ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజా వణికించింది. ఈ దేశం ఆ దేశం అనే తేడాల్లేకుండా అన్ని దేశాల్లో కరోనా మహమ్మారి కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి అమాయక జనాలు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్నా కొందరిలో శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరికొన్ని నెలలు ఆగాల్సిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజలందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది.

అయితే దేశంలో గడిచిన రెండు వారాలుగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. ఒక దశలో దేశంలో రోజుకు 97,000 కేసులు నమోదు కాగా ప్రస్తుతం 70,000 నుంచి 80,000 కేసులు నమోదవుతున్నాయి. అయితే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి అసలు కారణం వెలుగులోకి వచ్చింది. భారత్ లో కరోనా మహమ్మారి పీక్ స్టేజ్ కు చేరి తగ్గుముఖం పడుతోందని వైద్యులు చెబుతున్నారు.
దేశంలో రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గనుందని తెలుస్తోంది. వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరుగుతున్నా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. కరోనా పాజిటివ్ రేటు రోజురోజుకు తగ్గుతుండటంతో ఆర్థికంగా దేశం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రంగాల్లో ఇప్పటికే పురోగతి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
మొదట్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైన జిల్లాల్లో ప్రస్తుతం తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరికొన్ని రోజుల్లో వైరస్ పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. లేదంటే ప్రమాదమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.