రోల్ కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలు అనుసంధానించారు.
ఇక దీని తర్వాత అత్యంత ఎత్తైన నిర్మాణం ముచ్చింతల్ లోని సమతా మూర్తి విగ్రహం. ఈ విగ్రహాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో నిర్మించారు. ఈ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ విగ్రహం ఏర్పాటుతో ముచ్చింతల్ ప్రాంతం పర్యాటకంగా వెలుగొందుతోంది. దీనిని జీయర్ మఠం ఏర్పాటు చేసింది.
ఇక హుస్సేన్ సాగర్ తీరంలోనే ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి ఏడు అంతస్తులు ఉంది. సచివాలయం పై ఉన్న గుమ్మటాలు, వాటిపైన అశోక చిహ్నం అన్నింటినీ కలుపుకుంటే మొత్తం ఎత్తు 278 అడుగులకు చేరింది. నూతన సచివాలయం పై నిర్మించిన గుమ్మటాల ఎత్తే 48 అడుగులు. హుస్సేన్ సాగర్ తీరంలోని సచివాలయానికి ఎదురుగా నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం ఎత్తు 161 అడుగులు. సమిత ఆకారంలో ఉన్న అమరవీరుల స్మారక చిహ్నంలో జ్యోతి ఆకారం ఎత్తే 50 అడుగులకు పైగా ఉంటుంది.

వీటితోనే అయిపోలేదు హైదరాబాదు నగరంలో పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో బహుళ అంతస్తులు నిర్మితమవుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన భవనాలను హైదరాబాదులో నిర్మిస్తున్నారు.. అయితే నిబంధనలకు విరుద్ధంగా భారీ వాణిజ్య సముదాయాలు నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం వల్ల పర్యావరణ సమస్యలతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.