Cannabis Linen: గంజాయి లేదా లక్ష్మీ పత్రీ.. ఇదొక మత్తు మందు. సాగు నిషేధం, అమ్మకం నిషేధం. రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడితే రకరకాల కేసులు, శిక్షలు.. ఇక్కడి వరకే మనకు తెలుసు. కానీ గంజాయి అనేది అనేక ఔషధ విలువలున్న మొక్క. చరకుడు, శుశ్రుతుడు తమ ఆయుర్వేద విధానంలో ఈ మొక్కను విరివిగా వాడేవారు. దీర్ఘకాలిక రోగాల నివారణకు ఈ మొక్కల పసరును వినియోగించేవారు. అయితే ఇందులో మత్తును కలిగించే గుణాలు అధికంగా ఉండటంతో కాలక్రమేణా ఇది ఒక మత్తు మొక్కగా మారిపోయింది. దీంతో ప్రభుత్వాలు దీని సాగుపై నిషేధం విధించాయి. అయితే ప్రకృతిలో ప్రతీ మొక్క విలువైనదే. కానీ దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అన్నదే ముఖ్యం. గంజాయి మొక్కను కేవలం మత్తుమందుకే కాకుండా ఇంకా అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నెలసరి సమయంలో వాడే ప్యాడ్స్ గా, ఇళ్ళ నిర్మాణాల్లో ఉపయోగించే ఇటుకలుకా.. ఇంకా రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. గంజాయి ఉపయోగాలపై ఏకంగా ఒక స్టార్టప్ కంపెనీ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది.

ఏవోబీ సరిహద్దుల్లో భారీగా సాగు
ఆంధ్రా – ఒడిశా సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో 14 వేల ఎకరాలకు పైగానే గంజాయి సాగు అవుతుందని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల తెలంగాణలో కూడా గంజాయి పట్టివేత కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రభుత్వాలు నిషేధించినా గంజాయి సాగు పైన రైతులు ఎందుకు ఆసక్తి చూపుతారంటే.. గంజాయి పంట ఎకరానికి రెండు సీజన్లలో కలిపి దాదాపు 50 లక్షల వరకు ఆదాయం ఇస్తుంది. పైగా వరి పసుపు అపరాలు వంటి చిరుధాన్యాల మధ్య అంతర్పడ్డ గంజాయిని సాగు చేయవచ్చు. ఒకప్పుడు ఆంధ్రాలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలోని మన్యం ప్రాంతాల్లో వందల ఎకరాల్లోనే గంజాయి సాగయేది. కానీ ఇప్పుడు వేల ఎకరాల్లోకి విస్తరించింది. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లో ఒకప్పుడు పదుల ఎకరాలకే పరిమితమైన గంజాయి ఇప్పుడు వెయ్యి ఎకరాలకు విస్తరించింది. ఇందుకు కారణం భారీగా లాభాలు వస్తుండమే. ఇందులో ముఖ్యంగా శీలావతి అనే రకం గంజాయి తోటలే ఎక్కువగా సాగుతున్నాయి. గంజాయి అంటే మత్తుమందే కాదు ఆ మొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మొక్కల ఆధారంగానే హిమాలయన్ హెంప్ అనే సంస్థ స్టార్టప్ కంపెనీని ప్రారంభించింది. ఇది గంజాయి మొక్కల నుంచి నారాయణ తీసి అనేక పర్యావరణ వస్తువులను తయారుచేస్తోంది. ఇటీవల ఆ స్టార్టప్ కంపెనీ తయారుచేసిన ఉత్పత్తులను నిర్వాహకులు హైదరాబాదులో పరిచయం చేశారు.
