https://oktelugu.com/

Journalists Plots : జర్నలిస్టులకు ‘పండుగ’ షాక్ : ‘కరీంనగర్’లో ఇచ్చిన ‘ఇళ్ల స్థలాల’ రద్దుతో లబోదిబో!

గతేడాది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయగా.. చాలా మంది అర్హులకు రాలేదు. అప్పటి నుంచి ఆ జర్నలిస్టులంతా పోరాడుతున్నారు. ప్రతీ పార్టీకి చెందిన లీడర్లనూ కలిశారు. తమకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 8, 2024 / 01:21 PM IST

    Deeds of houses allotted to Journalists in Karimnagar were cancelled

    Follow us on

    Journalists : అన్యాయం అనేది ఒకరికి జరిగినా అది అన్యాయమే. వంద మందికి న్యాయం చేశామని.. ఒకరికి అన్యాయం చేయడం పెద్ద తప్పు. అందులోనూ.. అన్ని అర్హతలున్నప్పటికీ.. అనుయాయూలకే పెద్దపీట వేస్తామనుకోవడం మరీ తప్పు. ఎస్… గత దసరా సీజన్‌కు ముందు ‘‘తెలంగాణ ఎన్నికల తాయిలంగా’’ కరీంనగర్ జర్నలిస్టులకు పంపిణీ చేసిన ఇళ్ల జాగల్లో అదే జరిగింది. అప్పటి మంత్రి ఇంట్లో వంట చేసే కుక్, ఆయన వద్ద పనిచేస్తున్న పీఏ, ఆయన కార్యకర్తలు, ఆయన అభిమానులు, మాజీ ఎంపీ పీఏ, నగర ప్రథమ పౌరుడు మేయర్ పీఏ.. వీరంతా జర్నలిస్టులే. అదేంటి వీరు జర్నలిస్టులు ఎలా అవుతారనుకుంటే.. మరి వారికి కూడా జర్నలిస్టు కోటాలో జాగాలు ఇచ్చారు కదా..!! అసలైన జర్నలిస్టుల పక్కన పెట్టేసి కిరాణా షాపుల్లో దొరికే పుట్నాల వలే.. పంచుకున్నారు. అధికారంలో ఉన్నాం.. అధికార మంత్రిని ఏం చేసినా నడుస్తుందని అనుకున్నారు. తన అతి దగ్గరగా ఉండే ముగ్గురు నలుగురు సీనియర్ జర్నలిస్టులను పట్టుకొని జాబితా తయారుచేసి.. హడావిడిగా స్థలాలు పంపిణీ చేసి.. పదుల సంఖ్యలో అసలైన జర్నలిస్టుల పొట్టకొట్టారు.

    -జాబితా తయారీకి అర్హతలేంటి..?

    గత దశాబ్దల కాలానికి పైగా కరీంనగర్ జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇస్తాం.. చేస్తాం.. అని చెప్పుకుంటూ వచ్చారే తప్పితే ఇచ్చింది లేదు. ప్రతిసారీ ఇస్తామని ప్రకటించడం.. అర్హత లేని, అవగాహన లేని జర్నలిస్టులు జాబితాను తయారుచేసి మంత్రికి ఇవ్వడం పరిపాటిగా మారింది. ఇక.. గత ఎన్నికల సమయంలో ఆ ఫైల్‌కు ముహూర్తం రానే వచ్చింది. జాగలు ఇస్తున్నారని నగరంలోని జర్నలిస్టులంతా ఎంతగానో సంబురపడ్డారు. దసరా పండుగ పూట సంతోషమైన కబురు అందిందని అందరూ ఆనందపడ్డారు. అది ఎన్నికల సమయం. దాంతో మాజీమంత్రి చేసిన లాబీయింగ్ అంతా ఇంతా కాదు. హడావిడిగా తన ఇంట్లో కూర్చోబెట్టుకుని కొంత మంది జర్నలిస్టులతో లిస్ట్ తయారు చేయించారు. ఇంకేముంది ఆ తెల్లారే హడావిడిగా ఓ పెద్ద ఫంక్షన్ హాల్ మాట్లాడి.. అందులో పట్టాలు చేతిలో పెట్టాడు. పట్టాలు కాదండి అవి ప్రొసీడింగులు మాత్రమే. 118 మందికి వాటిని అందించారు.

