
Breakfast: మనలో చాలా మంది పనుల పేరిట ఉదయం పూట ఏం తినడం లేదు. అల్పాహారం మానేసి ఆఫీసులకు వెళ్తుంటారు. దీంతో చాలా ఇబ్బందులు వస్తాయి. నిద్ర లేచిన తరువాత ఎక్కువ సేపు శరీరాన్ని ఏం తినకుండా ఉంచడం వల్ల నష్టాలే ఉంటాయి. ఆలస్యంగా నిద్ర లేవడంతో ఆఫీసుకు వెళ్లాలనే హడావిడిలో టిఫిన్ తినడం మానేస్తున్నారు. దీని వల్ల కలిగే దుష్ర్పభావాలను గురించి పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో బ్రేక్ ఫాస్ట్ మానేస్తే మన శరీరం ఇబ్బందులకు గురవుతుంది. సాకులు చెప్పకుండా బ్రేక్ ఫాస్ట్ ను సరైన సమయంలో తీసుకుని మనకు అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాల్సిందే.
టిఫిన్ మానేస్తే..
అల్పాహారం మానేయడం వల్ల అనర్థాలే వస్తాయి. జీవక్రియకు భంగం కలుగుతుంది. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రాత్రి భోజనం చేసిన తరువాత ఎక్కువ సేపు భోజనం చేయకుండా ఉండటం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది. ఫలితంగా శరీరం రిఫ్రెష్ కావడానికి ఏదైనా తినాల్సిందే. ఏది తినకపోతే మనకు కావాల్సిన శక్తి తగ్గిపోవడంతో నీరసం వస్తుంది. అందుకే బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల మనం తిరిగి పోయిన శక్తిని సొంతం చేసుకోవచ్చు.
మధుమేహం, రక్తపోటు వంటి..
అల్పాహారం మానేయడం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు ఏర్పడుతుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పడిపోయే వీలుంటుంది. టిఫిన్ లో ప్రొటీన్లు ఉండే ఆహారాలు, తృణ ధాన్యాలు, పాలిష్ చేయని పప్పులు, కొవ్వు తక్కువగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి. ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోవడం వల్ల కోపం, చిరాకు, మలబద్ధకం, జుట్టు రాలడం వంటి సమస్యలు రావడం సహజం. భోజనం తరువాత ఎక్కువ సమయం విరామం ఉండటం వల్ల నష్టాలే ఎక్కువ.

రెండు గంటల లోపు..
ఉదయం లేచిన తరువాత రెండు గంటల లోపు ఏదైనా ఆహారం తీసుకోవడమే ఉత్తమం. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల శరీర మెటబాలిజం దెబ్బతింటుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అధిక బరువు పెరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. అల్పాహారం తినకపోవడం వల్ల ఊబకాయం, రక్తపోటు, మధుమేహం స్థాయిలు పెరుగుతాయి. ప్యాక్ చేసిన ఆహారాల జోలికి వెళ్లొద్దు. ఇంట్లో వండిన వాటినే తీసుకోవడం వల్ల మంచి లాభాలుంటాయి. అల్పాహారం తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు కూడా ఎక్కువే.