Supreme Court- AP: కోర్టు ధిక్కారం అనేది ఏపీ సర్కారుకు అలవాటైపోయిన చర్య. అప్పుడెప్పుడో కోర్టులు చిన్న విషయానికి తప్పుపడితే ప్రభుత్వాలు కూలిపోయేవి. ప్రజాప్రతినిధులు పదవులను కోల్పోయేవారు. అప్పట్లో నైతికత అనే అంశం ఫరిడవిల్లేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. న్యాయశాఖ తీర్పును సైతం ప్రశ్నించే దౌర్భగ్య పరిస్థితులు దాపురించింది. పాలనా వ్యవస్థలో ఇతర వ్యవస్థల జోక్యమేంటి అని ప్రశ్నించేదాకా పరిస్థితి వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది బాధితులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. అనుకూలంగా తీర్పు పొందుతున్నారు.. కానీ ప్రభుత్వం వద్దకు వచ్చేసరికి వారికి న్యాయం జరగడం లేదు. కోర్టు తీర్పులు అమలుకావడం లేదు. మళ్లీ ధిక్కార పిటీషన్లు వేసి కాస్తా స్వాంతన పొందుతున్నారు. అయితే కోర్టు కేసుల విషయంలో దెబ్బమీద దెబ్బ పడుతున్నా ప్రభుత్వానికి చలనం లేదు. తాజాగా జీవో 1 విషయంలో సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున అక్కడే తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

అప్పుడెప్పుడో బ్రిటీష్ కాలం నాటి పోలీస్ జీవోను ప్రభుత్వం తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర, జాతీయ రహదారులపై సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 1ను జారీ చేసింది. అయితే అది విపక్షాలకేనన్నట్టు వ్యవహరిస్తోంది. వైసీపీకి మినహాయింపు ఇచ్చింది. కందుకూరు, గంటూరులో చంద్రబాబు పర్యటనల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడ్డారు. దానిని సాకుగా చూపి ప్రజారక్షణ కోసం కఠిన జీవోను తెరపైకి తెచ్చింది. సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబును అడ్డగించారు. ఈ నేపథ్యంలో విపక్షాలను టార్గెట్ గా చేసుకునే జీవో తెచ్చారని హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరగగా న్యాయస్థానం ఈ నెల 23 వరకూ జీవో 1 అమలు చేయకూడదని స్టే ఇచ్చింది.20వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెదొక దారి అన్నట్టు ఏపీ సర్కారు వ్యవహార శైలి ఉంటుంది. హై కోర్టులో చుక్కెదురు అవుతుందో? లేక ప్రతికూల తీర్పు రాదన్న అనుమానమో లేదు కానీ.. ఏకంగా సుప్రీం కోర్టు తలుపు తట్టింది. అయితే ఇక్కడ జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని.. హైకోర్టులో విచారణ జరుగుతున్నందున అక్కడే తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. 23వ తేదీన జీవో 1 పై హైకోర్టులో విచారణ జరగనుంది. అక్కడి తీర్పుపై సంతృప్తి చెందకపోతే మాత్రం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే ఒక ఆప్షన్ ఉంది.

మరో వారం రోజుల్లో లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అటు పవన్ బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.ఇప్పటి వరకూ లోకేష్ పాదయాత్రకు అనుమతులు రాలేదు. మరోవైపు జీవో 1 కోసం ప్రభుత్వం ఆరాటపడుతోంది. విపక్షాలను కట్టడి చేసేందుకు జగన్ సర్కారు జీవో1 ను అస్త్రం చేసుకునే ప్లాన్ లో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి కఠిన జీవో అమలుకు న్యాయస్థానం అడ్డుచెప్పడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. కోర్టులో జీవో 1 నిలవదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.