Also Read: Bandi Sanjay Padayatra: ‘బండి’ పాదయాత్రకు బ్రేక్ వేసిన కేసీఆర్ సర్కార్.. తగ్గేదేలే అంటున్న సంజయ్
ఆ కంపెనీ ఇంజనీర్ దిలీప్ ఏమంటున్నారంటే
గంజాయి అంటే కేవలం మత్తుమందు మాత్రమే కాదని, దాని నుంచి అనేక రకాలైన పర్యావరణహిత ఉత్పత్తులను తయారు చేయవచ్చని అంటారు ఆ కంపెనీ ఇంజనీర్ దిలీప్. హిమాలయన్ హెంప్ సంస్థ గంజాయి నుంచి వివిధ రకాలైన పర్యావరణహితమైన ఉత్పత్తులను తయారు చేస్తోంది. పైగా వీటిని తిరిగి వాడవచ్చు. పేద కుటుంబాల్లో యుక్త వయసు అమ్మాయిలు నెలసరి సమయంలో తరచూ అధిక ధర పెట్టి శానిటరీ నాప్కిన్స్ కొనలేరు. రుతుక్రమ సమయంలో వారికి ఏడు ప్యాడ్లు అవసరం అవుతాయి. మార్కెట్ లో వాటి ధరలు కూడా ఎక్కువే. మార్కెట్లో దొరికే సానిటరీ ప్యాడ్ లను సింథటిక్ ప్లాస్టిక్తో రూపొందిస్తారు. వాటిని ఎక్కువసేపు ఉంచడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గంజాయితో నారతో తయారుచేసే ప్యాడ్లు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. పైగా మామూలు ప్యాడ్లు పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి. కానీ గంజాయి ప్యాడ్స్ త్వరగా భూమిలో కలిసిపోతాయి. అందులోనూ పర్యావరణహితం. పైగా నేటికీ చాలామంది యువతులు ప్యాడ్స్ కొనే స్తోమత లేక ఇప్పటికి పాత బట్టలను, మోటు పద్ధతులను ఉపయోగిస్తూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. అయితే ఈ ప్యాడ్ లను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లో హిమాలయన్ హెంప్ ఒక ఫ్యాక్టరీని నెలకొల్పింది. గంజాయి నార ద్వారా తయారైన ప్యాడ్ ను 80 సార్లు రీయూజ్ చేయవచ్చు. ఒక ప్యాకెట్ కొంటే ఏడాది పాటు వస్తుంది. ప్యాడ్స్ మాత్రమే కాకుండా.. నారా వస్తువులు, మాస్కులు, టీ షర్టులు, దారాలు, వివిధ ఆకృతుల్లో దుస్తులు కూడా తయారు చేస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా మార్కెట్లోకి రాబోతున్నాయి.

ఉత్తరాఖండ్లో ఇటుకలు కూడా..
గంజాయి మొక్కల నారలో లాటిక్స్ గట్టాపర్చా అనే ఒక ఆల్కలాయిడ్ ఉండటం వల్ల దానికి దృఢత్వం ఎక్కువగా ఉంటుంది. గుర్తించే ఆ మొక్కల నారను ఇటుకలు, గృహ నిర్మాణంలో వాడుతున్నారు. ఒక రకమైన గంజాయి మొక్కలను ఎండబెట్టి, ముక్కలు చేసి, పొట్టుగా చేస్తున్నారు. వాటిని మట్టిలో కలిపితే ఇటుకలు తయారవుతున్నాయి. అటవీ సంపదను కాపాడేందుకు సాధారణ కలపకు ప్రత్యామ్నాయంగా గంజాయి కలపతో నిర్మిస్తున్నామని హిమాలయన్ హెంప్ సంస్థ పేర్కొంటున్నది. సదరు సంస్థ కేవలం సామాజిక సేవా దృక్పథంతో ఈ పనులు చేస్తున్నది కాబట్టి ప్రభుత్వం అడ్డు చెప్పడం లేదు. పైగా సాగు చేసిన గంజాయి విస్తీర్ణం, వచ్చిన దిగుబడి, దేనికి వినియోగించారు అనే లెక్కలు, తయారుచేసిన ఉత్పత్తులు.. ఇలా ప్రతి అంశాన్ని పూర్తి గణాంకాలతో హెంప్ సంస్థ ప్రభుత్వానికి నివేదిస్తోంది. ఇది సామాజిక సేవా సంస్థ అయినప్పటికీ.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా చాలా వరకు ఈ ప్యాడ్స్ లను హిమాచల్ ప్రదేశ్ లోని మారుమూల అటవీ గ్రామాల ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. కేవలం షీలావతి మాత్రమే కాకుండా ఇతర రకాలపై కూడా ప్రయోగాలు చేస్తోంది. ఇంత చేస్తున్నా గంజాయి విషయంలో తప్పులు దొర్లకుండా ఉండేందుకు అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. పైగా తోటల్లో పనిచేసే వ్యక్తుల పై నిఘా పెడుతోంది. ప్రస్తుతం హిమాలయన్ సంస్థ గంజాయితో రకరకాల ఉత్పత్తులు చేస్తున్న నేపథ్యంలో మిగతా కంపెనీలు కూడా ఈ రంగంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