    -అభిమానులకే అప్పటి మంత్రి అందలం

    118 మందితో జాబితా తయారు చేయగా.. అందులో ఉన్న వారి పేర్లు చూసి ఇటు పట్టాలు పొందిన జర్నలిస్టులు, అటు రానివారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకయ్యా అంటే.. ఆ లబ్ధిదారుల జాబితాలో మాజీమంత్రి ఇంట్లో పనిచేసే పనిమనుషులు, ఆయన అనుచరుల పేర్లు దర్శనం ఇచ్చారు. అంతేకాదు.. మాజీ ఎంపీ పీఏ, మేయర్ పీఏలు ఉన్నారని సమాచారం. వారంతా కూడా జర్నలిస్టులే అని అప్పటి మంత్రి భావించి.. వారికి పట్టాలిచ్చి న్యాయం చేశారని ఆయన అభిప్రాయం. సరే.. ఆ సమయంలో మంత్రి హోదాలో ఆయన జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలని సంకల్పించడం శుభ పరిణామమే అయినప్పటికీ.. అర్హులైన వారందరికీ ఇవ్వాలన్న ఉద్దేశం ఎందుకు రాలేదో ఎవరికీ అర్థం కాలేదు. ఇచ్చిన జాబితాలో చాలా మంది అనర్హులే ఉన్నారనేది కొనసాగుతున్న వివాదం.

    -బీపీఎల్ కోటాలో గవర్నమెంట్ ఎంప్లాయిస్..

    తమకు అన్యాయం జరిగిందని ఇళ్ల స్థలాలు రాని జర్నలిస్టులు వెళ్లి మాజీ మంత్రిని కలిస్తే.. ‘స్థలాలు జర్నలిస్టు కోటా కింద ఏం ఇవ్వలేదు. బీపీఎల్ కోటా కిందనే ఇచ్చాం. నా వార్తలు ఎవరు రాస్తున్నారో నాకు తెలుసు. వారికే ఇచ్చాను’ అని మాట్లాడినట్లు స్థలాలు పొందని జర్నలిస్టులు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సరే.. మాజీ మంత్రి చెప్పినట్లుగా బీపీఎల్ కోటా కింద స్థలాలు పంపిణీ చేస్తే.. మరి అందులో గవర్నమెంట్ ఎంప్లాయిస్‌కు ఎలా ఇచ్చారు అనేది మరికొందరి వాదన. ఇంకా కొందరు రేషన్ కార్డులు లేని వారు.. తమ బంధువుల రేషన్ కార్డులు ఇచ్చి వారి పేరిట స్థలాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక.. బీపీఎల్ కోటా కింద ఇస్తే 100 గజాల వరకే ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. మరి ఇక్కడ వీళ్లకు ఇచ్చింది మాత్రం 180 గజాలు. మరి అది బీపీఎల్ కోటా కిందకు ఎలా వస్తుంది..? ఇక.. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు తాము పంపిణీ చేశామని గత పాలకులు చెబుతున్నా.. అసలు బీపీఎల్ కోటా కింద పంపిణీ చేస్తే అక్రిడిటేషన్లు ప్రమాణికం కాదు అనే విషయం ఇంతమందికి తెలియకపోవడం గమనార్హం.

    -ప్రొసీడింగ్స్ చదివారా అసలు..!

    ఎన్నికలు వచ్చాయని.. జర్నలిస్టుల మెప్పు పొందాలని గత పాలకులు హడావిడిగా స్థలాలు పంపిణీ చేశారు. అయితే జర్నలిస్టులకు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్న పాలకులంతా.. అసలు వారు ఇచ్చినవి పట్టాలా..? ప్రొసీడింగులా అనే విషయం వారికైనా తెలుసో లేదో అని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో వీరికి ఇచ్చినవి కేవలం ప్రొసీడింగులు మాత్రమే. అది బీపీఎల్ కోటా కింద. ఆ ప్రొసీడింగులోనే క్లియర్ కట్‌గా రాసి ఇచ్చారు కూడా. జీ+1 భవనం నిర్మించి ఇస్తామని అందులో పేర్కొన్నారు. కానీ, ఆ హామీ ఎక్కడా నెరవేరలేదు. మరోవైపు.. జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలు ఎస్సారెస్పీకి చెందినవి. అసలు ఎస్సారెస్పీ భూములకు ఎన్వోసీ రాదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, పాలకులు, అధికారులు మాత్రం ఎస్సారెస్పీ భూములను సెలక్ట్ చేసి మరీ అందించారు. ఇక అప్పటి నుంచే ఈ భూములపై వివాదం నెలకొంది.

