
KCR On Vizag Steel: ఉదయాన్నే నమస్తే తెలంగాణ పేపర్ చూసిన తర్వాత కనిపించిందీ వార్త.. చూడగానే కళ్ళు బైర్లు కమ్మాయి. అసలు ఆ వైజాగ్ స్టీల్ ఆసక్తి వ్యక్తికరణలో కేసీఆర్ పాల్గొనకుండా మోదీ అడ్డు పుల్ల వేశాడట. మోకాలు అడ్డుపెట్టి ఏహే కేసీఆర్ నువ్వు వైజాగ్ స్టీల్ లో బిడ్ దాఖలు చేయకు అని చెప్పాడట.. మోదీ చెబితేనే కేసీఆర్ సింగరేణి సంస్థను పంపించాడా? తన కొడుకు కేటీఆర్ తో లేఖ రాయించాడా? తన అల్లుడు హరీష్ రావు తో ఆంధ్ర మంత్రులపై విమర్శలు చేయించాడా? అసలు ఈ బట్ట కాల్చి మీద వేయడమేంటి? వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ లో ఒక ఫర్నేస్ నడవడం లేదు. దీనికి ముడి పదార్థాల కొరత ఉంది.. ఈ ముడి పదార్థాలు లేదా దానికి సరిపోయే నగదు ఇచ్చి వైజాగ్ స్టీల్ ఉత్పత్తులు తీసుకోండి..ఇది కదా కేంద్రం చెప్పింది. అందుకే కదా బిడ్ లకు ఆహ్వానం పలికింది. ఇందులో ప్రభుత్వ సంస్థలు పాల్గొనకూడదని స్పష్టం చేసింది.. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజలది.. ఫ్యాక్టరీ సరిగా నడవకపోతే, లేదా కార్మికులు సక్రమంగా పనిచేయకపోతే అంతిమంగా లాస్ వస్తుంది. ఫలితంగా ప్రజల సొమ్ముకు బొక్క పడుతుంది.. ఇలాంటివి జరిగాయి కాబట్టే చాలా కర్మాగారాలను ప్రభుత్వాలు మూసేశాయి.. ఆమధ్య వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం చెప్పగానే కార్మికులకు సోయి వచ్చింది. కర్మాగారం లాభాల్లోకి వచ్చింది. అయినప్పటికీ కేంద్రం ప్రైవేటీకరణ విషయంలో వెనకడుగు వేయడం లేదు.
కానీ ఇదే అదునుగా తన పొలిటికల్ ఎజెండా ప్రకారం కేసీఆర్ ఒక రాజకీయ ప్రచారానికి తెరలేపాడు.. ఇందులో భాగంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ లో పాల్గొంటామని సింగరేణి అధికారుల ద్వారా ప్రచారం చేయించాడు. దీనికి తన అనుకూల మీడియా వంత పాడింది. వాస్తవానికి వాచ్ డాగ్ లా ఉండాల్సిన మీడియా కెసిఆర్ కు వంత పాడటమే ఇక్కడ విశేషం. కెసిఆర్ అండ్ కో చెబుతున్నట్టు అవి అమ్మకపు బిడ్లు కావు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందులో పాల్గొనేందుకు ప్రభుత్వాలకు ఆకాశం లేదు. ఈ ప్రకారం చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఇందులో ప్రవేశించే అవకాశం లేదు. ఒకవేళ కెసిఆర్ చెబుతున్నట్టు, నమస్తే తెలంగాణ డప్పు కొడుతున్నట్టు అంత సత్తా ఉండి ఉంటే తెలంగాణలో మూతపడిన బోధన్ చక్కెర కర్మగారాన్ని ఎప్పుడో తెరిచి ఉండేది..

ఇప్పుడు కెసిఆర్ జాతీయస్థాయిలో చక్రాలు తిప్పాలి కనక, ఆంధ్రప్రదేశ్లో తనకు పొలిటికల్ లాభం కావాలి కనుక కొత్త అవతారం ఎత్తాడు. నమస్తే తెలంగాణ దృష్టిలో స్టీల్ ప్లాంట్ రక్షకుడిగా ఆవిర్భవించాడు.. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి జగన్, గాలి జనార్దన్ రెడ్డి వంటి కేసులను డీల్ చేసిన జెడి లక్ష్మీనారాయణ వంటి మాజీ అధికారులు చేసిన వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు కూడా కెసిఆర్ కు లాభం చేకూర్చాయి. అంతేకాదు వైజాగ్ స్టీల్ విషయంలో భారత రాష్ట్ర సమితి ప్రదర్శించిన అజ్ఞానాన్ని డైవర్ట్ చేసేందుకు బైలదిల్లా గనుల విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఉల్టా దాడి మొదలుపెట్టారు. బైలదిల్లా గనులు నేషనల్ మైనం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సొంతం. అక్కడ ఖనిజాన్ని వెలికి తీసే బాధ్యత ప్రధాని కంపెనీకి ఇచ్చేశారు. ఈ పనులకు సంబంధించి దాఖలు చేసిన బిడ్ లలో అదానీ గ్రూప్_ ఎల్1. ఈ విషయం తెలియక ఆ కేటీఆర్ నెత్తి మాసిన మాటలు మాట్లాడాడు..
ఇక వైజాగ్ స్టీల్ విషయంలో బిడ్ దాఖలు చేయకుండానే సింగరేణి వెనక్కి తిరిగింది. 11,000 కోట్లు డిపాజిట్లు ఉన్న సంస్థ 5 వేల కోట్లు ఖర్చయ్యే సంస్థలో ఆసక్తి వ్యక్తీకరణలో పాల్గొనకుండా పీచే మూడ్ అన్నది. కానీ నమస్తే తెలంగాణ మాత్రం ఎన్నాళ్ళ నుంచో వైజాగ్ స్టీల్ ను కాపాడతానని కెసిఆర్ కంకణం కట్టుకున్నాడు, కానీ ఆ పాపిష్టి మోదీ విప్పేశాడు అని రాస్కొచ్చింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కెసిఆర్లో రాజకీయ గడిసుతనం ఎక్కువ. అందుకే వైజాగ్ పాచిక వేశాడు. కానీ అది పారలేదు. కొండను వెంట్రుక వేసి లాగితే తెగేది వెంట్రుకే. అది కేసీఆర్ కు తెలుసు.కానీ మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు అని బలంగా ప్రొజెక్ట్ చేసుకోవాలి కాబట్టి..కేసీఆర్ వైజాగ్ స్టీల్ బిడ్ విషయంలో తెరపైకి వచ్చాడు.. సింగరేణి సంస్థను తెచ్చాడు. అంతే అంతకు మించి ఏమీ లేదు!