Director K Viswanath: రామ్ రాజ్ కాటన్, జి ఆర్ టి, సువర్ణభూమి.. ఈ కంపెనీలకు కళా తపస్వి కే విశ్వనాధ్ ప్రచారకర్తగా పనిచేశారు.. ఆయనను ప్రచారకర్తగా నియమించుకున్న తర్వాత ఆ కంపెనీలు భారీగా లాభాలు కళ్ళ జూశాయి.. అందుకే ఏళ్లపాటు ఆయన ఆ కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్నారు.. విశ్వనాధ్ ఉన్నతమైన చలనచిత్రాల సృష్టికర్తగా, సినీ కళామతల్లి ముద్దుబిడ్డగా, కళా తపస్విగా ఎన్నాళ్లపాటు తెలుగు నాట ప్రేక్షకులకు గుర్తు ఉంటారో చెప్పడం కష్టం.. కానీ రేపల్లెలో పుట్టిన కాశీనాధుని విశ్వనాధ్ ఏడుపదులు నిండిన తర్వాత వ్యాపార ప్రకటనల రంగంలో చేసిన కృషి మాత్రం ఎక్కువ కాలం నిలిచిపోతుంది.

ఆర్థిక అవసరాల కోసమో, అదనపు ఆదాయం కోసం తెలియదు గానీ విశ్వనాథ్ నిజంగా ఈ రంగంలోకి దిగడం చూడ చక్కని దృశ్యమే.. సువర్ణభూమి డెవలపర్స్ అనే ఇళ్ల స్థలాలు అమ్ముకునే రియల్ ఎస్టేట్ కంపెనీకి నెల్లూరు జిల్లాకు చెందిన తోటి శైవ బ్రాహ్మణుడు, సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కలిసి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు.. సమీప పట్టణం రాజానగరం దగ్గర ఇదే సువర్ణభూమి కంపెనీ వారి వెంచర్ శ్రీరామరక్షలో ప్లాట్ల అమ్మకాలు వేగంగా జరిగేందుకు ఆయన తన శక్తి కొద్దీ తోడ్పడ్డారు.. పత్రికలు, చానల్లో వచ్చే ఈ కంపెనీ వ్యాపార ప్రకటనల్లో కనిపించడమే కాక, 2016 ప్రాంతంలో ఆయనకు రెండుసార్లు రాజానగరం పోయి శ్రీరామ రక్ష వెంచర్ లో పొద్దున్నే నడిచేవారు. కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేసే కళాతపస్వి ఇలా రాజానగరం పోయి సువర్ణభూమి వెంచర్ నేలపై నడవడమే కాకుండా, అక్కడ స్థలాలు కొందామనే వారితో కూడా మాట్లాడి వారి అనుమానాలు తీర్చే ప్రయత్నం చేసేవారు.. దర్శకుడిగా ఆయన నిర్మాతల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చిన రీతిలోనే తాను ప్రచారకర్తగా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ తరఫున అంత గట్టిగా పని చేయడం నిజంగా హర్షణీయం.. ఆయన కళాతపస్వి మాత్రమే కాదు కర్మయోగి కూడా అనిపిస్తుంది.

రామ్ రాజ్ కాటన్ పేరుతో ఉన్నంతకాలం విశ్వనాథ్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.. సువర్ణ భూమి తర్వాత విశ్వనాధ్ చివరి సంవత్సరంలో తాను బ్రాండ్ అంబాసిడర్ గా సహాయపడిన నూలు గుడ్డల కంపెనీ రామ్ రాజ్ కాటన్. తమిళనాడుకు చెందిన ఈ కంపెనీ ప్రధానంగా తెల్ల బట్టలు.. అవి కూడా ముందే కొట్టినవి అమ్మకంలో ముందున్న కంపెనీ. తెలుగు నాట ఈ కంపెనీ తన ప్రాంచైజీ బ్రాంచీలు పెట్టిన చోటల్లా షాపు ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథి విశ్వనాధ్.. కొన్ని సంవత్సరాల క్రితం మంచి చలికాలంలో కూడా హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లో రామ్ రాజ్ కాటన్ షాప్ ఓపెనింగ్ కు సూర్యోదయానికి ముందే శ్రమ అనుకోకుండా 86 ఏళ్ల వయసులో వెళ్లారు విశ్వనాథ్.. ఈ రెండు కంపెనీల కాకుండా మరో తమిళ బంగారు, ఇంటి నగల కంపెనీ జి ఆర్ టి జ్యువెలర్స్ కూడా ఆయన బ్రాండ్ అంబాసిడరే. ఇలా తెలుగు, తమిళం అని తేడా లేకుండా తనను కోరిన కంపెనీల అమ్మకాలు పెంచేందుకు దోహదం చేశారు విశ్వనాథ్.. దేశంలో 85 ఏళ్లు దాటిన తర్వాత కూడా వాణిజ్య కంపెనీలకు ప్రచారకర్తగా పనిచేయడం ద్వారా విశ్వనాధ్ తెలుగు చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించారు. సువర్ణభూమి వెంచర్లలో స్థలాలు కోణాలంటూ విశ్వనాథ్ ఈ కంపెనీ యాడ్స్ లో కనిపించి కోరడంతో ఆ కంపెనీకి మంచి ప్రయోజనమే సిద్ధించింది. అనారోగ్యంతో ఆయన శివైక్యం చెందడంతో ఆ కంపెనీలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాయి.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నాయి.