Gautam Adani: గౌతమ్ ఆదాని… భారతదేశంలోనే అతిపెద్ద కుబేరుడు. ఆయన అడుగుపెట్టని వ్యాపారం అంటూ లేదు. మట్టి పట్టుకుంటే బంగారం అవుతున్నది. అతడి వ్యాపార సామ్రాజ్యం అంతకంతకు విస్తరిస్తున్నది. ఏకంగా అమెజాన్ సీఈవో జెఫ్ బేజోస్ స్థానానికే అతడు ఎసరు పెట్టాడు అంటే వ్యాపారం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు.. అనేక కంపెనీలను టేక్ ఓవర్ చేసుకుంటూ తలలు పండిన వ్యాపారులకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అంతేకాదు ఇటీవల ఎసిసి సిమెంట్ కంపెనీని టేక్ ఓవర్ చేసి భారతదేశంలోనే అతిపెద్ద సిమెంటు తయారీదారుగా అవతరించాడు. అపర కుబేరుడైన గౌతమ్ అదానికి ఆటవిడుపు ఏమిటి? ఆయన తన ఒత్తిడిని ఎలా తగ్గించుకుంటారు? ఇందులో ఆయన సతీమణి పాత్ర ఎంత?

రమ్మీ ఆడతాడు
ఒక్కొక్కరికి ఒక్కో పనిలో ఆనందం ఉంటుంది. ఆ పని బోర్ కొడితే మరో వ్యాపకం చూసుకుంటారు.. గౌతమ్ అదాని కూడా అంతే.. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి ఇంటికి వచ్చేదాకా అతడికి ముక్కు సలపని ఒత్తిడి ఉంటుంది. విదేశాలు కూడా తిరగాల్సి ఉంటుంది.. ఇలాంటి సమయంలో బుర్ర వేడెక్కిపోతుంది. అలాంటి సందర్భంలో ఆయనకు స్ట్రెస్ బస్టర్ రమ్మీ గేమ్.. ఈ మాట చెప్పింది కూడా సాక్షాత్తు ఆయనే. రోజు రాత్రి తన భార్యతో కలిసి 8 నుంచి 10 వరకు రమ్మీ పప్లూ గేమ్స్ ఆడుతాడు.

ఇదే అతగాడి రహస్యమట
ఇక ఇటీవల గౌతమ్ ఇండియా టీవీలో “ఆప్ కా అదాలత్” అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు ఎటువంటి భేషజం లేకుండా పంచుకున్నారు. ” నేను రోజంతా ఎంత పని ఒత్తిడితో ఉంటాను.. ఒక్కోసారి ఊపిరి కూడా సలపదు.. రాత్రికి ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయిన తర్వాత… నా భార్యతో కలిసి రమ్మీ పప్లూ ఆడతాను.. ఇది నన్ను ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. కానీ ఎక్కువసార్లు నా భార్య నాపై గెలుస్తుంది” అంటూ గౌతమ తన రమ్మి చరిత్ర చెప్పారు. ఇది విన్న వ్యాఖ్యాత పగలబడి నవ్వారు.. ప్రస్తుతం అదానీ రమ్మీ కథా కమామీసు నెట్టింట వైరల్ గా మారింది.