Train Alcohol: భారతదేశంలో అతిపెద్ద రవాణా మార్గం రైలు. రైలులో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ఒక చోట నుంచి మరో చోటుకు ప్రయాణిస్తూ ఉంటారు. దూరం ప్రాంతాలకు ప్రయాణికులను సౌకర్యవంతంగా.. అత్యంత వేగంగా తీసుకెళ్లే సాధనం రైలు మాత్రమే కావడంతో చాలా మంది రైలులో ప్రయాణించేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ప్రయాణికులకు అనుగుణంగా రైల్వే వ్యవస్థ అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతుంది. సామాన్యుల నుంచి ధనికుల వరకు కేటగిరీలుగా సౌకర్యాలు కల్పిస్తూ చార్జీలు వసూలు చేస్తుంది. అయితే రైలులో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొన్ని నిబంధనలు విధించింది. ఈ నిబంధనల ప్రకారం ప్రయాణం చేయాలి. వీటిని ఉల్లంఘిస్తే ప్రత్యేక చట్టం ద్వారా వారిపై చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా రైలులో నిషేధిత వస్తువులు తీసుకెళ్తే ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసుకుందాం..
మిగతా రవాణా సాధనాల కంటే రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే రైలు ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే వ్యవస్థ కొన్ని నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనల ప్రకారం రైలులో నిషేధిత వస్తువులు, పదార్థాలు తీసుకెళ్లరాదు. అవేంటంటే రసాయనాలు, బాణసంచా, యాసిడ్, గ్రీజు తో పాటు మద్యంను తీసుకెళ్లడాన్ని నిషేధించింది. కొన్ని వస్తువుల ద్వారా రైలు మురికిగా మారుతుంది, మరికొన్నింటి వల్ల ప్రమాదాలు జరుగుతాయని నిబంధనలు పెట్టింది. అయితే మద్యం తీసుకెళ్లడానికి కూడా రైల్వే వ్యవస్థ నిబంధనలు పెట్టింది.
రైలులో మద్యం తీసుకెళ్లినా.. లేదా మద్యం సేవించి ప్రయాణించినా.. చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైల్వే చట్టం సెక్షన్ 145 ప్రకారం రైల్వే ప్రాంగణంలోని లేదా రైలులో మత్తు పదార్థాలు సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే.. ఆ విషయాన్ని అడ్మినిస్ట్రేటివ్ గుర్తిస్తే చర్యలు తీసుకుంటారు. ఇలా చేసిన దానికి సదరు వ్యక్తికి ఆరు నెలలు జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ.500 జరిమానా విధిస్తారు. అలాగే రైలులో మద్యం తీసుకెళ్లితే 1989 సెక్షన్ 165 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మద్యం మాత్రమే కాకుండా రైలులో నిషేధిత వస్తువులు తీసుకెళ్లినా ఆ వ్యక్తిపై సెక్షన్ 164 ప్రకారం రూ.1000 జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇక రైలులో ప్రమాదకర వస్తువులు తీసుకెళ్లిన క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ప్రయాణికుడు భరించాల్సి ఉంటుంది. అందువల్ల రైలులో ప్రయాణం చేసేటప్పుడు మద్యం లాంటి మత్తు పదార్థాలు సేవించకుండా.. నిషేధిత వస్తువులతో వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.