
Daughter-in-Law: ఇటీవల క్షణికావేశంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మరికొన్ని వాటిలో చిన్న చిన్న గొడవలే హత్యలకు దారితీస్తున్నాయి. ఇక కుటుంబాల్లో అత్తా కోడల్ల పంచాయితీలు, గొడవలు, కొట్టుకోవడాలు ఆధునిక కాలంలోనూ కొనసాగుతున్నాయి. కొంత మంది అత్తా కోడళ్లు స్నేహితుల్లా, తల్లీ కూతురుల కలిసి ఉంటున్నారు. చాలా ఇళ్లలో అత్తా కోడళ్ల మధ్య గిల్లికజ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్తలు కోడళ్లను రాచిరంపాన పెడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవలే విజయనగరం జిల్లాలో ఓ అత్త, భర్త, కలిసి కోడలిని 13 ఏళ్లు గడప దాటనియయలేదు. అయితే అంతా అత్తల డామినేషనే ఉండడం లేదు. అత్తను రాచిరంపాన పెట్టే కోడళ్లు కూడా ఈమధ్యకాలంలో తయారవుతున్నారు. రెండు జుట్ల కలిసి ఉంటాయి కానీ, రెండు జెడలు కలిసి ఉండవు అన్న చందంగా కొట్టుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో ఓ కోడలు అత్తను అంతమొందించింది. అదేదో పెద్ద గొడవ పడి కూడా కాదు. కేవలం టీ చల్లారింది అన్నందుకే. వేడి వేడి ‘టీ’ కావాలని అడిందని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసింది.
టీ అడిగితే..
తమిళనాడులోని పుదుక్కొటై్ట జిల్లాలో మలైక్కుడిపట్టికి చెందిన వేల్, పళనియమ్మాళ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నాడు. పళనియమ్మాళ్ కుమారుడు సుబ్రమణ్యన్ వద్ద ఉంటోంది. మంగళవారం రాత్రి బయటి నుంచి వచ్చిన పళనియమ్మాళ్.. కోడలు కనుకును పిలిచి టీ పెట్టాలని కోరింది. కోడలు పెట్టిన టీ చల్లారిపోవడంతో ఆమె.. కోడలిని మందలించింది. దీంతో ఆగ్రహించిన కనుకు.. ఇనుప రాడ్డు తీసుకుని అత్త తలపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పళనియమ్మాళ్‌ను తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించింది.
సఖ్యత లేదంటున్న స్థానికులు..
అయితే సుబ్రమణియన్ తల్లి పళనియమ్మాళ్, కనుకు మధ్య సఖ్యత లేదని స్థానికులు చెబుతున్నారు. చీటికి మాటికి కనుకు అత్తను వేధిస్తోందని అంటున్నారు. ఆమె మానసిక పరిస్థితి కూడా సరిగా ఉండడం లేదని పేర్కొంటున్నారు. ముగ్గురు కూతుళ్లు ఉన్న పళనియమ్మాళ్ కోడలిని కూడా కూతురులాగే చూసుకోవాలని చూసిందని, కానీ కనుకు మాత్రం ప్రతీ విషయానికి ఆవేశపడుతుందని వెల్లడించారు.
క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల కారణంగా ప్రాణాలే పోతున్నాయనడానికి ఈ ఘటన ఉదాహరణ. పూర్వకాలంలో ఉన్నంతగా ప్రస్తుతం అత్తా కోడళ్ల మధ్య వేధింపులు లేవు. కానీ, అక్కడక్కడ ఇప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి.