Adipurush Release Date: ఆదిపురుష్ చిత్ర కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. విడుదలకు ఎన్ని రోజులు ఉందో తెలియజేస్తూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఎట్టకేలకు ఆదిపురుష్ విడుదలపై ఒక క్లారిటీ వచ్చింది. ఆదిపురుష్ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనుకున్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల కంటే ముందే జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. టీజర్ విడుదలతో వారి ప్రణాళికలు మారిపోయాయి. ఆదిపురుష్ టీజర్ రామజన్మభూమి అయోధ్యలో 2022 అక్టోబర్ 2న గ్రాండ్ గా లాంఛ్ చేశారు. అనూహ్యంగా ఆదిపురుష్ టీజర్ విమర్శల పాలైంది.

కనీస ప్రమాణాలు లేని విజువల్స్, గ్రాఫిక్స్ నిరాశపరిచాయి. రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటారు అనే ఆసక్తిని టీజర్ చంపేసింది. మొత్తంగా సినిమాపై అంచనాలు తగ్గించేసింది. రూ. 400 కోట్ల బడ్జెట్ తో కళాఖండం తీస్తారనుకుంటే కార్టూన్ మూవీ చేశారేంటని జనాలు పెదవి విరిచారు. దానికి తోడు రామాయణ పాత్రలను డిజైన్ చేసిన తీరును హిందూ వర్గాలు తప్పుబట్టాయి. రావణాసురుడు పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ ని హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లోని విలన్ మాదిరి డిజైన్ చేశారు.
ఓం రౌత్ పై జనాలు మండిపడ్డారు. అసలు ఆయనకు పురాణాలు, రామాయణం గురించి తెలుసా? రావణాసురుడు శివుని పరమభక్తుడు…. ఆయన ఎలా ఉంటారనేది రామాయణంలో రాసి ఉంది. ప్రజల సెంటిమెంట్ కి సంబంధించిన విషయాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోరా? అని ప్రశ్నించారు. రామాయణం పూర్తిగా చదవకపోయినా ఎన్టీఆర్ వంటి నటులు చేసిన పౌరాణిక సినిమాలు చూడండి… అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులైతే హెచ్చరికలు జారీ చేశారు. ఆదిపురుష్ మూవీ విడుదల కానీయం అంటూ బెదిరింపులకు దిగారు.

ఈ క్రమంలో ఆదిపురుష్ విడుదల వాయిదా వేశారు. మరో వంద కోట్లు కేటాయించి మెరుగైన అవుట్ ఫుట్ కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఏదైనా ఆదిపురుష్ విడుదల తేదీ ప్రకటించారు. జూన్ 16న ఆదిపురుష్ థియేటర్స్ లో దిగుతుంది. ఇంకా 150 రోజుల సమయం మాత్రమే ఉందంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఆదిపురుష్ మూవీలో కృతి సనన్ సీత పాత్ర చేశారు. కాబట్టి మరో ఐదు నెలలకు ఆదిపురుష్ థియేటర్స్ లో 3D ఫార్మాట్ లో విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది.