Anakapalle: సాధారణంగా ప్రతి కుటుంబంలోనూ సమస్యలు వస్తాయి. దాంపత్యంలో సైతం అరమరికలు సహజం. కానీ కొందరు భర్తలు మాత్రం అదనపు కట్నం కోసమో.. అనుమానంతోను నిత్యం భార్యలను వేధిస్తుంటారు. మరికొందరు అయితే మానసికంగా, శారీరకంగా హింసిస్తుంటారు. కొందరు ఆత్మహత్యలకు పురిగొల్పుతుంటారు. ఇంకొందరు అయితే హత్య చేసేందుకు కూడా వెనుకడుగు వేయరు. ఇటీవల ఇటువంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లా అనకాపల్లిలో ఓ కానిస్టేబుల్ తన భార్య పట్ల చూపిన అమానుషం సభ్య సమాజంలో తలదించుకునేలా చేసింది.
అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ యువకుడు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు విశాఖ నగరంలోని తాటి చెట్లు పాలెం ప్రాంతానికి చెందిన యువతితో 2013లో వివాహం జరిగింది. అయితే నిత్యం ఆ కానిస్టేబుల్ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. అదనపు కట్నం తీసుకురావాలని ఒకసారి, అనుమానంతో ఇంకోసారి ఇబ్బందులు పెట్టేవాడు. చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇటీవల ఈ వేధింపులు అధికమయ్యాయి. బాధిత యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతూ వచ్చారు. అయితే అల్లుడు కానిస్టేబుల్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేశారు.
అత్తవారి ఉదాసీన పరిస్థితిని గమనించిన ఆ కానిస్టేబుల్.. భార్యపై వేధింపులు అధికం చేశాడు. ఈ నెల 18న రాత్రి ఆమెను తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ట్రిమ్మర్ తో గుండు గీశాడు. కనుబొమ్మలను సైతం తీసేశాడు. దీంతో బాధితురాలు కన్నీరు మున్నీరవుతూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వారి సహకారంతో నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కానిస్టేబుల్ పై హత్యాయత్నం, అదనపు కట్నం వేధింపుల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆ కానిస్టేబుల్ సైతం అరెస్టు చేసినట్లు సమాచారం. దీనిపై ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధిత మహిళలకు న్యాయం చేయాలని కోరుతున్నాయి.