CM Chandhrababu Delhi Tour : ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. ప్రధాని ఎదుట కీలక ప్రతిపాదనలు!

రాష్ట్ర విభజన జరిగి దాదాపు 10 ఏళ్లవుతోంది. ఇంతవరకు విభజన హామీలు అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కేంద్రానికి కీలక ప్రతిపాదనలు పెట్టారు. ఇప్పటికే వాటికి సంబంధించి ఆమోదముద్ర లభించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Written By: Dharma, Updated On : October 8, 2024 1:17 pm

CM Chandhrababu Delhi Tour

Follow us on

CM Chandhrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఆయన అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. తొలుత ప్రధాని మోదీ తో సమావేశం అయ్యారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి సంబంధించి కీలక ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తాజా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా మారింది. మెజారిటీ మార్కుకు కూతవేటు దూరంలో ఉన్న ఎన్డీఏ కు చంద్రబాబు అవసరం అనివార్యంగా మారింది. అందుకే కేంద్రంలో చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం ఏకంగా 15000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది. ప్రపంచ బ్యాంకు నిధుల్లో భాగంగా ఈ సాయం ప్రకటించింది కేంద్రం. అయితే ఇది గ్రాంటా? రుణమా? అన్నది చర్చకు దారితీసింది. అయితే ఇది రుణమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇందులో 90 శాతం కేంద్రమే భరించనుంది. మిగిలిన 10 శాతం కూడా వేరే నిధుల్లో భాగంగా సర్దుబాటు చేయనుంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,000 కోట్ల రూపాయలు అందించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇంకోవైపు విశాఖ రైల్వే జోన్ అంశానికి సంబంధించి సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ మూడు అంశాలపై చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

* లడ్డు వివాదం నేపథ్యంలో
ప్రస్తుతం ఏపీలో లడ్డు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీరియల్ ఎపిసోడ్ ల తలపిస్తున్న ఈ వివాదం విషయంలో సుప్రీం కోర్టు కలుగజేసుకుంది. ఇటీవలే ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ నుంచి ఇద్దరు, ఏపీ పోలీస్ శాఖ నుంచి ఇద్దరు, ఆహార కల్తీ నియంత్రణ శాఖ నుంచి ఒకరు ఈ బృందంలో ఉండేలా ఆదేశాలు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అత్యున్నత అధికారుల బృందంతో సిట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు. కానీ దీనిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. దీంతో ఆయన సీబీఐ దర్యాప్తు అనివార్యమని సూచించారు. దీంతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

* ప్రధాని ఎదుట కీలక ప్రతిపాదనలు
ఏపీలో విభజన హామీలతో పాటు రాజకీయపరమైన అంశాలను చంద్రబాబు ప్రధాన మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. టీటీడీ పవిత్రతకు దెబ్బతీసేలా ఈ ఘటన జరిగినట్లు.. అందుకే రాష్ట్ర ప్రభుత్వ పరంగా పటిష్ట చర్యలు చేపట్టినట్లు చంద్రబాబు మోడీకి వివరించారు.మరోవైపు విభజన హామీలకు సంబంధించి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పోలవరం ప్రాజెక్ట్, విశాఖ రైల్వే జోన్, లోటు బడ్జెట్, ఇతరత్రా ప్రాజెక్టుల కేటాయింపు వంటి విషయాలపై ప్రధాని మోడీతో చంద్రబాబు చర్చించారు.మరోవైపు ఈరోజు చంద్రబాబు కీలక భేటీకానున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ప్రతిపాదనలతో వారి ముందు హాజరుకానున్నారు. మొత్తానికి అయితే చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన విజయవంతంగా పూర్తి కావడం విశేషం.