Dimple Hayathi Vs Rahul Hegde : ఐపీఎస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, హీరోయిన్ డింపుల్ హయతి మధ్య తలెత్తిన వివాదం క్రమంగా ముదురులోంది. కార్ పార్కింగ్ విషయంతో మొదలైన వివాదం క్రమంగా తారాస్థాయికి చేరింది. డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పీఎస్ లో క్రిమినల్ కేసు నమోదు కావడంతో వివాదం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు డిపుల్ తగ్గకుండా.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పును కప్పిపుచ్చుకోలేరంటూ ఆమె ట్వీట్ చేయడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.
ఒకే అపార్ట్ మెంట్ లో డింపుల్, ట్రాఫిక్ డీసీపీ
జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు డింపుల్ హయతి, డీసీపీ రాహుల్ హెగ్డే. అయితే పార్క్ చేసిన రాహుల్ కారును డింపుల్ హయతి కాలితో తన్నడంతోపాటుగా ఆమె ఫ్రెండ్ డేవిడ్‌తో కలిసి ఢీకొట్టిందని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్‌పై 353, 341, 279 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడే కాకుండా డింపుల్ ఇంతకు ముందు కూడా ఇలాగే ప్రవర్తించిందని రాహుల్ తన ఫిర్యాదులో తెలిపారు. నచ్చజెప్పేందుకు పలుమార్లు ప్రయత్నించినా కూడా ఆమె తీరు మార్చుకోలేదట. దీంతో ఫిర్యాదు చేసినట్టుగా రాహుల్ వెల్లడించారు. దీంతో డింపుల్ తో పాటుగా డేవిడ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. మరోసారి విచారణకు అవసరమైతే రావాలని చెప్పి పంపించారు.
డింపుల్ కారుపై 3 వేలకు పైగా చలాన్లు
డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఢీ కొట్టిన డింపుల్ హయతి కారు డేవిడ్ అనే వ్యక్తి పేరుతో ఉంది. ఈ కారుపై గత వారం రోజులుగా చలాన్లు పడుతున్నాయి. మే 15 , 20, 21 న చలాన్లు ఉన్నాయి. 20వ తేదీ రాంగ్ సైడ్ పార్కింగ్, డేంజరస్ డ్రైవింగ్, నిబంధనలను ఉల్లంఘించిన వాటిపై జరిమానా ఉన్నాయి. 21వ తేదీన ఫ్యాన్సీ నంంబర్ ప్లేట్ ఉందని చలానాతోపాటు నిబంధనలు పాటించడం లేదంటూ మరోచలాన్ ఉంది. ఇలా ఆ కారుపై 3 వేల రూపాయలుకు పైగా చలాన్లు ఉన్నాయి.
వ్యక్తిగత కోపం లేదన్న డీసీపీ..
ఇదే వివాదంపై స్పందించిన ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే .. డింపుల్ హయతితో తనకు పర్సనల్‌గా ఎలాంటి గొడవ లేదని చెప్పారు. గత కొన్నిరోజులుగా డింపుల్ హయతి కార్‌ని తన కారుకి అడ్డంగా పెడుతుందని ఆరోపించారు. తన డ్రైవర్ చెప్పినా వినకుండా రిపీట్ చేశారన్నారు. తన కారును తన్ని ఢీ కొట్టిందని చెప్పారు. తన డ్రైవర్ చట్టం ప్రకారం జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడని.. పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించారు. సీసీ ఫుటేజీలో కూడా డింపుల్ హయతి కారును కాలుతో తన్ని ఢీ కొట్టినట్టు ఉందన్నారు. ఆమె కారుపై చలాన్లు ఉన్నట్లు తనకు తెలియదని వెల్లడించారు.