Sankranti Donates: తెలుగు వారికి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. మకర సంక్రాంతిగా పిలిచే ఈ పండుగ ప్రాశస్త్యం ఘనంగానే ఉంటుంది. పంటలు ఇంటికి చేరిన తరువాత చేసుకునే పండుగ కావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు ముచ్చటగా జరుపుకునే పండుగలో చిన్న పిల్లలు కూడా సంతోషంగా పాల్గొంటారు. వారికి పోసే భోగిపళ్లతో వారి సంతోషాలకు అంతే ఉండదు. పతంగులు ఎగరేయడం ఈ పండుగ ప్రత్యేకత. ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన పండుగగా సంక్రాంతికి విశేష ప్రాధాన్యం ఉంది. దీంతో దీన్ని ఘనంగా జరుపుకునేందుకు అందరు శ్రద్ధ కనబరచడం సహజమే.

తెలుగు వారి లోగిళ్లు కళకళలాడే పండుగ సంక్రాంతి. రంగు రంగుల ముగ్గుల మధ్య అందమైన గొబ్బెమ్మలతో ఇళ్లను అలంకరించడం ఆనవాయితీ. మకర సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుచిగా శుభ్రంగా ఉండాలి. రాగి పాత్రలో గంధం, ఎర్రటి పువ్వు, బెల్లం, బియ్యం సమర్పించాలి. రాగి చెంబులో సూర్యుడిని నీటిని అర్జ్యమివ్వాలి. ఈ రోజు నువ్వులను దానంచేయడం వల్ల పుణ్యం వస్తుంది. బెల్లం కూడా వితరణ చేయొచ్చు. నెయ్యిని దానం చేస్తే ఇంకా శ్రేష్ఠం అని పురాణాలు చెబుతున్నాయి.
సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడు మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ రోజున దేవతలు భూమిపైకి వస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తారు. మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల శని దోషం పోతుంది. నల్ల శనగ పిండితో కిచిడీ చేయడం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇలా మకర సంక్రాంతిపై ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. ఇళ్లలో ఉన్న పాత వస్తువులను మంటల్లో వేయడం ప్రత్యేకమైన ఆచారంగా ఉంది. ఇంట్లో ఉన్న పాతవస్తువులను తీసేసి కొత్త వస్తువులను ఉంచుకోవడంతో అంతా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు.

ఈ పండుగను దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండుగను జరుపుకుంటుంటారు. సంక్రాంతి రోజున సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తే మంచిదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున పెద్దలను తలుచుకుంటారు. కొంతమంది బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం ఆచారం. శివుడిని పూజిస్తుంటారు. అమ్మవారికి నైవేద్యం పెడతారు. గోవులను అలంకరిస్తారు. ఇలా సంక్రాంతికి అనేక ప్రత్యేకతలు ఉండటంతో దీన్ని వైభవంగా నిర్వహించుకుంటారు.