    -118 ఇస్తే.. సంఖ్య 149 ఏంటి..?

    మల్కాపూర్, చింతకుంట పరిధిలో గతేడాది జర్నలిస్టులకు ప్లాట్లు పంపిణీ చేశారు. అయితే అధికారికంగా పంపిణీ చేసిన ప్లాట్ల సంఖ్య 118. కానీ మాజీ మంత్రి అనధికారికంగా ఇచ్చిన ప్లాట్లు మరో 31. తన అభిమానులకు, లేదంటే గతంలో ఇళ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులకు దసరా కానుకగా ఇంటికి పిలుచుకొని మరీ ఇచ్చారని సమాచారం. సో.. దాంతో ఆ సంఖ్య 149కి చేరింది. కానీ అధికారుల రికార్డుల్లో మాత్రం 118 మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ అధికారిక లెక్కల్లో 118 మాత్రమే చూపిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ 31 మంది ఆందోళనలో పడ్డారు. ఎంతో ప్రేమతో ఇంటికి పిలుచుకొని ఇచ్చింది ఉత్తదేనా అనే ఫీలింగులో ఉన్నారు. ఇక ఈ 31 ప్లాట్ల లెక్క ఎక్కడిదో అటు అధికారులకు కూడా తెలియకుండా ఉంది. గతంలో ఇళ్ల స్థలాలు రాని జర్నలిస్టులు ఓ ఉన్నతాధికారిని కలిసి ఇదే విషయం చెబితే.. ‘అది మాకు తెలియదు.. మంత్రి గారు ఎవరికి ఇచ్చారో.. ? ఎలా ఇచ్చారో..? మా దృష్టిలో లేదు. మా రికార్డు ప్రకారం 118 మందికి ఇచ్చాం’ అని చెప్పుకొచ్చారని జర్నలిస్టు మిత్రులు అభిప్రాయపడుతున్నారు.

    -దళారుల పరిస్థితి ఏంది..?

    మంత్రి ప్లాట్లు పంపిణీ చేస్తున్నారని తెలియగానే.. కొంతమంది దళారీ అవతారం ఎత్తారు. ఓ పేరు మోసిన పత్రికకు ప్రధాన రిపోర్టరుగా ఉన్న వ్యక్తి, మాజీమంత్రికి పీఏగా ఉన్న ఓ వ్యక్తి ఏకమయ్యారు. ఇంకేముంది వచ్చిందే అవకాశం అన్నట్లుగా ఉన్నతమైన హోదాలో ఉండి చిల్లర పనులకు తెరతీశారు. తమకు డబ్బులు ఇస్తే ప్లాట్లు ఇప్పిస్తామంటూ ప్రచారం సాగించారు. దాంతో కొంత మంది నిఖార్సయిన జర్నలిస్టులు (ఉత్తుత్తి జర్నలిస్టులు) వీరిని సంప్రదించారు. అంతోఇంతో ఇచ్చుకున్నారని ప్రచారం. ఇంకేముంది జాబితాలో వారి పేర్లూ దర్శనమిచ్చాయి. దశాబ్దాల కాలంగా ఎదురుచూసినా స్థలాలు పొందని జర్నలిస్టులు ఉండగా.. కేవలం జర్నలిస్టు ఫీల్డుకు వచ్చి ఏడాది అయినా గడవని వ్యక్తికి స్థలం వచ్చిందంటే ఇక్కడ ఏ మేరకు అవకతవకలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ దళారులు ఒక్కొక్కరు పదికి పైగానే అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కలెక్టర్ స్థలాలను రద్దు చేసినట్లుగా ప్రకటించడంతో ఇక వారు ఆందోళనలో పడ్డారు.

    -జర్నలిస్టుల పోరుబాట..

