
Divya S Iyer IAS: మహిళలపై వేధింపులు ఏటా పెరుగుతున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ ఘటనలు.. ఇప్పుడు గ్రామాల్లోనూ జరుగుతున్నాయి. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేదింపులు ఎక్కువ అయ్యాయన్నది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అయితే ఇవీ టెక్నాలజీ అందుబాటులోకి రాకముందు కూడా జరిగాయి. అయితే అవి బయటకు రాలేదు. అప్పుడు మీడియా ఇంత యాక్టివ్‌గా లేకపోవడం, బయటకు చెబితే పరువు పోతుందన్న భయం ఇందుకు కారణం. అయితే నాటి ఘటనలను కొంతమంది ఇప్పుడు బయట పెడుతున్నారు. సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన కుష్బూ ఇటీవల తన తండ్రి వేధింపులను ఇటీవలే బయటకు చెప్పింది. తాజాగా కేరళకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి ఆరేళ్ల వయసులో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వెల్లడించారు.
ఆరేళ్ల వయసులో.. ఆ ఇద్దరూ..
తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు.. ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని.. కేరళకు చెందిన ఓ ఐఏఎస్ అధికారిణి వెల్లడించారు. దీంతో చిన్నతనంలోనే మానసిక క్షోభకు గురైనట్లు తెలిపారు. రాష్ట్ర యువజన సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సమావేశంలో పథనంథిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ‘‘ఇద్దరు వ్యక్తులు నన్ను ఆప్యాయంగా పిలిచారు. నేను వాళ్ల వద్దకు వెళ్లాను. వాళ్లు ఎందుకు ముట్టుకున్నారో, ఆప్యాయంగా మాట్లాడుతున్నారో అర్ధం కాలేదు. వాళ్లు నా దుస్తులు విప్పినప్పుడు బాధగా అనిపించింది. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాను. మా తల్లిదండ్రుల సహకారంతో నేను ఆ బాధ నుంచి తప్పించుకోగలిగాను’ అని వెల్లడించారు.
ఇప్పటికీ వారు గుర్తున్నారు..
తనను లైంగికంగా వేధించిన ఆ ఇద్దరు వ్యక్తులు ఇప్పటికీ గుర్తున్నారని దివ్య ఎస్.అయ్యార్ తెలిపారు. అయితే పెద్దయ్యాక వారు ఎక్కడైనా కనిపిస్తారేమో అని చూశారనని వెల్లడించారు. కానీ, వారు నాకు కనిపించలేదని చెప్పారు. వారి ముఖాలు ఇప్పటికీ నాకు స్పష్టంగా గుర్తున్నాయని చెప్పారు. ఇప్పటికీ ఆ ఘటన తలుచుకుంటే బాధేస్తుదని వెల్లడించింది.

నాటి నుంచి నేటి వరకూ..
మహిళలపై వేధింపులే నాటి నుంచి నేటి వరకూ కొనసాగుతున్నాయనడానికి ఐఏఎస్ అధికారిణి, నటి కుష్బూ చెప్పిన విషయాలే నిదర్శనం. అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువయ్యాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. చట్టాలు కఠినమయ్యాయి. అప్రమత్తంగా లేకుంటే.. బటయకు చెబితే ఏమౌతుందో అని భరిస్తే మృగాల్ల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది అన్నది మాత్రం వాస్తవం. నిజాలను నిర్భయంగా చెబితే కొంతమందినైనా కాపాడవచ్చు.