ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు ఎన్ని చర్యలు చేపట్టినా కరోనాను కట్టడి చేయడం సాధ్యం కాదు. అప్పటివరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాత్రమే కరోనా బారిన పడకుండా మనల్ని మనం సులభంగా రక్షించుకోవచ్చు. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి కట్టడి కోసం పలు కంపెనీలు కొత్త ఆవిష్కరణలను అందుబాటులోకి తెస్తున్నాయి.
మనలో చాలామంది బయటి నుంచి ఇంట్లోకి వచ్చిన తరువాత దుస్తులకు వైరస్ అంటుకుని ఉండవచ్చని భావిస్తూ ఇంటికి రాగానే దుస్తులను శుభ్రంచేసుకునే పనిలో పడుతున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ చెబుతూ ఐఐటీ ఢిల్లీకి చెందిన ఇ-టెక్స్, క్లెన్‌స్టా అనే కంపెనీలు కొత్త ఆవిష్కరణలను అందుబాటులోకి తెచ్చాయి. ఈ రెండు కంపెనీలు కరోనా బారిన పడకుండా యాంటీ వైరల్ టీ షర్ట్ ను , వైరస్ సోకకుండా రక్షించే లోషన్ ను తయారు చేశారు.
ఈ యాంటీ వైరల్ టీషర్ట్ కరోనా వైరస్ ను నిర్వీర్యం చేయగలదు. 30 ఉతుకుల వరకు ఈ టీషర్ట్ వైరస్ పై ప్రభావం చూపగలదు. కరోనా వైరస్ నుంచి మాత్రమే కాక ఇతర వైరస్ ల నుంచి కూడా ఈ టీషర్ట్ రక్షిస్తుంది. తక్కువ ధరకే ఈ టీషర్టులను అందుబాటులోకి తీసుకురానున్నామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. క్లెన్‌స్టా తయారు చేసిన లోషన్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఈ లోషన్ యాంటీ వైరల్ గుణాలతో పాటు యాంటీ సెఫ్టిక్ గుణాలను కలిగి ఉంది. కరోనా బారిన పడకుండా లోషన్ పూర్తిస్థాయిలో రక్షణనిస్తుంది. సాధారణంగా మనం శానిటైజర్ ను చేతులను శుభ్రం చేసుకోవడానికి మాత్రమే వినియోగించగలుగుతాం. అయితే ఈ లోషన్ చేతులు, కాళ్లు, ముఖం శుభ్రం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోయినా కొత్త ఆవిష్కరణలు కరోనా సోకకుండా రక్షించుకోవడంలో సహాయపడుతున్నాయి.