    ఎన్ని ఏళ్లుగా కరీంనగర్ జర్నలిస్టులు ప్లాట్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తరఫున అందరికీ న్యాయం చేయాల్సింది పోయి కొంత మందికే ఇచ్చారనేది కొంతమంది వాదన. దాంతో అర్హత ఉండి కూడా ప్లాట్లు పొందని జర్నలిస్టులు అప్పటి నుంచి ఆందోళన బాట పట్టారు. తమకు ఇవ్వకుండా ఆ జాగలకు ఎన్వోసీ ఇవ్వడానికి లేదని డిమాండ్ చేశారు. అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. వీరంతా కలిసి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అసలు విషయం చెప్పారు. అటు సీఎంఓ ఆఫీసు వరకూ వెళ్లొచ్చారు. దాంతో మంత్రి పొన్నం కూడా గత పాలకులపై ఫైర్ అయ్యారు. అందరికీ ఇచ్చి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. సీఎంఓ ఆఫీసు నుంచి కూడా కలెక్టర్‌కు ప్రత్యేక ఆదేశాలు వచ్చాయి. జాబితాపై విచారణ చేపట్టాలని సూచించారు. దాంతో విచారణ చేపట్టగా కొంత మంది అనర్హులు ఉన్నట్లుగా తేలినట్లు సమాచారం. పూర్తిగా అవకతవకలు జరిగాయని ప్రభుత్వం భావించడంతోనే ఇప్పుడు వాటిని రద్దు చేసే పరిస్థితి వచ్చిందనేది చర్చ నడుస్తోంది. పండుగ పూట కొంత మందికి ఇచ్చి మరికొంత మందికి అన్యాయం చేశారని ప్రభుత్వ పెద్దలు కూడా గుర్తించారు. తమ హయాంలో అలా జరగదు అని.. అందరికీ న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. ఎట్టకేలకు పాతవి రద్దు కావడంతో.. ఇప్పుడు స్థలాలు రాని జర్నలిస్టుల్లో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తమకు కూడా న్యాయం జరుగుతుందని ఆనందపడుతున్నారు.

    -డెస్క్ జర్నలిస్టులు అర్హులు కారా..?

    జర్నలిస్టులు వార్తలు సేకరించడం వరకే వారి పని. వాటికి ఒక రూపం తీసుకొచ్చి.. పేజీలో అందంగా పేర్చి.. మంచి ఔట్ పుట్ ఇవ్వడం డెస్క్ పని. అసలు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే చాలా మందికి విలేకరి అంటేనే తెలుసు. ఈ డెస్క్ అంటే.. ఈ సబ్ ఎడిటర్లు అంటే చాలా మందికి అవగాహన లేదు. మరి వారిని గుర్తించాల్సిన బాధ్యత పాలకులపై లేదా..? డెస్క్ జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు పొందేందుకు అర్హులు కారా..? ఏమైనా అంటే వారికి జీతాలు వస్తాయని వాదన ఉంది. అసలు వారికి వచ్చే జీతాలు ఎంత..? సంస్థలు వారికి ఇస్తున్న జీతాలు ఎంత..? నెలంతా రాత్రంతా కష్టపడి పనిచేస్తే వారికి వచ్చే జీతాలు రూ.25వేల లోపే. ఈ జీతాలతో వారు తెచ్చుకున్నది సంపాదన కన్నా.. రోగాలే ఎక్కువ. ఈ జీతాలతో ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఓ చిన్న ఫ్యామిలీ కూడా బతకలేని దుస్థితి. ఇక వీళ్లు ఇళ్ల జాగాలు కొని.. ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఉంటాయా..? మొన్న పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లోనూ కేవలం ఇద్దరి చొప్పున మాత్రమే డెస్క్ జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఒక్కో డెస్కులో 20 మంది వరకు అర్హత కలిగిన జర్నలిస్టులు ఉంటే కేవలం ఇద్దరికే అందించారు. పోనీ.. అందులోనూ న్యాయం జరిగిందా అంటే అదీ లేదు. ఓ ప్రధాన పత్రికకు చెందిన ఇన్చార్జి కరీంనగర్‌కు వచ్చి మూడు నెలలైనా కాకముందే ఆయన చేతిలో పట్టా పెట్టారు. అదెలా సాధ్యమైందంటే.. వాళ్ల బ్యూరో ఇన్చార్జి ప్రాప్తం అది. మరి ఆ బ్యూరో ఇన్చార్జికి అప్పటి మంత్రికి అంతటి దగ్గరి సంబంధాలు ఉన్నాయి మరి. ఆయన తలచుకుంటే ఏదైనా చేయగలరనే ప్రచారం ఉంది. దాంతో ఆ ఇన్చార్జితోపాటు ఆ బ్యూరో అతిదగ్గరగా ఉండే మరో సబ్ ఎడిటర్‌కు ఇప్పించారు. ఈ పరిస్థితి ఒక్క ఈ పత్రికలోనే కాదు.. దాదాపు మిగితా ప్రధాన పత్రికల్లోనూ కనిపించింది. ఓ డెస్క్ జర్నలిస్టు 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్నప్పటికీ కొత్తగా వచ్చిన వ్యక్తికి ఇచ్చారు. రాత్రిళ్లు నిద్ర లేకుండా.. ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్న వారికి ఇప్పటికీ ప్రభుత్వాల నుంచి గుర్తింపు మాత్రం లభించడంలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని డెస్క్ జర్నలిస్టులు కోరుతున్నారు.

