Divorce Celebration: ఇంటికి ఆడపిల్లలు మహాలక్ష్మీ వంటి వాళ్లు. ఏ తండ్రయినా వారిని అపురూపంగా చూసుకుంటారు. వారిని పెంచి పెద్దచేసి, తాను బతికున్నంతకాలం తోడుండడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో తన కూతురుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపగానే తమ పని అయిపోయిందనే తండ్రులు కొంతమంది ఉంటే.. మరికొందరు మాత్రం అత్తారింటిలోనూ తమ అమ్మాయి మంచి జీవితం గడపాలని మరికొంత మంది కోరుకుంటారు. కానీ అనుకున్నట్లు జరగకపోతే ఏం చేస్తారు? కొందరు తండ్రులైతే తమ కర్మ అనుకొని కూతురి కష్టాలను చూసి ఏడుస్తూ కూర్చుంటారు. అయితే అత్తారింట్లో మోసపోయిన తన కూతురు కోసం ఓ తండ్రి ఏం చేశాడో తెలుసా?
కుమార్తె పెళ్లయిన ఏడాదికే విడాకులు వస్తే ఏ తండ్రయినా బాధపడుతాడు. కానీ ఈ తండ్రి మాత్రం బ్యాండ్ భాజాలతో డ్యాన్సులు చేశాడు. అందరూ కుమార్తెను ఇంటి నుంచి పంపించేటప్పుడు భారత్ డ్యాన్స్ లు చేస్తే.. ఈ తండ్రి మాత్రం కూతరుకు విడాకులు తీసుకొని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు హంగామా చేశాడు. అంతేకాకుండా తమ కూతురు విడాకులు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే..
ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీకి చెందిన ప్రేమ్ గుప్తా తన కుమార్తె సాక్తికి గతేడాది సచిన్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లి జరిపించాడు. పెళ్లయిన తరువాత సచిన్ కుమార్ మోసం బయటపడింది. అప్పటికే అతనికి రెండు పెళ్లిళ్లు జరిగాయన్న విషయం బయటపడింది. అయితే అత్తారింటల్లో ఉండాలనే ఉద్దేశంతో మూడో భార్యగా కొనసాగింది. అయినా అత్తారింటి వేధింపులు కొనసాగాయి. దీంతో ఇక ఆ ఇంట్లో ఉండడం అసాధ్యమని భావించింది. దీంతో వెంటనే తన తల్లిదండ్రులకు అసలు విషయాన్ని చెప్పింది. సాక్షి నిర్ణయాన్ని తల్లిదండ్రులు సమర్థించారు.
ఈ క్రమంలో భర్త నుంచి విడిపోవడానికి సాక్షి విడాకులకు అప్లై చేసింది. విడాకులు మంజూరు కాగానే సాక్షిని ఇంటికి తీసుకురావడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. భాజా భజంత్రీల మధ్య, బాణ సంచాలు కాలుస్తూ హంగామా చేశారు. ఇదంతా చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. విడాకులు తీసుకునే కూతురుని చూసి తండ్రి బాధపడుతారు గానీ.. ఇలా డ్యాన్సులు ఎందుకు చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రేమ్ గుప్తా ఆశ్చర్యకర సమాధానం ఇచ్చారు.
ఆడపిల్లలు ఎంతో విలువైనవారని అన్నారు. వీరు ఎక్కడున్న సంతోషంగా ఉండాలని కోరుకుంటారని,ముఖ్యంగా అత్తారింటలో ఆడపిల్ల సంతోషంగా ఉన్నప్పుడే తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉంటుందన్నారు. అలా లేనప్పుడు వారు ఎలా జీవించాలనుకుంటే అలా వారికి స్వేచ్ఛ ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా ప్రేమ్ గుప్తా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.