    -అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ లీడర్లు..?

    గతేడాది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయగా.. చాలా మంది అర్హులకు రాలేదు. అప్పటి నుంచి ఆ జర్నలిస్టులంతా పోరాడుతున్నారు. ప్రతీ పార్టీకి చెందిన లీడర్లనూ కలిశారు. తమకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. కానీ.. ఆ సమయంలో ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు ఈ జర్నలిస్టుల ప్లాట్లు క్యాన్సిల్ అయ్యాయని ప్రచారం జరగడంతో.. ఒక్కో నేత ప్రకటనలు ఇచ్చారు. అప్పుడు అర్హత కలిగి జాగాలు అందుకోని జర్నలిస్టుల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచిస్తే బాగుండేది కదా. ఆ మిగిలి 20 మందికి కూడా ఇవ్వాలని ఒత్తిడి తెస్తే వారికి కూడా న్యాయం జరిగేది కదా అని పలువురి అభిప్రాయం.

    Deeds of houses allotted to Journalists in Karimnagar were cancelled

    -డీఆర్వో నిజంగానే ఖండించారా..?

    ఈ ఎపిసోడ్ అంతా ఇలా నడుస్తుంటే.. నిన్న ఓ ప్రధాన పత్రిక బ్యూరో ఇన్చార్జి కొంత మంది జర్నలిస్టులును తోడ్కొని వెళ్లి కలెక్టర్‌ను కలిశారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టర్‌తో ఇళ్ల జాగల విషయమై చర్చించారు. దాంతో ఆమె ఒక్కసారిగా కొట్టేశారు. ఆ స్థలాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఎస్సారెస్పీ భూములను పంపిణీ చేసే అధికారం తమకు లేదని తేల్చిచెప్పారు. దీంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. అంతేకాదు.. నెక్ట్స్ డే నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే చివరకు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఒక్కసారిగా డీఆర్వో నుంచి ఓ ప్రకటన వెలువడింది. కలెక్టర్ గారు చెప్పింది వేరు.. మీరు అర్థం చేసుకున్నది వేరు.. ప్లాట్లు ఎటూ పోవని, ఎన్వోసీ కోసం ప్రయత్నిస్తున్నామని అందులో పేర్కొన్నారు. అయితే ఓ డీఆర్వో స్థాయి అధికారి ఎటువంటి లెటర్ హెడ్ లేకుండా ప్రకటన ఇస్తారా..? ఎటువంటి ఆఫీస్ స్టాంప్ లేకుండా ఓ తెల్లకాగితంపై రాసి ప్రతిక ప్రకటన ఇస్తారా..? ప్రభుత్వ ఉన్నత హోదాలో ఉండి ఎలాంటి గ్రీన్ పెన్ సంతకం లేకుండా ఇచ్చిన లెటర్ చెల్లుబాటు ఎలా అవుతుంది..? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కేవలం వారందరినీ చల్లబర్చడానికే అధికారి ఇలా చేశారన్న టాక్ కూడా నడుస్తోంది.

    మొత్తంగా బీఆర్ఎస్ హయాంలో అన్యాయం జరిగిన జర్నలిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నారు. ఏడాదిగా మానసిక క్షోభ అనుభవిస్తున్న తమకు కలెక్టర్ ప్రకటన ఊరటనిచ్చిందని అంటున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

    – B.S.